logo
Published : 05 Jul 2022 04:28 IST

బడిగంట మోగేది నేడే

పాఠశాలల విలీనం.. ఉపాధ్యాయుల బదిలీలపై అస్పష్టతే

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, న్యూస్‌టుడే, నక్కపల్లి

మరికొద్ది గంటల్లో బడిగంట మోగనుంది. బడిఈడు పిల్లలతో పాఠశాలలన్నింటా పూర్వ సందడి నెలకొంటుంది. ఇప్పటికే ఉపాధ్యాయులు సర్కారు బడుల్లో సంసిద్ధతా కార్యక్రమాలను చేపడుతున్నారు. అరకొరగా వచ్చిన పాఠ్యపుస్తకాలను, జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీకి అందుబాటులో పెట్టుకున్నారు. కొత్త విద్యా సంవత్సరంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అరకొరగానే.. : జిల్లాకు పాఠ్యపుస్తకాలు, జగనన్న విద్యాకానుక కిట్లు పూర్తిస్థాయిలో రాలేదు.. వచ్చిన వరకు మండల విద్యావనరుల కేంద్రాలకు తరలించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలను అమ్ముతోంది. దీనికోసం వారి నుంచి ముందే ఇండెంట్‌ తీసుకుంది. అయితే పాఠశాలలు తెరుచుకునే రోజు వచ్చినా ఇంకా 60 శాతం పుస్తకాల కొరత ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాగో నెట్టుకొచ్చినా ప్రైవేటు పాఠశాలల్లో వెంటనే పుస్తకాలతో కుస్తీలు మొదలుపెట్టిస్తుంటారు. ఇప్పుడవి తగినన్ని లేకపోవడంతో పాత పుస్తకాలు ఎవరినైనా అడిగి తెచ్చుకోవాలని పిల్లలకు సూచిస్తున్నారు. జగనన్న విద్యాకానుక కిట్ల పరిస్థితి అంతే. 3.62 లక్షల మందికి ఈ ఏడాది కిట్లు పంపిణీ చేయాలి.. ఏకరూప దుస్తులు, బూట్లు 50 శాతం మందికి ఇంకా రాలేదు.

విలీనంపై ఆందోళనలు.. : గతేడాది 250 మీటర్ల దూరంలోని 147 పాఠశాలల్లో 3,4,5 తరగతులను విలీనం చేశారు. ఈ ఏడాది ఒక కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలలను విలీనం చేయనున్నారు. అలాగే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను విలీనం చేసే ఆలోచన చేస్తున్నారు. ఇలా మొత్తం 479 పాఠశాలల వరకు మ్యాపింగ్‌ చేశారు. వీటిలో అనువైన వాటినే కలపాలని, మిగతా వాటిని యథావిధిగా నడపాలని భావిస్తున్నారు. ఇంతవరకు వాటిపై అధికారికంగా స్పష్టత ఇవ్వడం లేదు. ఈ విలీనంపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే అనకాపల్లి, బుచ్చెయ్యపేట, చోడవరంలో ఆందోళనలు చేపట్టారు. చాలావరకు ఏ పాఠశాలను ఎక్కడ విలీనం చేస్తుంది ఇప్పటికీ తల్లిదండ్రులకు సమాచారం లేదు. పిల్లలను దూరంగా పంపించడానికి పునరాలోచనలో పడుతున్నారు.

గురువులు గరం..గరం..

జీవో నంబర్‌ 117 ప్రకారం క్రమబద్ధీకరణ చేస్తే ఉమ్మడి జిల్లాలో సుమారు 1500 పోస్టులు మిగిలిపోతాయి. 1:30 ప్రకారం ఇద్దరు ఉపాధ్యాయులున్న పాఠశాలల్లో ఒకరిని మిగులు చూపించి పోస్టు రద్దు చేయబోతున్నారు. అర్హత ఉన్నవారిని సబ్జెక్ట్‌ టీచర్లగా పదోన్నతి కల్పిస్తామని చెబుతున్నారు. ఎప్పుడు చేసేది స్పష్టం చేయడం లేదు. సెలవుల్లో బదిలీలు చేపట్టాల్సింది పాఠశాలలు ప్రారంభమయ్యాక చేస్తే ఎలానని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పాఠశాలల నిర్వహణలో తమపై సచివాలయ సిబ్బందికి పెత్తనాన్ని ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పండగ వాతావరణంలో..

ఇప్పటికే బడుల్లో సంసిద్ధత కార్యక్రమాలు చేపట్టాం. పండగ వాతావరణంలో విద్యార్థులకు ఆహ్వానం పలకబోతున్నాం. తొలిరోజు నుంచే జగనన్న విద్యాకానుక పంపిణీ మొదలవుతుంది. విద్యా ప్రమాణాలపై మొదటి నెల నుంచే పర్యవేక్షణ ఉంటుంది. పాఠశాలల విలీనం, మిగులు ఉపాధ్యాయుల జాబితాలు ఇంకా తుదిదశలో ఉన్నాయి. విద్యాబోధనకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలను చేపడతాం.

- లింగేశ్వరరెడ్డి, డీఈవో, అనకాపల్లి

ఏయే పాఠశాలలు విలీనమవుతున్నాయో ఇప్పటికీ తేల్చకపోవడం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు జీవో నంబర్‌ 117 గురువుల్లో గందరగోళం సృష్టిస్తోంది. క్రమబద్దీకరణ పేరుతో ఎక్కడికి సర్దుబాటు చేస్తారో తెలియడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే సర్కారు బడి తలుపులు మంగళవారం తెరుచుకుంటున్నాయి..

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని