logo

జగనన్న కాలనీలా.. చిట్టడవులా!

‘రాష్ట్రంలో ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నా’మంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న జగనన్న కాలనీలు చిన్నపాటి అడవులను తలపిస్తున్నాయి.

Published : 23 Apr 2024 04:47 IST

 వసతుల్లేక సాగని గృహ నిర్మాణాలు
కట్టడానికి నీళ్లు.. నడవడానికి రోడ్లులేని దుస్థితి

వై.పాలెం-మిల్లంపల్లెలోని జగనన్న కాలనీలో చిల్లచెట్లు పెరిగిపోయిన దృశ్యం

‘రాష్ట్రంలో ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నా’మంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న జగనన్న కాలనీలు చిన్నపాటి అడవులను తలపిస్తున్నాయి. ఇప్పుడున్న నివాస ప్రాంతాలకు దూరంగా కొండలు, గుట్టల్లో ఇవ్వడం.. నీటి వసతి, రోడ్ల వసతి లేకపోవడంతో ఇళ్లన్నీ పునాదుల దశలోనే నిలిచిపోయాయి. నిర్మాణం చేపట్టకపోతే పట్టాలు రద్దు చేస్తామని అధికారులు, నాయకులు హుకుం జారీ చేయడంతో భయపడిన లబ్ధిదారులు బేస్‌మట్టాలు వేసుకుని వదిలేశారు. ఎక్కువమంది లబ్ధిదారులు పునాదుల గుంతలు తీసి జియోట్యాగింగ్‌ చేసుకుని మిన్నకుండిపోయారు. నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో 47చోట్ల జగనన్న కాలనీలు ఏర్పాటు చేయగా.. వీటిలో ఒక్కటంటే ఒక్కటీ పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరిగినవి లేవు.

 యర్రగొండపాలెం, యర్రగొండపాలెం పట్టణం, త్రిపురాంతకం గ్రామీణం

  •  వై.పాలెం మండలం బోయలపల్లెలో ఊరికి దూరంగా కొండ పక్కన పట్టాలిచ్చి కాలనీ ఏర్పాటుచేశారు. దీంతో నిర్మాణాలకు ఎవరూ ముందుకు రాలేదు.
  • మిల్లంపల్లె లే అవుట్‌లో  ఇల్లు కట్టడానికి అవసరమైన నీటి వసతి లేదు. ప్రధాన రహదారి గోతులు పడి అధ్వానంగా మారింది. లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో దాదాపు 200 ఇళ్లు రద్దు చేసి ఇతర చోట్ల వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలకు సర్దుబాటు చేశారు. 40 ఎకరాల విస్తీర్ణంలోని ఈ లేఅవుట్‌లో నివాసముంటుంది కేవలం నలుగురు మాత్రమే.‌
  • ఎన్నికలకు కొన్నిరోజుల ముందే చాలాచోట్ల వైకాపా నాయకులు, కార్యకర్తలకే మంజూరు చేసి అడ్వాన్సులు చెల్లించారు. పుల్లలచెరువు మండలంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. వైకాపా నాయకులే బినామీ పేర్లతో మంజూరు చేయించుకుని ప్రభుత్వం నుంచి అడ్వాన్సులు తీసుకుని నిర్మాణాలు మొదలు పెట్టలేదు. అధికారులు రెండుమూడుసార్లు నోటీసులిచ్చినా చలనం లేదు.
  • నియోజకవర్గంలో 3,949 గృహాలు మంజూరు చేయగా అయిదేళ్ల కాలంలో పూర్తి చేసింది కేవలం 1,505 మాత్రమే. ఇవికాక కప్పు వేసినవి మరో 152 ఉన్నాయి. 855 ఇళ్లు ఇంకా బేస్‌మెంట్‌ స్థాయిలోనే నిలిచిపోయాయి. అయిదు మండలాల్లోని లే అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో రెండు విడతల్లో 970 ఇళ్లు రద్దు చేసి వ్యక్తిగత గృహ నిర్మాణాలకు కేటాయించారు.

పిచ్చి చెట్లు మొలిచి :   త్రిపురాంతకం మండలంలోని మేడపి గ్రామ శివారులో ఇళ్లు లేని నిరుపేదలకు వైకాపా ప్రభుత్వం రూ.50లక్షలు వెచ్చించి 60 మందికి పైగా నివేశన స్థలాలను మంజూరు చేసింది. బోర్లు తవ్వించి, వాటర్‌ ట్యాంకులు నిర్మించినా పక్కనే శ్మశానం ఉండటంతో పాటు గ్రామానికి శివారులో మంజూరు చేయడంతో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ఆసక్తి చూప లేదు. శ్మశానం ఉండటంతో లేఅవుట్‌ చుట్టూ ప్రహరీ నిర్మించినా అక్కడ నివాసం ఉండేందుకు ముందుకు రాలేదు. దీంతో పిచ్చి చెట్లు మొలిచి చిట్టడవిని తలపిస్తోంది..


నేటికీ హద్దులు చూపలేదు

నా భార్య పేరిట పట్టా ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని చెప్పించారు . హద్దులే చూపించని స్థలానికి రిజిస్ట్రేషన్‌ చేసుకోమనడం ఏమిటో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి చాలా మంది పేదలు నష్టపోయారు. ఆ ఇంటి పట్టాను ప్రభుత్వానికే వెనక్కు ఇచ్చాం.

తోకల ఎల్లయ్య, తంగిరాలపల్లి


రోడ్లు దారుణంగా ఉన్నాయి

వై.పాలెం మండలం మిల్లంపల్లె లేఅవుట్‌లో నివాసముంటున్నాం. కాలనీలోకి వెళ్లే ప్రధాన రోడ్డు ఏటవాలుగా ఉండడం.. వర్షాలకు కోతకు గురై గుంతలు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. మాలాంటి దివ్యాంగులు త్రిచక్ర వాహనాలపై వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది.   

 పాలంకయ్య, వై.పాలెం


నా పట్టాను మరొకరికి మార్చారు  

నాపేరున పట్టానంబర్‌ 680 పట్టా మంజూరైంది. ఆ నంబరును కొట్టేసి 1360  నంబరు మార్చి ఇచ్చారు. మొదట ఇచ్చిన నంబరు మరొకరి వీఆర్వో డబ్బులు తీసుకుని  ఇచ్చారు. చెల్లుబాటు కాని పట్టాతో ఇళ్లు నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. నాలాగే చాలామంది ఉన్నారు.

 కొమ్ముల కోటమ్మ  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని