logo

Sangareddy: భార్యను వేధిస్తున్న అపరిచితుణ్ని భర్తే పట్టించాడు

అంతర్జాలం విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక రకరకాల నేరాలు, మోసాలు పెరుగుతున్నాయి. అశ్లీల చిత్రాలు, వీడియోలతో కొందరు మృగాళ్లు, ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు.

Updated : 20 Jun 2023 10:18 IST

ఈనాడు, సంగారెడ్డి: అంతర్జాలం విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక రకరకాల నేరాలు, మోసాలు పెరుగుతున్నాయి. అశ్లీల చిత్రాలు, వీడియోలతో కొందరు మృగాళ్లు, ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. చాలా మంది బయటకు చెప్పుకోలేక తమలో తామే కుంగిపోతుండడాన్ని ఆసరాగా చేసుకొంటున్న నిందితులు మరింత చెలరేగిపోతుండడం గమనార్హం.

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి భార్యకు ఓ వ్యక్తి అశ్లీల చిత్రాలను వాట్సాప్‌ చేశాడు. ఆమె ఆ విషయాన్ని వెంటనే భర్తకు తెలిపింది. ఆమెకు ధైర్యం చెప్పిన భర్త.. నిందితుణ్ని సాంకేతికత సాయంతో తానే గుర్తించి చాకచక్యంగా పోలీసుల వద్దకు రప్పించి పట్టించడం విశేషం. ఇందుకుగాను అతను కొన్ని యాప్‌ల సాయం తీసుకున్నారు. నిందితుడి ఫోన్‌ నంబరును ఎవరెవరు ఎన్ని రకాలుగా తమ ఫోన్‌లలో నమోదు చేసుకున్నారో గుర్తించారు.

అతడు మెదక్‌ పక్కనే ఉన్న పల్లెటూరుకు చెందిన వ్యక్తని తెలిసింది. మిత్రులతో కలిసి రెండు రోజుల క్రితం ఆ ఊరికి వెళ్లారు. సాంకేతికత ఆధారంగా సేకరించిన అతడి ఫొటోను గ్రామస్థులకు చూపించారు. రుణం చెల్లించడంలేదని చెప్పడంతో.. అతడు సంగారెడ్డి సమీపంలోనే నివసిస్తున్నాడని చెప్పి చిరునామాతోపాటు, అతడి బంధువు ఫోన్‌ నంబరు ఇచ్చారు. బాధితులు ఫిర్యాదు ఇస్తున్నారని తెలిస్తే నిందితుడు పారిపోతాడని గ్రహించి.. బంధువుకు చివరి వరకు రుణం ఎగ్గొట్టాడనే చెబుతూ వచ్చారు. మావాడు చాలా మంచోడు.. మేమే వస్తున్నాం పోలీస్‌స్టేషన్‌కు అంటూ అతన్ని తీసుకొని వారి బంధువులు సోమవారం సంగారెడ్డి గ్రామీణ పోలీస్టేషన్‌కు వచ్చారు. అప్పటికే ఆధారాలతో సిద్ధంగా ఉన్న బాధితురాలి భర్త పోలీసుల సమక్షంలో వాటిని అందరికీ చూపించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు నేరం అంగీకరించాడు. ఆధారాలను పరిశీలించి కేసు నమోదు చేస్తామని సీఐ నవీన్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని