logo

ఉద్యమ నాయకులు..ప్రస్తుత ప్రత్యర్థులు

ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు లేని ప్రత్యేకత బాన్సువాడకు ఉంది.

Published : 11 Nov 2023 06:19 IST

న్యూస్‌టుడే - బాన్సువాడ: ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు లేని ప్రత్యేకత బాన్సువాడకు ఉంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తూన్న ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు.. పోచారం శ్రీనివాస్‌రెడ్డి (భారాస), ఏనుగు రవీందర్‌రెడ్డి (కాంగ్రెస్‌), యెండల లక్ష్మీనారాయణ (భాజపా) ‘తెలంగాణ’ ఉద్యమ సమయంలో తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి గెలుపొందిన వారు కావడం విశేషం. ఉద్యమ సమయంలో తెదేపా ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పటి తెరాసలో చేరారు. తర్వాత 2011లో జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యేగా ఉన్న భాజపా నాయకుడు యెండల లక్ష్మీనారాయణ 2010లో రాజీనామా చేశారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలో అదే పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెరాస అధిష్ఠానం పిలుపు మేరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఏనుగు రవీందర్‌రెడ్డి 2010లో రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఏనుగు రవీందర్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు నేతలు బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు వీరు ముగ్గురికీ సుదీర్ఘ రాజకీయ, ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఇలాంటి ప్రత్యేకత లేదు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం ఎనిమిదో సారి (1994, 1999, 2004, 2009, 2011, 2014, 2018, 2023) పోటీ చేస్తున్నారు. ఏనుగు రవీందర్‌రెడ్డి ఏడో సారి (2004, 2008, 2009, 2010, 2014, 2018, 2023), యెండల లక్ష్మీనారాయణ ఐదోసారి (1999, 2009, 2010, 2018, 2023) ఎన్నికల బరిలో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని