logo

లంచం కేసులో ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

లంచం కేసులో డబ్బులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) విచారణలో తేలడంతో మెదక్‌ గ్రామీణ ఎస్సై, కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ మల్టీ జోన్‌-1 ఐజీ రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 23 Apr 2024 06:18 IST

న్యూస్‌టుడే-మెదక్‌, మెదక్‌ రూరల్‌: లంచం కేసులో డబ్బులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) విచారణలో తేలడంతో మెదక్‌ గ్రామీణ ఎస్సై, కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ మల్టీ జోన్‌-1 ఐజీ రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్‌ పట్టణం అవుసులపల్లికి చెందిన చంద్రం గత నెలలో అక్రమంగా ఇసుక తరలించడంతో గ్రామీణ పోలీసులు అతని ట్రాక్టర్‌ను పట్టుకొని కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ విడిపించేందుకు రూ.20 వేలు లంచం ఇవ్వాలని ఠాణా కానిస్టేబుల్‌ సురేందర్‌ డిమాండ్‌ చేయగా, చంద్రం రూ.15 వేలు చెల్లించారు. మిగిలిన రూ.5 వేల కోసం ఒత్తిడి చేయడంతో గత నెల 19న కానిస్టేబుల్‌ సురేందర్‌కు రూ.5 వేలు ఇస్తుండగా, అనిశా అధికారులు పట్టుకున్న విషయం విధితమే. ముందుగా ఇచ్చిన రూ.15వేలు సార్‌కి ఇచ్చానని కానిస్టేబుల్‌ సురేందర్‌ విచారణలో వెల్లడించారని అనిశా డీఎస్పీ ఆనంద్‌ అప్పట్లో వెల్లడించారు. ఈ క్రమంలో ఈనెల 19న అనిశా అధికారులు గ్రామీణ ఎస్సై, కానిస్టేబుల్‌ బాసిత్‌ను మెదక్‌లో విచారించారు. రూ.15వేల లంచం విషయంలో వీరి పాత్ర ఉన్నట్టు రుజువు కావడంతో సోమవారం ఎస్సై అమర్‌, కానిస్టేబుల్‌ బాసిత్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని అదనపు ఎస్పీ మహేందర్‌ ‘న్యూస్‌టుడే’తో ధ్రువీకరించారు.

2018 నుంచి విధులు...

2023 జులైలో ఎస్సై అమర్‌ గ్రామీణ ఠాణా ఎస్సైగా రాగా, కానిస్టేబుల్‌ బాసిత్‌ 2018 నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. కానిస్టేబుల్‌ బాసిత్‌ మధ్యలో రెండు నెలలు జిల్లాలోని హవేలీఘనపూర్‌లో విధులు నిర్వహించి, తిరిగి గ్రామీణ ఠాణాకు వచ్చారు. ప్రస్తుతం అతను స్టేషన్‌ రైటర్‌గా కొనసాగుతున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఇసుక వ్యాపారం చేసే వారి వద్ద నుంచి బాసిత్‌ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తాడని ఆరోపణలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని