logo

పచ్చదనం గాలికొదిలేశారు.. ప్రజాధనం వృథా చేశారు..!

జగనన్న ఏలుబడిలో మొక్కలకూ రక్షణ కరవైంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘జగనన్న హరిత నగరాలు-గ్రీన్‌ సీటీ ఛాలెంజ్‌’ కార్యక్రమం ఆదిలోనే తుస్సుమంది.

Published : 29 Apr 2024 05:49 IST

లక్ష్యానికి దూరంగా జగనన్న హరిత నగరాలు..!

జగనన్న ఏలుబడిలో మొక్కలకూ రక్షణ కరవైంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘జగనన్న హరిత నగరాలు-గ్రీన్‌ సీటీ ఛాలెంజ్‌’ కార్యక్రమం ఆదిలోనే తుస్సుమంది. జిల్లాలోని పురపాలక సంఘాలు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన రోడ్లు, కాలనీ రహదారులకు ఇరువైపులా గతేడాది ఆగస్టులో పెద్దఎత్తున మొక్కలు నాటారు. అవి ప్రస్తుతం చాలావరకు కనిపించడం లేదు. సంరక్షణ చర్యలను గాలికొదిలేయడంతో ప్రజాధనం వృథా అయింది. సుమారు 80 శాతం వరకు మొక్కల ఆనవాళ్లు లేకుండా పోయాయి.

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం, ఆమదాలవలస పట్టణం, పలాస, కాశీబుగ్గ,  ఇచ్ఛాపురం  


శ్రీకాకుళం

శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులకు ఇరువైపులా 22 కి.మీ. మేర మొక్కలు నాటారు. రూ.1.68 కోట్ల వ్యయంతో 23 ప్యాకేజీలుగా విభజించి 14,187 మొక్కలు నాటారు. సంరక్షణ బాధ్యతను గుత్తేదారులు పట్టించుకోకపోవడంతో చాలా వరకు దెబ్బతిన్నాయి. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటకున్నా నగరపాలక సంస్థ అధికారులు గుత్తేదారులకు బిల్లులు చెల్లించేశారు. ప్రస్తుతం చాలా చోట్ల మొక్కలు కనిపించడం లేదు. వాటికి దన్నుగా ఏర్పాటు చేసిన కర్రలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. పీఎన్‌ కాలనీలో పరిస్థితిని చిత్రంలో చూడవచ్చు.

ఇచ్ఛాపురం

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్ఛాపురం పట్టణంలో నాలుగు చెరువు గట్లపై మొక్కలు నాటేందుకు రూ.5 లక్షలు చొప్పున కేటాయించారు. తీవ్ర వర్షాభావం, మొక్కలు సరఫరా చేయకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. తెదేపా హయాంలో పట్టణ వ్యాప్తంగా పలు వీధుల్లో మొక్కలు నాటారు. అవి చాలా వరకు వృక్షాలుగా ఎదిగి ప్రస్తుతం నీడనిస్తున్నాయి.

ఆమదాలవలస

ఆమదాలవలస పట్టణంలో ప్రధాన రహదారి, కృష్ణాపురం నుంచి పార్వతీశంపేట వరకు, మెట్టక్కివలస, సొట్టవానిపేట, గేదెలవానిపేట చెరువు గట్టు, తిమ్మాపురంలో ఎన్టీఆర్‌ కాలనీ, జగ్గుశాస్త్రులపేట, గేటు ప్రధాన రహదారి, తదితర ప్రాంతాల్లో సుమారు 600కుపైగా మొక్కలు నాటారు. సంరక్షణ కొరవడటంతో చాలా వరకు ఎండిపోయాయి. ఆమదాలవలస ప్రధాన రహదారి విభాగిని మధ్యలో ఎండిపోతున్న మొక్కలను ఈ చిత్రంలో చూడవచ్చు.

పలాస

ఈ చిత్రంలో కనిపిస్తున్నది పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలోని ముత్యాలమ్మ కోనేరు. గతంలో ఇక్కడ నాటిన మొక్కలు ఇప్పుడు కనిపించట్లేదు. పురపాలిక పరిధిలోని పలు ప్రాంతాల్లో గతంలో సుమారు పది వేల మొక్కలు నాటారు. ఇందుకు రూ.1.70 లక్షలు ఖర్చు చేశారు. వాటికి నీరు పోసే బాధ్యతను ఎవరికీ అప్పగించకపోవడంతో చాలాచోట్ల ఆనవాళ్లు లేకుండాపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని