logo

విద్యావెలుగులు.. అభివృద్ధి జిలుగులు

హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండల కేంద్రంలో మంగళవారం మంత్రి కేటీఆర్‌ పర్యటన కోలాహలంగా సాగింది. రూ.49 కోట్లతో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

Published : 01 Feb 2023 02:36 IST

సందడిగా సాగిన మంత్రి కేటీఆర్‌ పర్యటన
ఈనాడు, వరంగల్‌, కమలాపూర్‌, న్యూస్‌టుడే

నుమకొండ జిల్లా కమలాపూర్‌ మండల కేంద్రంలో మంగళవారం మంత్రి కేటీఆర్‌ పర్యటన కోలాహలంగా సాగింది. రూ.49 కోట్లతో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, తాటికొండ రాజయ్య, వొడితెల సతీశ్‌బాబు, ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, సీపీ రంగనాథ్‌, హనుమకొండ జడ్పీ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, కరీంనగర్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయ, తెలంగాణ బీసీ కమీషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి, భారాస నాయకులు గెల్లు శ్రీనివాస్‌, ఎంజేపీ గురుకులా రాష్ట్ర కార్యదర్శి మల్లయ్యభట్టు, గురుకులా ఆర్‌సీవో రాంరెడ్డి, బాలుర పాఠశాల ప్రిన్సిపల్‌ మల్లయ్య, బాలికల పాఠశాల ప్రిన్సిపల్‌ ప్రపుల్లాదేవి కమలాపూర్‌, గూడురు సర్పంచులు విజయ, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.


పర్యటన సాగిందిలా..

ఉదయం 11.58 - హెలిప్యాడ్‌లో హెలికాప్టర్‌ దిగిన కేటీఆర్‌, మంత్రులకు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.

మధ్యాహ్నం  12.10 - భారీ సంఖ్యలో భారాస కార్యకర్తల మధ్య కేటీఆర్‌ రోడ్డు షో మొదలైంది. కోలాటాలు, బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు.

12.17 - ర్యాలీ కొద్దిగా ముందుకెళ్లగానే ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కేటీఆర్‌ రోడ్డు షోను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.

12.50 - తహశీల్దారు కార్యాలయం సమీపంలో వివిధ అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

1.03 - కుల సంఘాల భవన సముదాయాన్ని ప్రారంభించారు.

1.21 - గురుకుల పాఠశాలల భవనాల ప్రారంభోత్సవం జరిగింది.

1.46 - డిజిటల్‌ తరగతిని ప్రారంభించిన, విద్యార్థులతో కేటీఆర్‌ మాట్లాడారు.

1.58 - మంత్రుల చేతుల మీదుగా దళిత బంధు విజయగాథ పుస్తకం, సీడీ ఆవిష్కరించారు.

2.08 - విద్యార్థులతో కలిసి కేటీఆర్‌, మంత్రులు, అధికారులు సహపంక్తి భోజనం చేశారు.

3.27 - కమలాపూర్‌లో అన్ని కార్యక్రమాలు ముగించుకొని కేటీఆర్‌, మంత్రులు కారులో జమ్మికుంటకు బయలుదేరారు.

రాష్ట్రం వచ్చాక గురుకులాలు బాగుపడ్డాయి

మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ సంక్షేమ గురుకులాలు తెలంగాణకే తలమానికమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బీసీ గురుకులాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.60 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు బాలికల పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు ఆదేశం

కస్తూర్బా విద్యాలయ ప్రత్యేకాధికారి చేరాల అర్చన, విద్యార్థినులు తమకు శౌచాలయాలు సరిపడా లేవని, హాస్టల్‌లోకి పాములు, తేళ్లు వస్తున్నాయని, డ్యుయల్‌ డెస్కు బెంచీలు లేవని మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి కలెక్టర్‌, ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డిని పిలిచి తక్షణమే కేజీబీవీ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ నిధులు మంజూరు చేయాలని సూచించారు.


భారీ బందోబస్తు

కేటీఆర్‌ పర్యటనలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. వరంగల్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ బారీ, ఏసీపీలు శివరామయ్య, శ్రీనివాస్‌, డేవిడ్‌రాజు, దేవేందర్‌రెడ్డి, రఘుచందర్‌లతోపాటు మొత్తం 8 మంది ఏసీపీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్‌ఐలతోపాటు సుమారు 600 మంది పోలీసులు కేటీఆర్‌ పర్యటనకు కట్టుదిట్టమైన బందోబస్తు కల్పించారు.  


రుచికరమైన భోజనం..

మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు.. ఎంజేపీ విద్యార్థులు సుమారు 1400 మందితో కలిసి భోజనం చేశారు.  వివిధ రకాల రుచికరమైన వంటకాలు వడ్డించారు. భోజనంలో పాపడం, బాస్మతి భగార అన్నం, తెల్లటి అన్నం, చికెన్‌, వంకాయ, పాలకూర పప్పు, సాంబారు, బెండకాయ వేపుడు, పెరుగు, టమాటా పూదీన చట్నీ, కడ్డూ కీర్‌ (బాదం స్వీటు), వాటర్‌ బాటిల్‌ను సమకూర్చారు.


విద్యార్థులతో మమేకమై..  

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో భారాస సభ ఉండడంతో కమలాపూర్‌లో కేటీఆర్‌ ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయలేదు.  విద్యార్థులతో మమేకమయ్యేందుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు.  విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారితో సహపంక్తి భోజనం చేస్తూ  ముచ్చటించారు.

భోజనం చేస్తుండగా పై నుంచి డ్రోన్‌ చక్కర్లు కొడుతుండగా విద్యార్థులు ఆశ్చర్యంగా చూశారు. మీకు డ్రోన్‌ గురించి తెలుసా? అని కేటీఆర్‌ అడగ్గా 10వ తరగతి చదివే వినీత్‌నాయక్‌ బదులిస్తూ డ్రోన్‌ను పొలం పనుల్లో పిచికారీకి, ఫొటోలు తీయడానికి ఉపయోగిస్తారని చెప్పారు.  

మీ పాఠశాలకు ఏం కావాలని  మంత్రి అడగ్గా, డిజిటల్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌ కావాలని, చలికాలంలో చన్నీళ్ల స్నానం చేస్తున్నామని గీజర్లు కావాలని విద్యార్థులు కోరారు. వెంటనే ఆ ఏర్పాట్లన్నీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

పాఠశాల ప్రారంభోత్సవం జరిగాక కేటీఆర్‌ డిజిటల్‌ తరగతులను  పరిశీలించారు. అక్కడ కొందరు విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో వసతులు ఎలా ఉన్నాయామ్మా, మీ అమ్మానాన్న అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారా? అంటూ  6వ తరగతి చదివే వంశికను అడగ్గా.. ఇక్కడ మాకు అన్ని వసతులు ఉన్నాయని, ఇంటి కన్నా ఇక్కడే బావుందని తెలిపింది.

రైతు బంధు అంటే తెలుసా?: ఎనిమిదో తరగతి చదివే ప్రవల్లికతో కేటీఆర్‌ మాట్లాడుతుండగా, తమది వ్యవసాయ కుటుంబం అని తెలిపింది. రైతు బంధు అంటే తెలుసా? అది ఎప్పుడు వస్తుంది? అంటూ కేటీఆర్‌ ఆమెను అడిగారు. ప్రవల్లిక బదులిస్తూ రైతుబంధు తమకు వస్తుందని, ఏడాదికి రెండు సార్లు ప్రభుత్వం ఇస్తుందని చెప్పడంతో ఆమెను అభినందిస్తూ ఇక్కడ చదువుకొని గ్లోబల్‌ స్థాయిలో ఉన్నత శిఖరాలు అందుకోవాలని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని