logo

నవరంగపూర్‌లో త్రిముఖం..ఎవరిదో విజయం

గత పదేళ్ల కిందటి వరకు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న నవరంగపూర్‌ లోక్‌సభ స్థానంలో క్రమేణా బిజద బలం పుంజుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతోపాటు భాజపా కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారింది.

Published : 23 Apr 2024 02:47 IST

నవరంగపూర్‌, న్యూస్‌టుడే : గత పదేళ్ల కిందటి వరకు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న నవరంగపూర్‌ లోక్‌సభ స్థానంలో క్రమేణా బిజద బలం పుంజుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతోపాటు భాజపా కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారింది. 2017, 2019లలో 36.58, 33.85 శాతం ఓట్లతో బిజద విజయం సాధించింది. 1967-1999 వరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఖగపతి ప్రధాని వరుసగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఆ తరువాత 2009లో ప్రదీప్‌ మాఝి మరోసారి కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయం సాధించారు. గడిచిన ఐదేళ్లలో నవరంగపూర్‌ లోక్‌సభ స్థానం పరిధిలో బిజద, భాజపాలు బలపడ్డాయి. 2014 వరకు కాంగ్రెస్‌కు తిరుగులేదన్న భావన ఉన్నా 2014లో బిజద తరఫున బలభద్ర మాఝి గెలుపొందగా, 2019లో అదే పార్టీ తరఫున రమేష్‌చంద్ర మాఝి గెలవడంతో ఇకపై నవరంగపూర్‌లో ఎంపీ స్థానం గెలవడం కాంగ్రెస్‌కు కష్టమేనన్న వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయి. మరోవైపు కాంగ్రెస్‌లోకి వలసలు పెరగడంతో క్రమంగా బలం పుంజుకుంది. 2014లో బిజద తరఫున ఎంపీగా గెలిచిన బలభద్ర మాఝి 2019లో భాజపాలో చేరడంతో మూడు పార్టీలు బలం పెంచుకున్నాయి. ఈసారి బిజద తరఫున ప్రదీప్‌ మాఝి, భాజపా తరఫున బలభద్ర మాఝి, కాంగ్రెస్‌ తరఫున భుజబల్‌ మాఝి బరిలోకి దిగనున్నారు. జిల్లాలో రైల్వే లైను, శీతల గిడ్డంగుల నిర్మాణం, తాగునీటి సమస్యలు, రహదారులు నిర్మిస్తామని పదేళ్లుగా బిజద హామీలు ఇస్తున్నా ఇప్పటికీ నెరవేరకపోవడంతో ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని, భాజపా జిల్లా అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్నా బిజద వాటిని సద్వినియోగం చేయడం లేదని రెండేళ్లుగా గట్టి ప్రచారం సాగుతోంది. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని, కాంగ్రెస్‌ను గెలిపించాలని కాంగ్రెస్‌ కోరుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారోనన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని