logo

సువిధతో.. అంతా అరచేతిలోనే..

ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్‌గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది.

Published : 19 Apr 2024 01:51 IST

న్యూస్‌టుడే, రామాయంపేట: ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్‌గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ సాంకేతికత అమలుచేస్తుండటం విశేషం. బరిలో ఉన్న అభ్యర్థులు సభలు, సమావేశాలు నిర్వహించాల్సిన సమయంలో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే. ఇందుకు గతంలో సంబంధిత అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్యకు పరిష్కారంగా ఎన్నికల సంఘం సువిధ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనితో అనుమతులు సులభంగా పొందవచ్చు.

ఆన్‌లైన్‌లోనే.. : పోలింగ్‌ సమీపిస్తున్న నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా నిర్వహించే సభలు, సమావేశాలు ఇతర వాటి గురించి అనుమతి పొందేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సువిధ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు దీన్ని పరిశీలించి 48 గంటల్లోనే అనుమతి ఇచ్చేలా రూపొందించారు.


ఇలా ఉపయోగించవచ్చు..

  • సువిధ యాప్‌ వినియోగానికి ముందుగా చరవాణిలో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌  చేసుకోవాలి.
  • అనుమతి పొందాలనుకునే వారు సమావేశం నిర్వహణ వివరాలతో పాటు ఎలాంటి అనుమతులు కావాలో నమోదు చేయాలి. ఇందుకు మీ-సేవలో చలానా చెల్లించాల్సి ఉంటుంది. ఆయా వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. తర్వాత అందుకు సంబంధించిన ప్రతులను రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో అందజేయాలి.
  • 48 గంటల్లో అనుమతి ఇవ్వకపోతే సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి.
  • అనుమతులతో పాటు అభ్యర్థులు తమ నామినేషన్లను సైతం వేసే వెసులుబాటు కల్పించారు.

అనుమతి తప్పనిసరి....

ఎన్నికల నేపథ్యంలో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా అనుమతి తప్పనిసరి. తాత్కాలిక పార్టీ కార్యాలయాల ఏర్పాటు, వాహనాలు, ప్రజలతో ర్యాలీలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారాలు, లౌడ్‌ స్పీకర్లు, జెండాల ఏర్పాటు, పోస్టర్ల వినియోగం వంటి వాటికి ముందస్తుగా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ పరిధిలో ఏఆర్వోలు అందజేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని