logo

‘హస్త’గతం చేసుకోవాలని..!

రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్‌-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది.

Published : 20 Apr 2024 06:26 IST

నేడు మెదక్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక

కార్నర్‌ మీటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు, కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు

న్యూస్‌టుడే-మెదక్‌: రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్‌-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి... ప్రభుత్వ పథకాల అమలు వివరిస్తున్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన రేవంత్‌రెడ్డి... ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి మెతుకుసీమలో అడుగుపెట్టబోతున్నారు. శనివారం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు.

 తిరిగి పాగా వేయాలని

గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పార్టీ అధికారంలోకి రాగా... అదే సెంటిమెంట్తో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మెదక్‌లో సీఎం ప్రచారసభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి ఎంపీగా గెలుపొంది... ప్రధాని పదవిని అధిష్ఠించగా, తిరిగి ఈ స్థానంపై పాగా వేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి కొండా సురేఖకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఆమె లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఆయా సెగ్మెంట్ల పార్టీ మండల, పట్టణ, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులతో ఇటీవల సమావేశమయ్యారు.

రాందాస్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు శనివారం నామినేషన్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం స్థానిక రాందాస్‌ చౌరస్తాలో కార్నర్‌ మీటింగ్‌ను నిర్వహించనున్నారు. ఇందుకు పార్టీ శ్రేణులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి మెదక్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గం లేదా హెలికాప్టర్‌ ద్వారా చేరుకునే అవకాశం ఉండటంతో స్థానిక సీఎస్‌ఐ మైదానంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా రాందాస్‌చౌరస్తా వరకు చేరుకొని ప్రసంగించనున్నారు. శుక్రవారం సీఎస్‌ఐ మైదానంలో హెలిప్యాడ్‌ వద్ద, రాందాస్‌చౌరస్తా వద్ద పనులను మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు పర్యవేక్షించారు. సీఎం హోదాలో తొలిసారి మెదక్‌కు వస్తుండడంతో సభను విజయవంతం చేసేందుకు జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల పార్టీ ముఖ్యనాయకులు భాగస్వాములయ్యారు.

15 స్థానాలను కైవసం చేసుకుంటాం: మంత్రి సురేఖ

మెతుకుసీమ దేశానికి ప్రధాని అందించిన నేల అని, ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ గడ్డ మీద ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరవేస్తామని మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆదేశాల మేరకు మిషన్‌-15 పేరుతో ఎన్నికల కదన రంగంలోకి దిగామని, రాష్ట్రంలో 15 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు మాట్లాడుతూ.. బీసీలు ఐక్యత చాటి నీలం మధుకు మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో భారాస ఒక్క సీటు గెలవదని, మెదక్‌లో మూడో స్థానానికి పరిమితమవుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా కో-ఆప్షన్‌ సభ్యుడు పాలీన్‌ సాంసన్‌, భారాస పట్టణ యువత అధ్యక్షుడు సాంసన్‌ బాని, ఏడో వార్డుకు చెందిన మాయ అనురాధ కాంగ్రెస్‌లో చేరారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, నర్సాపూర్‌ ఇన్‌ఛార్జీ రాజిరెడ్డి, మెదక్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ చంద్రపాల్‌, నాయకులు సుప్రభాత్‌రావు, జీవన్‌రావు, ఉప్పల రాజేశ్‌, రమేశ్‌రెడ్డి, నరేందర్‌, బొజ్జపవన్‌, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌చౌదరి, కౌన్సిలర్లు లక్ష్మి, లింగం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని