అజీర్తి సమస్యకు మామిడి పండే ఔషధం!

పోషకాలకు, రుచికి పెట్టింది పేరైన మామిడి పండు.. అజీర్తి నివారణకు సహజ ఔషధంగా పనిచేస్తుందని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఆచార్యులు తమ పరిశోధనలో గుర్తించారు.

Updated : 04 May 2024 12:02 IST

ఎలుకలపై హెచ్‌సీయూ ఆచార్యుల పరిశోధనలో గుర్తింపు
అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ జర్నల్‌లో ప్రచురణ
వైద్యపరంగా ‘మాంగిఫెరిన్‌’ అభివృద్ధిపై దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: పోషకాలకు, రుచికి పెట్టింది పేరైన మామిడి పండు.. అజీర్తి నివారణకు సహజ ఔషధంగా పనిచేస్తుందని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఆచార్యులు తమ పరిశోధనలో గుర్తించారు. మామిడిలో ఉండే మాంగిఫెరిన్‌ రసాయనం (బయోయాక్టివ్‌ కాంపొనెంట్‌) అజీర్తిని నివారిస్తుందని ఎలుకలపై చేసిన పరిశోధన ద్వారా శాస్త్రీయంగా నిర్ధారించారు. ఈ అధ్యయనం వివరాలు ‘అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ ఫార్మాకాలజీ, ట్రాన్స్‌లేషన్‌’ జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి.

మామిడిపండ్లలో లభించే మాంగిఫెరిన్‌ రసాయం.. అజీర్తిని తగ్గిస్తుందా? పెద్దపేగు, చిన్నపేగులో జీర్ణ వ్యవస్థను చురుకుగా పనిచేయిస్తుందా? పేగు కాన్సర్‌ కారక కణాలను నిర్వీర్యం చేస్తుందా? అన్న అంశాలను తెలుసుకునేందుకు హెచ్‌సీయూ ఆచార్యులు రెడ్డన్న, పరిశోధకులు డాక్టర్‌ గంగాధర్‌, కె.సురేష్‌, కె.అనిల్‌ మూడేళ్ల క్రితం నడుంకట్టారు. ఇందుకోసం ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ఎలుకలకు కృత్రిమ అజీర్తిని కల్పించి, ఔషధంగా  మాంగిఫెరిన్‌ ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో వాటిలో అజీర్తి తగ్గడంతో పాటు, జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేయడం, కోలన్‌ క్యాన్సర్‌ సెల్‌ లైన్‌ దాదాపుగా నిర్వీర్యం కావడాన్ని గుర్తించారు. దీంతో మాంగిఫెరిన్‌ను వైద్యపరంగా అభివృద్ధి చేసేందుకు ముందస్తు క్లినికల్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

పెరుగుతున్న జీర్ణకోశ సమస్యలు

‘‘మన దేశంలో చాలామంది మసాలాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో జీర్ణాశయాంతర పేగు పనితీరు క్రమంగా తగ్గుతోంది. దీంతో పేగువాపు వ్యాధి (ఇన్‌ఫ్లమేటరీ బౌల్‌ డిసీజెస్‌)తో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 1990 నుంచి 2019 మధ్య ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రెట్టింపైంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల ఫలితంగా అజీర్తి సమస్య దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది. ఈ సమస్యకు వేసవిలో లభించే మామిడి పండ్లతో ప్రయోజనం చేకూరుతుందని మా పరిశోధనలో గుర్తించాం.


వైద్యుల సలహాతో.. మధుమేహులూ తినొచ్చు

మామిడి పండ్లు తింటే రక్తంలో గ్లూకోజ్‌ పరిమాణం పెరుగుతుంది. అయితే ఈ పండ్లలో గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ లెవెల్‌ (జీఐ) 51 వరకు మాత్రమే ఉంటున్నందున మధుమేహులు ఈ పండ్లను తిన్నా ఇబ్బందులు లేవని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వైద్యుల సలహాతో మధుమేహ బాధితులూ వీటిని తినొచ్చు’’ అని రెడ్డన్న తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని