logo

బస్సులు జగన్‌ సభకు.. కష్టాలు ప్రయాణికులకు

జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ.

Updated : 20 Apr 2024 07:23 IST

వేపగుంట, న్యూస్‌టుడే: జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. అందులోని కొన్ని సిద్ధం సభకు తరలిపోయాయి. ఫలితంగా నగరం నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా చోడవరం, మాడుగుల, కోటపాటు, కోడూరు వంటి శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఇక్కడే రాత్రి వరకు ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా సింహాచలం అప్పన్నస్వామి కల్యాణోత్సవం రోజున బస్సులు లేకపోవడంతో భక్తులకు బస్సుల సౌకర్యం కల్పించడంలో ఆర్టీసీ అధికారులు ఇబ్బందులు పడ్డారు.

గంటకు పైగా వేచి ఉన్నా

- అనీష్‌, కోటపాడు

మా ఊరు కోటపాడు వెళ్లేందుకు సాయంత్రం 6 గంటలకు వేపగుంట బస్‌స్టాపునకు వచ్చి గంటకు పైగా వేచి ఉన్నాను. ఎంతకీ బస్సులు రావట్లేదని ఆరా తీస్తే కొన్ని కాకినాడ సిద్ధం సభకు వెళ్లాయని తెలిసింది.


ఇంట్లోవారు కంగారు పడ్డారు

- నరేంద్ర, కోడూరు

నాది కోడూరు. బస్సు ఎక్కడానికి వేపగుంట ఆర్టీసీ స్టాపు వద్దకు వచ్చాను. ఎంతకీ బస్సులు రాలేదు. ఎందుకు ఇంటికి ఇంకా రాలేదని ఇంట్లో వారు అడగ్గా బస్సులు లేవని చెప్పాల్సి వచ్చింది.


నేడూ తిప్పలే..  

వేపగుంట: న్యూస్‌టుడే: అనకాపల్లి దరి జరిగే సిద్ధం సభకు శనివారం కూడా బస్సులు తరలిపోయే అవకాశముందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇలా అయితే రెండో రోజూ ప్రయాణికులకు అవస్థలు తప్పవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని