logo

థర్మల్‌ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్‌?

అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్‌ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు.

Published : 25 Apr 2024 04:34 IST

బీల జీవో రద్దు కాలేదు.. కేసులూ ఎత్తేయలేదు
రేపు, మాపని ఐదేళ్లూ సరి పెట్టేశారు

అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్‌ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. వైకాపా శ్రేణులు సైతం అన్న బాటలోనే నడిచి ప్రజలకు నచ్చజెప్పి ఓట్లు వేయించారు.. సారు గద్దెనెక్కిన తర్వాత హామీలు అమలు చేయకపోవడంతో కంగు తినడం సామాన్యుల వంతైంది. ఇదే అనుభవం థర్మల్‌ ఆందోళనకారులకూ ఎదురైంది.

న్యూస్‌టుడే, సోంపేట

థర్మల్‌ విద్యుత్తు కేంద్రం భూమిపూజ పనులను అడ్డుకోవడానికి వచ్చిన వారిని తరుముతున్న పోలీసులు (పాతచిత్రం)

‘కొద్ది రోజులు ఆగండి.. మనం అధికారంలోకి వస్తున్నాం. ‘బీల సమస్య పరిష్కరించి థర్మల్‌ ఆందోళనకారులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేద్దాం. జీవో 329 రద్దు చేసి చిత్తడి నేలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం’ అని జగన్‌ పాదయాత్రలో థర్మల్‌ వ్యతిరేక ఉద్యమకారులకు ఇచ్చిన హామీ నేరవేర్చకపోవడంతో బీల ప్రాంత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు..

వైకాపా ప్రభుత్వానికి పట్టని రైతుల మొర

సోంపేట బీల ప్రాంతంలో థర్మల్‌ విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు 2008లో ఇక్కడ 973 ఎకరాలను కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం 1107 జీవో విడుదల చేసింది. కంపెనీ అదనంగా 600కు పైగా ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేసింది. విశిష్ట చిత్తడి నేలలు కలిగిన బీలలో థర్మల్‌ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేస్తే జీవవైవిధ్యం, పర్యావరణం, భూగర్భ జలాలకు ముప్పు ఏర్పడుతుందని.. వ్యవసాయం, కొబ్బరి తోటల సాగుకు సమస్యలు తలెత్తుతాయని ఈ ప్రాంత ప్రజలు ప్రాణాలొడ్డి పోరాడారు. సోంపేట కాల్పుల ఘటన తర్వాత 2010లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ పలుమార్లు అధ్యయనం చేసి విశిష్ట చిత్తడి నేలలు కలిగిన ఈ ప్రాంతాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని నివేదిక ఇచ్చింది.

తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ థర్మల్‌ విద్యుత్తు కేంద్రం అనుమతులు, 1107 జీవోను రద్దు చేసింది. ఆహార శుద్ధి, వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా 329 జీవో విడుదల చేసింది. ఈ ప్రాంత ప్రజలు, ఉద్యమకారులు కొత్త జీవోను వ్యతిరేకించారు. ఈలోగా పాదయాత్రకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఉద్యమకారుల బృందం సమస్యను తీసుకెళ్లగా కొద్ది రోజులు ఆగితే జీవో రద్దు చేసుకుందామన్నారు. తరువాత పలుమార్లు ముఖ్యమంత్రిని కలిసినా ప్రయోజనం లేకపోయింది.

సామాన్యులు ప్రాణాలొడ్డి పోరాడింది ఈ బీల భూముల కోసమే

కేసులతో ఇబ్బందులు  

  • థర్మల్‌ విద్యుత్తు కేంద్రం భూమి పూజ పనులను అడ్డుకోవడానికి 2010 జులై 14న రైతులు, మత్స్యకారులు, ఇతర వర్గాల ప్రజలు పెద్దఎత్తున బీలకు తరలివచ్చారు.
  • పెద్దఎత్తున్న ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు తుపాకులను ఎక్కుపెట్టారు. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఠీఛార్జిలో వెయ్యి మంది వరకు ప్రజలు తీవ్రంగా గాయపడి దీర్ఘకాలిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల చేతిలో 126 మంది పోలీసులు గాయపడ్డారు.
  • 723 మంది ఆందోళనకారులపై పోలీసులు కేసులు పెట్టారు. అంతకు ముందు వివిధ ఘటనలకు సంబంధించి ఉద్యమ నాయకుల్లో ఒకొక్కరు 50 వరకు కేసులు ఎదుర్కొన్నారు.
  • జులై 14 ఘటనకు సంబంధించిన కేసును నాన్చుతూ రావడంతో యువత, ఇతర వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంత యువత ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్తుంటారు. థర్మల్‌ కేసుతో పాస్‌పోర్టు, ఇతర అంశాలకు సంబంధించిన అనుమతులు రాకపోవడంతో జీవనోపాధి కష్టంగా మారింది. 14 ఏళ్లుగా ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

హామీ ఇచ్చి విస్మరించారు..

బీల ప్రాంతానికి సంబంధించి 329 జీవో, ఆందోళనకారులపై పెట్టిన పోలీసు కేసు రద్దు చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి విస్మరించారు. ఆయనను పలుమార్లు కలిసి సమస్యను వివరించగా పరిశీలనలో ఉందని.. త్వరలో రద్దు అవుతుందని చెప్పారే తప్ప పరిష్కరించలేదు. యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర దేశాల్లో ఉపాధి పొందడానికి కేసు ఆటంకంగా మారింది.

డాక్టర్‌ వై.కృష్ణమూర్తి, అధ్యక్షుడు, పర్యావరణ పరిరక్షణ సంఘం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని