logo

ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు.

Updated : 25 Apr 2024 06:41 IST

మిర్యాలగూడ రోడ్‌షోలో పిడికిలి బిగించి నినదిస్తున్న కేసీఆర్‌. చిత్రంలో కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, మిర్యాలగూడ, భానుపురి: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఆయన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కేఆర్‌ఎంబీకి అప్పగించిన దానిపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌, మరో మంత్రి కోమటిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బస్సుయాత్రకు మిర్యాలగూడ పట్టణాన్ని గులాబీమయం చేశారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు నాలుగు రోజులుగా కేసీఆర్‌ రోడ్‌షో ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్టణంలోని కూడళ్ళలో భారీ హోర్డింగ్‌లు, గులాబీ రంగు తోరణాలు ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ బస్సు యాత్ర పొడవునా పూలు చల్లారు. రోడ్‌షో సాయంత్రం ఉన్నా ప్రజలు, కార్యకర్తలు మధ్యాహ్నం నుంచే గ్రామాల నుంచి ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, ప్రత్యేక బస్సుల్లో మిర్యాలగూడ, సూర్యాపేటకు చేరుకున్నారు. మహిళలు బోనాలతో, కళాకారులు గుస్సాడీ నృత్యాలు, డీజేలతో బస్సుయాత్రకు స్వాగతం పలికారు. మిర్యాలగూడలో పలు కూడళ్లలో కళాకారుల ఆటాపాటా ఏర్పాటు చేశారు. హనుమాన్‌పేట కూడలి నుంచి రాజీవ్‌ కూడలి వరకు ఎక్కడ చూసినా జన సందోహం కనిపించింది. పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద గుస్సాడీ నృత్య కళాకారుల ప్రదర్శనలను వందలాది మంది తిలకించారు. రాజీవ్‌ కూడలి నాలుగువైపులా గుంపులుగా నిలిచిన ప్రజలకు కేసీఆర్‌ అభివాదం చేస్తూ ప్రసంగించారు. సుమారు గంట మిర్యాలగూడలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి 18 నిమిషాలు మాట్లాడారు. ప్రజలతో మమేకం కావడానికే తాను బస్సుయాత్ర చేస్తున్నట్లు ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి ఈ మేరకు మిర్యాలగూడ నుంచి సూర్యాపేట మార్గంలో వెళ్తూ పలు చోట్ల బస్సును ఆపి స్థానికులతో ముచ్చటించారు. కాంగ్రెస్‌ పార్టీ హామీలతో ప్రజలను మోసం చేసిందని...దీనిపై ఉద్యమిద్దామని భారాస అండగా ఉంటుందని ప్రజలకు భరోసానిచ్చారు.  

నకిరేకల్‌: మాజీ సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్న భారాస శ్రేణులు

ప్రజల కష్టాలు తీర్చేందుకే పోరుబాట: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చేందుకే కేసీఆర్‌ మరోసారి ‘ పోరుబాట’ బస్సుయాత్ర కార్యక్రమం చేపట్టారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్గొండ లోక్‌సభ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తరఫున ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ రాజీవ్‌ కూడలిలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో  ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు మనవారికి దక్కాలంటే అందుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే  మార్గమని కేసీఆర్‌ ఉద్యమించారన్నారు. పదేళ్లలో తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారన్నారు.

మిర్యాలగూడలో కార్నర్‌ మీటింగ్‌కు హాజరైన జనం

అవీ...ఇవీ

  • సాయంత్రం 6.18 గంటలకు కేసీఆర్‌ మిర్యాలగూడ హనుమాన్‌పేట కూడలికి బస్సులో రాక
  • 6.51 వరకు హనుమాన్‌పేట కూడలి నుంచి బస్సులో రోడ్‌షోతో రాజీవ్‌కూడలికి తరలివచ్చారు.
  • 6.54 గంటలకు కేసీఆర్‌ ప్రసంగం ప్రారంభించారు.
  • టపాసులు ఆపాలని పలుమార్లు కేసీఆర్‌ చెబుతున్నా ఆపక పోవటంతో పోలీసులకు వినతి చేశారు.
  • 7.12 గంటలకు కేసీఆర్‌ ప్రసంగం ముగిసింది.
  • 8.55కి సూర్యాపేటకు చేరుకున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని