Trisha: ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?

త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 04 May 2024 13:04 IST

‘వర్షం’ ఎప్పుడొచ్చినా తెలుగు ప్రేక్షకుల మదిలో ఆమె మెదులుతుంది.. ‘ఆడవారిమాటలకు అర్థాలే వేరులే!’ అని నిరూపించింది. ‘చిట్టి’లాంటి సరదా పాత్రలైనా ‘రుద్ర’వంటి గ్రే షేడ్‌ క్యారెక్టర్‌లోనైనా అలవోకగా నటిస్తుంది. కెరీర్‌ ప్రారంభించి రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ‘నాయకి’గా రాణిస్తోన్న ఆ భామ ఇంకెవరో కాదు.. త్రిష. లాయరు కావాలనుకున్న ఆమె ఎలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది? ఆమె జీవితాన్ని మార్చిన షరతేంటి? తదితర విశేషాలను నేడు తన పుట్టినరోజు సందర్భంగా తెలుసుకుందాం(Happy Bithday Trisha)..!

పాకెట్‌ మనీ కోసం..

‘డాక్టరు కాబోయి యాక్టర్‌నయ్యా’ అనే మాట ఇండస్ట్రీలో అప్పడప్పుడూ వినిపిస్తుంటుంది. త్రిష సమాధానం మాత్రం విభిన్నం. ‘‘క్రిమినల్‌ సైకాలజీ చదవడం నా తొలి కల. హైస్కూల్‌ రోజుల్లో లాయరు కావాలనుకున్నా. కాలేజీలో చేరాక మోడలింగ్‌పై ఆసక్తి కలిగింది. అలా ప్రయత్నాలు చేస్తుంటే చిన్న ప్రకటనల్లో అవకాశాలు వచ్చాయి. వాటి వల్ల ‘జోడి’లో హీరోయిన్‌ సిమ్రన్‌కు స్నేహితురాలిగా నటించే ఛాన్స్‌ దక్కింది. పాకెట్‌ మనీ కోసమైనా చేద్దామని ఫిక్స్‌ అయ్యా. నాన్న ఓకే చెప్పినా అమ్మ నో అంది. అలక ప్రదర్శిస్తే చివరకు సరేనంది. దాని తర్వాత మరో సినిమాలో నటించే ఆఫర్‌ తలుపు తట్టింది. భయపడుతూనే అమ్మకు చెబితే.. ‘నువ్వు ఆ రంగం వైపు అడుగేస్తావని నేను ఊహించా. కానీ, ఒకటి గుర్తు పెట్టుకో. ఇన్నాళ్లూ ఏ కష్టం లేకుండా పెరిగావు. చిత్ర పరిశ్రమలో ఎత్తుపల్లాలుంటాయి. వాటిని తట్టుకోగలగాలి. రెండేళ్లు ప్రయత్నించు. నీకు కంఫర్ట్‌ అనిపిస్తే నటన కొనసాగించు. లేదంటే బుద్ధిగా చదువుకో’ అని షరతు పెట్టింది. అమ్మ కండిషన్‌ని దృష్టిలో పెట్టుకుని మంచి స్క్రిప్టులు ఎంపిక చేసుకుని, విజయాలు సాధించా. నా జీవితమే మారింది’’ అని ఓ ఇంటర్వ్యూలో త్రిష ఈ విషయాలను పంచుకున్నారు. 

కెరీర్‌ టర్నింగ్‌ పాయింట్‌..

‘నీ మనసు నాకు తెలుసు’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన త్రిష.. ‘వర్షం’లో శైలజ పాత్రతో ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఆ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది. ‘‘చిత్రీకరణలో భాగంగా వరుసగా ఇరవై రోజులు వర్షంలో తడిచా. జ్వరం వచ్చింది. కండిషన్‌ సీరియస్‌ కావడంతో ఆస్పత్రిలో చేరా. సినిమా రిజల్ట్‌ ఎలా ఉంటుందోనన్న సందేహంలో ఉండగా.. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది.. సినిమా హిట్ అవుతుందని అమ్మ చెప్పినట్టే జరిగింది’’ అని తన కెరీర్‌ని మలుపు తిప్పిన ఆ మూవీ సంగతులు పంచుకుంటూ తల్లి ఉమపై ప్రేమను వ్యక్తం చేసింది. ‘వర్షం’ తమిళ్‌ రీమేక్‌లో నటించే ఛాన్స్‌ వచ్చినా వదులుకుంది.

సాహసం..

ఆ బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. టాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన దాదాపు అగ్ర హీరోలందరితో ఆడిపాడిన త్రిష.. నేను చేసిన సాహసం ‘రుద్ర’గా నటించడం అని చెబుతుంటుంది. ధనుష్‌ హీరోగా తెరకెక్కిన ‘కోడి’లోని నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలోని నటనకుగానూ నంది పురస్కారం వరించింది. ఇతర సినిమాల్లోని పాత్రలకు తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డు, నార్వే తమిళ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డు, ఇంటర్నేషనల్‌ తమిళ్‌ ఫిల్మ్‌ అవార్డుసహా పలుమార్లు ఫిల్మ్‌ఫేర్‌, సైమా పురస్కారాలు అందుకుంది.

వివాదాలు..

త్రిష వివాదాల్లో చిక్కుకుందంటే చాలా మందికి ఆశ్చర్యమే. తమిళుల సంప్రదాయమైన జల్లికట్టుకు వ్యతిరేకంగా 2016లో ఆమె ట్వీట్‌ చేయడంతో దుమారం రేగింది. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ స్పందించి ఆమెను బాధపెట్టొందంటూ తమిళనాడు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. దాంతో ఆ గొడవ సద్దుమణిగింది. కోలీవుడ్‌ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యలు గతేడాది హాట్‌టాపిక్‌గా మారాయి. అగ్ర నటుడు చిరంజీవి తదితరులు ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. ఫిబ్రవరిలో.. తమిళనాడుకు చెందిన ఓ పార్టీ మాజీ లీడర్‌ ఆమెపై తీవ్ర స్థాయిలో ఆరోపించడం గమనార్హం. ‘అటెన్షన్‌ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉంది’ అని సోషల్‌ మీడియా వేదికగా త్రిష స్పందించింది.

ఫుల్‌బిజీ..

కెరీర్‌ ప్రారంభమై 20 ఏళ్లకుపైగానే అయినా హీరోయిన్‌గా అన్ని చిత్ర పరిశ్రమల్లో రాణించడం అరుదు. 2023లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన త్రిష.. ప్రస్తుతం ఐదు చిత్రాలతో ఫుల్‌బిజీగా ఉంది. హీరో మోహన్‌లాల్‌ (Mohanlal) సరసన ‘రామ్‌’, అజిత్‌తో ‘విదా ముయార్చి’ (Vidaa Muyarchi), కమల్‌ హాసన్‌ (Kamal Haasan)తో ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life), చిరంజీవి (Chiranjeevi)తో ‘విశ్వంభర’ (Vishwambhara), టొవినో థామస్‌తో ‘ఐడెంటిటీ’ (Identity) చిత్రాల్లో నటిస్తోంది. ‘‘మీ ప్రేమ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’’ అని అభిమానులకు క్రెడిట్‌ ఇచ్చే త్రిషకు హ్యాపీ బర్త్‌డే.

మరికొన్ని సంగతులు..

  • పదహారేళ్ల వయసులో ‘మిస్‌ చెన్నై’ టైటిల్‌ గెలుచుకుంది. ‘మిస్‌ ఇండియా’ పోటీల్లోనూ పాల్గొంది.
  • స్కూల్‌ యూనిఫామ్‌ని ఇప్పటికీ భద్రంగా దాచుకుంది.
  • ముద్దు పేర్లు: హనీ, ది టెర్రర్‌
  • తొలి సంపాదన: రూ. 12,500 (యాడ్స్‌ ద్వారా)
  • బలం: అనుకున్న పని వెంటనే చేయడం
  • బలహీనత: ఓర్పు తక్కువ
  • కాబోయేవాడు ఎలా ఉండాలంటే?: కలివిడిగా మాట్లాడాలి. నన్ను అర్థం చేసుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని