logo

కుటుంబ పాలనను తరిమికొట్టాలి

ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు.

Published : 23 Apr 2024 02:55 IST

భాజపా నామినేషన్‌ ర్యాలీలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి

నల్గొండలో మాట్లాడుతున్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చిత్రంలో పార్టీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి,
జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, తదితరులు

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, నీలగిరి : ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇక్కడి కుటుంబ రాజకీయాలను ఎన్నికల్లో ఓడించి తరమికొట్టాలని పిలుపునిచ్చారు. భాజపా అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా నల్గొండలో సోమవారం నిర్వహించిన నామినేషన్‌ ర్యాలీకి ఆయన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజుతో పాటుగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గడియారం చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.‘‘ సీఎం రేవంత్‌ మాటలు తప్ప చేసిందేమీ లేదు. రాహుల్‌గాంధీకి, మోదీకి పోటీ ఉందా? కేంద్రంలో మరోసారి భాజపా జెండా ఎగరడం ఖాయం. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం. యువతకు, మహిళలకు ఉపాధి కల్పించే విధంగా మోదీ పాలన సాగుతోంది. భాజపా ప్రజాప్రతినిధులు లేకున్నా ఈ ప్రాంతానికి మోదీ రహదారులు ఇచ్చారు. ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే కేవలం అది ప్రధాని మోదీ హయాంలోనే’’నన్నారు. భాజపా అభ్యర్థి సైదిరెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే వ్యవసాయంపై ఆధారపడిన ఉమ్మడి నల్గొండలో పారుతున్న కృష్ణా నదితో ఇతర నదులను అనుసంధానం చేసి ఇక్కడ నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. జిల్లాకు అవసరమయ్యే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌, భారాస మాటలను ప్రజలు నమ్మడం లేదని...ఆ పార్టీలు చేసిన మోసాలను గుర్తించి భాజపా వైపు చూస్తున్నారన్నారు.


భారీ ర్యాలీ..

నల్గొండలో నిర్వహించిన సభలో పాల్గొన్న భాజపా నాయకులు, కార్యకర్తలు

నామినేషన్‌ కార్యక్రమం సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్‌రిజిజు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, పార్టీ అభ్యర్థి సైదిరెడ్డితో పాటూ నాయకులు సోమవారం సాయంత్రం నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మర్రిగూడ బైపాస్‌లో ఉన్న లక్ష్మి గార్డెన్‌ నుంచి గడియారం చౌరస్తా వరకు రోడ్‌షో చేసిన నాయకులు అనంతరం ప్రసంగించారు. మహిళలు, యువతులు కోలాటం ఆడుతూ ర్యాలీకి స్వాగతం పలికారు. భాజపా అభ్యర్థికి మద్దతుగా ఎంఆర్‌పీఎస్‌ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు భాజపా అభ్యర్థి సైదిరెడ్డి తన రెండోసెట్‌ నామినేషన్‌ను పార్లమెంటు రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందనకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీ అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌, పార్లమెంటు కో కన్వీనర్‌ రామరాజు యాదవ్‌తో కలిసి సమర్పించారు. రోడ్‌షోలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి, గోలి అమరేందర్‌రెడ్డి, గార్లపాటి జితేంద్రకుమార్‌, బండారు ప్రసాద్‌, పోతేపాక సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని