logo

ఒకే కుటుంబం నుంచి అయిదుగురు ఎమ్మెల్యేలు

ఆదివాసీల కోసం కేటాయించిన పొట్టంగి నియోజకవర్గంలో పంగి కుటుంబం ఎక్కువసార్లు విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచే ఎక్కువమంది ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు.

Published : 12 Apr 2024 06:21 IST

నియోజకవర్గంలో పంగి కుటుంబం రికార్డు

చంద్రమా శాంత (పాత చిత్రం), జయరామ్‌ పంగి, ప్రఫుల్ల కుమార్‌ పంగి

సిమిలిగడ, న్యూస్‌టుడే: ఆదివాసీల కోసం కేటాయించిన పొట్టంగి నియోజకవర్గంలో పంగి కుటుంబం ఎక్కువసార్లు విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచే ఎక్కువమంది ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. కొరాపుట్‌ జిల్లాలో పొట్టంగి ప్రాంతానికి చెందిన పంగి కుటుంబానికి తొలి నుంచే రాజకీయంలో మంచిపట్టుంది. 1957లో ఆ కుటుంబం నుంచి మలు శాంత మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపొందారు. ఆయన స్ఫూర్తితో ముసురీ పంగి 1961లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి పొట్టంగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తండ్రి ఆశయాలతో రాజకీయంపై ఆసక్తితో జయరామ్‌ పంగి జనతా పార్టీలో చేరి 1977లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1990లో జనతాదళ్‌ అభ్యర్థిగా, 2000, 2024లో బిజద అభ్యర్థిగా పోటీచేసి జయరామ్‌ విజయం సాధించారు. 2009లో కొరాపుట్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మేనత్త చంద్రమా శాంత 1980, 1985లో పొట్టంగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జయరామ్‌ అన్న కుమారుడు ప్రఫుల్ల కుమార్‌ పంగి 2014లో గెలుపొందారు. జయరామ్‌ కుమారుడు అశోక్‌ కుమార్‌ పంగి కొరాపుట్‌ జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. రెండో కుమారుడు జగత్‌ జ్యోతి సమితి అధ్యక్షుడిగా, కుమార్తె అంబికా సమితి సభ్యురాలుగా పనిచేశారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ అధికారంలో ఉంటూ ప్రజాసేవ చేసిన అనుభవం ఉంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ద్వారా జయరామ్‌ టికెట్‌ ఆశించినా ఫలితం లేకపోయింది. ప్రఫుల్లకు బిజద తరఫున అవకాశం లభించింది. పొట్టంగిలో పంగి కుటుంబం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 13 సార్లు జరిగిన ఎన్నికల్లో 9 సార్లు ఈ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా నెగ్గడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని