logo

మిగిలింది పది రోజులే..

లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వానికి ఇంకా పది రోజులే గడువుంది. ఈ నెల 13న పోలింగ్‌ జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందుగా 11వ తేదీ సాయంత్రానికే ప్రచారానికి తెరపడనుంది. మూడు ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్‌ షోలతో హోరెత్తిస్తున్నాయి.

Updated : 02 May 2024 06:58 IST

ప్రచారం హోరెత్తిస్తున్నారు
ఈనాడు, నిజామాబాద్‌

లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వానికి ఇంకా పది రోజులే గడువుంది. ఈ నెల 13న పోలింగ్‌ జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందుగా 11వ తేదీ సాయంత్రానికే ప్రచారానికి తెరపడనుంది. మూడు ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్‌ షోలతో హోరెత్తిస్తున్నాయి. ఆయా పార్టీల నాయకత్వం రోజులో రెండేసి నియోజకవర్గాలను చుట్టేస్తూ బలమైన వర్గాలే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నాయి. ముగ్గురు అభ్యర్థులు తమ ప్రసంగాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేస్తుండటంతో ఇందూరు రాజకీయాల్లో వేడి రాజుకుంది. మరోపక్క గడువులోగా అధిష్ఠాన పెద్దలతో బహిరంగ సభల నిర్వహణ ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకొనే వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కార్యాచరణతో ముందుకెళ్తున్నారు.

రాత్రి వేళల్లోనూ..

ఎండలతో ఉష్ణోగ్రతలు పెరిగి సభలు, ప్రచార కార్యక్రమాలకు ఇబ్బందిగా మారిందని నేతలు చెబుతున్నారు. సభలు, సమావేశాలకు జనసమీకరణ, నిర్వహణ కష్టతరంగానే ఉందని చెబుతున్నారు. ఉదయం వేళల్లో ప్రాంగణాల్లో సభలు నిర్వహించుకుంటూ వచ్చారు. ప్రచారానికి గడువు దగ్గరపడుతుండటంతో సాయంత్రం రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు. చీకటి పడ్డాక ప్రచార సమయం ముగిసే వరకు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గడువు దగ్గరపడే కొద్దీ ఎండను దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే ఆ రోజు ప్రణాళిక మేరకు ఆయా గ్రామాలకు వెళ్లి ఉపాధి కూలీలు, రైతులను కలుస్తున్నారు. అటు జగిత్యాల, ఇటు నిజామాబాద్‌ జిల్లాల్లో విస్తరించి ఉన్న ప్రాంతాలను చుట్టేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. గ్రామ స్థాయికి వెళ్తున్న క్రమంలో స్థానిక సమస్యలను.. అక్కడ జరగాల్సిన అభివృద్ధి గురించి ప్రస్తావిస్తున్నారు.

చేరికలపై దృష్టి సారిస్తూ..

పార్టీలు ఓటర్లపై ప్రభావం చూపే అంశాలపై దృష్టి పెట్టాయి. బలాన్ని పెంచుకొనే క్రమంలో ఇతర పార్టీల్లో అసంతృప్తులకు గాలం వేస్తూ చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. కొత్తగా వస్తున్నవారికి..పాత నాయకులకు సమన్వయం చేయటం..ప్రచారంలో భాగస్వాములను చేయడం లేదని తెలుస్తోంది. బలమైన సామాజికవర్గాల్లో పెద్ద మనుషులను మూడు పార్టీల అభ్యర్థులు కలుస్తూ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారితో జరిగే మంతనాల్లో ఎటువంటి హామీలిస్తున్నారు? ఆయా సంఘాలు, వర్గాల పెద్దలు ఎంత మేరకు సదరు అభ్యర్థి పట్ల సంతృప్తికర అభిప్రాయంతో ఉంటున్నారనే విషయాలు బహిర్గతం కావటం లేదు.

ఈ వారంలో పెద్ద నేతల రాక..

మూడు పార్టీల పెద్ద నేేతలు నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో ప్రచారానికి రానున్నారు. 5వ తేదీన కేంద్ర హోమంత్రి అమిత్‌ షా ఇందూరులో పర్యటించనున్నారు. భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ తరఫున ఆయన ప్రచారంలో పాల్గొంటారు. ఇందుకు పార్టీ భారీగా ఏర్పాట్లు చేసే పనుల్లో నిమగ్నమైంది. ఇప్పటికే పార్లమెంట్‌ నియోజకవర్గంలో రెండు బహిరంగ సభలను కాంగ్రెస్‌ పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డి తరఫున సభల్లో పాల్గొన్నారు. ఆర్మూర్‌ ప్రాంతంలో మరో వారం రోజుల్లో జరిగే సభకు సీఎం హాజరవుతారని కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నాయి. భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ నామినేషన్‌ సందర్భంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ నెల 5న జగిత్యాల, 6న నిజామాబాద్‌లో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ రోడ్‌ షోల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం భారాస నేతలు భారీ కసరత్తే చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని