logo

ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!

రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు.

Published : 20 Apr 2024 01:49 IST

ఎమ్మెల్యే, ఎంపీగా వ్యవహరించిన నేతలు 

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. రెండు సభల్లో అడుగు పెట్టిన వారు ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో పది మంది వరకు ఉంటారు. వీరిలో వరంగల్‌, హనుమకొండతో పాటు పునర్విభజనతో ఏర్పాటైన మహబూబాబాద్‌ లోక్‌సభ నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నికైనవారు ఉన్నారు.

  • రామసహాయం సురేందర్‌రెడ్డి నాలుగుసార్లు ఎంపీగా, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు సభల్లో ప్రాతినిధ్యం వహించారు.
  •  గండి మల్లికార్జున్‌రావు (కాంగ్రెస్‌) 1962లో చిల్లంచర్ల ఎమ్మెల్యేగా, 1979లో జరిగిన ఉప ఎన్నికలో వరంగల్‌ ఎంపీగా విజయం సాధించారు.
  • కమాలుద్దీన్‌ అహ్మద్‌ (కాంగ్రెస్‌) 1962లో చేర్యాల, 1967లో జనగామ శాసనసభ్యుడిగా గెలిచారు. 1980లో వరంగల్‌ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1989, 1991, 1996లో హనుమకొండ ఎంపీగా వ్యవహరించారు.
  • అజ్మీరా చందులాల్‌ 1985, 1994లో తెదేపా, 2014లో భారాస నుంచి ములుగు ఎమ్మెల్యేగా గెలిచారు. 1996, 1998లో వరంగల్‌ ఎంపీగా తెదేపా నుంచి పోటీ చేసి విజయం సాధించారు..
  • డి.రవీందర్‌నాయక్‌ 2004లో తెరాస నుంచి వరంగల్‌ ఎంపీగా, అంతకు ముందు 1978, 1983లో కాంగ్రెస్‌ నుంచి నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యేగా శానససభలో అడుగుపెట్టారు.
  • ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం నుంచి 1994, 1999, 2004, 2009, 2014లో తెదేపా అభ్యర్థిగా, 2018లో పాలకుర్తి నుంచి భారాస అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2008లో వరంగల్‌ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో తెదేపా నుంచి ఎంపీగా గెలిచారు.
  • చందుపట్ల జంగారెడ్డి (బీజేఎస్‌) 1967లో పరకాల, 1978, 1983లో శాయంపేట ఎమ్మెల్యే (భాజపా)గా ఎన్నికయ్యారు. 1984లో హనుమకొండ ఎంపీగా విజయం సాధించారు.
  • మాలోతు కవిత 2009లో మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు.

ఒకేసారి రెండు చోట్ల నుంచి..

పీడీఎఫ్‌ నుంచి పెండ్యాల రాఘవరావు 1952లో హనుమకొండ శాసనసభ, వరంగల్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు. శాసనసభకు రాజీనామా చేసి  ఎంపీగా కొనసాగారు.


మూడు సభల్లో కడియం

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన ఘనత కడియం శ్రీహరికి దక్కింది. తెదేపా నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఆ పార్టీ నుంచి 1994, 1999లో, 2008 ఉపఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో భారాస అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో తెరాస నుంచి ఎంపీగా విజయం సాధించారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలిలోనూ అడుగుపెట్టారు.


ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలి

రామసహాయం సురేందర్‌రెడ్డి అనుభవాలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇప్పటివరకు గెలిచిన నేతల్లో రామసహాయం సురేందర్‌రెడ్డికి ఓ ప్రత్యేకత ఉంది. 1967 నుంచి 1991 వరకు జరిగిన చట్టసభల ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడకు చెందిన ఆయన కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభకు పోటీ చేశారు. వర్తమాన రాజకీయ పరిస్థితులు, ఎన్నికల విధానంపై పలు అంశాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

వరంగల్‌ లోక్‌సభ స్థానానికి తొలుత 1965లో జరిగిన ఉప ఎన్నికలో సీపీఐ అభ్యర్థి ఓంకార్‌పై గెలుపొందాను. 1967, 1989, 1991 వరంగల్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాను. 1967 లోక్‌సభ ఎన్నికల్లో నేను చేసిన వ్యయం రూ.7500 మాత్రమే. 30 ఏళ్ల వయసులోనే 1965లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి యువ పార్లమెంటేరియన్‌గా ఎన్నికైన తొలితరం రాజకీయ నాయకుడిని. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు 1974లో జరిగిన ఎన్నికల్లో చిల్లంచర్ల శాసనసభ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. అనంతరం 1978, 1983, 1985లో జరిగిన ఎన్నికల్లో డోర్నకల్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందా. ప్రత్యక్ష రాజకీయాలు వీడేముందు 1996 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చేసిన వ్యయం రూ.21 లక్షలు. 1984లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎన్నికల పర్యటనకు వచ్చిన రాజీవ్‌గాంధీతో బహిరంగసభ నిర్వహించాల్సి ఉండగా జనసమీకరణ, ఇతర వ్యయాలు తగ్గించుకునేందుకు తొలిసారిగా మరిపెడలో రోడ్‌ షో చేయించాను. ప్రస్తుతం గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు అంగ, ఆర్థికబలం ఉన్న నేతలను రంగంలోకి దించుతున్నారు. ఓటరు విజ్ఞతతో వ్యవహరించాల్సి ఉంది. ఈ పరిస్థితి మార్చడానికి ఓటర్లందరూ ఉన్నంతలో ఉత్తముల్ని ఎన్నుకోవడం ఒక మార్గం. రాజకీయ నాయకులు మారాలంటే తొలుత ప్రజలు మారాలి. ఇటీవల ముఖ్యమంత్రి స్థాయి నాయకులు సైతం అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లడం కలచివేసింది.

న్యూస్‌టుడే, మరిపెడ, వరంగల్‌ వ్యవసాయం


జిల్లాలు వేరు.. రిజర్వేషన్‌ ఒకటే..!

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఏడు చొప్పున అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.. ఎస్సీ స్థానమైన వరంగల్‌ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో భిన్నమైన రిజర్వేషన్లు కనిపిస్తాయి. ఇక్కడ స్టేషన్‌ఘన్‌పూర్‌, వర్ధన్నపేట మాత్రమే ఎస్సీ నియోజకవర్గాలు. పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి, వరంగల్‌ తూర్పు, పశ్చిమ జనరల్‌ స్థానాలు.. ఇవన్నీ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే ఉంటాయి.. ఎస్టీ లోక్‌సభ నియోజకవర్గమైన మహబూబాబాద్‌.. ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇందులోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నర్సంపేట జనరల్‌ స్థానం కాగా డోర్నకల్‌, మహబూబాబాద్‌, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం ఎస్టీ నియోజకవర్గాలు.. జిల్లాలు వేరైనా.. లోక్‌సభ, అసెంబ్లీల రిజర్వేషన్లు ఒకేలా ఉండడం మహబూబాబాద్‌ నియోజకవర్గానికి ప్రత్యేకతగా మారింది.

న్యూస్‌టుడే, టేకుమట్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని