logo

ఇద్దరు యువకులను బలిగొన్న 108 అంబులెన్స్‌

ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్‌.. ముక్కుపచ్చలారని ఇద్దరు యువకులను బలి తీసుకుంది.

Published : 23 Apr 2024 04:22 IST

రామకృష్ణ , చందు

డాబాగార్డెన్స్‌, న్యూస్‌టుడే: ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్‌.. ముక్కుపచ్చలారని ఇద్దరు యువకులను బలి తీసుకుంది. ఈ ఘటన సోమవారం రాత్రి మహారాణిపేట పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలం లింగాలవలస గ్రామానికి చెందిన రామకృష్ణ(19), విజయవాడకు చెందిన చందు(20) స్నేహితులు. చందు నగరంలోని ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేసేవాడు. వారం రోజుల కిందట రామకృష్ణ అతని వద్దకు వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో వారిద్దరు పాతనగరం లీలామహల్‌ థియేటర్‌ వైపు ద్విచక్రవాహనంలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన 108 అంబులెన్స్‌ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు రోడ్డుపై తుళ్లి పడిపోవడంతో తలలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంçËనే అదే అంబులెన్సులో కేజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాలను కేజీహెచ్‌ శవాగారానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంబులెన్స్‌ డ్రైవర్‌ ఈశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు.

రామకృష్ణ చిన్నప్పుడే తల్లిదండ్రుల మృతి: రామకృష్ణ తలిదండ్రులు ఆరోగ్య సమస్యల కారణంగా అతని బాల్యంలోనే మృతి చెందారు. పెద్దనాన్న లుకలపు తౌడు(62) వద్ద  పెరుగుతున్నాడు. రామకృష్ణ మృతి విషయాన్ని శ్రీకాకుళంలో ఉంటున్న తౌడుకు పోలీసులు తెలియజేశారు. చందు తల్లి పేదరాలు. కుమారుడి చనిపోయిన సమాచారాన్ని పోలీసులు ఆమెకు చేరవేశారు. అయితే ఆమె వద్ద ఛార్జీలకు కూడా డబ్బులు లేకపోవడంతో దారి ఖర్చుల కింద మహారాణిపేట పోలీసులు రూ.వెయ్యి పంపారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని