logo

ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!

గత లోక్‌సభ ఎన్నికలు 2019 ఏప్రిల్‌ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది..

Updated : 20 Apr 2024 06:24 IST

అప్రమత్తతతోనే ముమ్మర ప్రచారం.. పోలింగ్‌ శాతం పెంపు

గత లోక్‌సభ ఎన్నికలు 2019 ఏప్రిల్‌ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నేతలు, కార్యకర్తలు, ఎన్నికల సిబ్బంది, ఓటర్లు వేడిమి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూనే పోలింగ్‌ శాతం పెంపునకు కృషి చేయాలి.

న్యూస్‌టుడే, డోర్నకల్‌


నేను ప్రచండ భానుడిని.. ఎన్నికల వేళ జాగ్రత్త సుమా..

నా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. సీజన్‌ నాది కాబట్టి నిప్పులు కురిపిస్తున్నా.. నా నుంచి వచ్చే వేడితో మీరు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈసారి ఏప్రిల్‌లోనే తీవ్రరూపం దాల్చాను. మేలో మరింత దూకుడుగా వ్యవహరిస్తాను.. ఇప్పుడెందుకీ ప్రస్తావన అంటే.. మీ ముంగిట లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. ప్రధాన పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఈసారి మండే ఎండ మీపై ఎప్పుడూ ఉంటుంది. నేతలు, అభ్యర్థులు ఈ ఎన్నికల్లో నేనే ప్రధాన ప్రత్యర్థి అని భావిస్తున్నారంటే నా ప్రతాపం ఏమిటో ఇప్పటికే తెలిసి ఉంటుంది.. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా.. 

చల్లబడ్డాకే ఓట్లు అడిగితే మంచిది..

మహబూబాబాద్‌లో జనసంచారం లేని ఇందిరాగాంధీ కూడలి

మహబూబాబాద్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వేళ నిర్మానుష్యంగా ఉన్న ప్రధాన వీధి. మండుటెండలో బయటకు రాలేక జనం ఇళ్లకే పరిమితం కావడంతో నిత్యం రద్దీగా ఉండే రహదారి వెలవెలబోతోంది. ఈ సమయంలో ప్రచారమంటే కష్టమే..
ఇలా చేయండి: మండుటెండల్ని పరిగణనలోకి తీసుకుని పరిమితి వేళల్లోనే ప్రచారం చేయాలి. ఉదయం, సాయంత్రం వేళలు, చల్లటి వాతావరణ సమయాల్లో ఓటర్లను కలవొచ్చు. తెల్లని దుస్తులు ధరించాలి.. నల్లనివి, మందంగా ఉండేవి, బిగుతైన వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది.

ఉపయోగించుకుందాం

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటిన వారికి ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయం కల్పించారు. ఇప్పుడు 85 ఏళ్లు దాటిన వారు ఓటేసేందుకు అర్హులని ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్‌ అధికారులు, సిబ్బంది వీరందరి దగ్గరకు వెళ్లి ఓట్లు వేయించేలా కార్యాచరణ రూపకల్పన చేయాలి. ఈ ప్రక్రియని పకడ్బందీగా నిర్వహిస్తే పోలింగ్‌ శాతం పెరిగేందుకు దోహదపడుతుంది.

అప్పుడు.. ఇప్పుడు

గత లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ శాతం తక్కువ నమోదైంది. దీనికి అప్పట్లో భానుడి తీవ్రతను కారణంగా చూపారు. ఈసారి మే 13న పోలింగ్‌ జరగనుంది. ఆ సమయంలో ఎండ మరింత అధికంగా ఉంటుంది. ఇది పోలింగ్‌ శాతంపై ప్రభావం చూపకుండా ఇప్పటి నుంచే తగు చర్యలు చేపట్టాలి.

  • ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి.
  • కేంద్రాల వద్ద షామియానాల ఏర్పాటు తప్పనిసరి.
  • చలువ పందిళ్లు వేయించాలి 
  • సిబ్బందికి గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్త పడాలి
  • ఏజెంట్లు సైతం అప్రమత్తంగా ఉండాలి.

ఈ సారి విస్తృత చర్యలు అవసరం

డోర్నకల్‌ మండలం చిల్కోడులో చాలీచాలని షామియానాతో గత ఎన్నికల్లో ఓటర్లు ఎండలో నిలబడి అవస్థపడ్డారు. దీని నుంచి గుణపాఠం నేర్వాలి. ఈసారి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు సరిపడా షామియానాలు, చలువ పందిర్లు వేయించాలి. నీటి సౌకర్యం అందుబాటులో ఉంచాలి.

ముందస్తు మేల్కోండి

ఉదయాన్నే కేంద్రానికి వెళితే... మీ వంతు వచ్చేదాక సేద తీరొచ్చు ఇలా.. డోర్నకల్‌ మండలం కన్నెగుండ్లలో గత ఎన్నికల్లో ఈ తరహా అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకున్నారు.

పోలింగ్‌ రోజు  ఉదయాన్నే  వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలి.  ఉదయం వెళ్లలేని పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు అప్రమత్తంగా ఉండాలి.

  • డోర్నకల్‌, నర్సంపేట, మహబూబాబాద్‌ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరుగుతుంది. 5 లోపు గేటు లోపలుండే వారందరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
  • పినపాక, భద్రాచలం, ఇల్లెందు, ములుగు నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. 4 లోపు గేటు లోపలుండే వారు ఓటు వేయడానికి అర్హులు.

డోర్నకల్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల కోసం అందుబాటులో ఉంచిన నీళ్లు ఇవి. ఇక్కడ విధిగా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఉంచారు. ఈ తరహా ఏర్పాటును పోలింగ్‌ కేంద్రాల వద్ద చేస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది
కుండలు లేదా క్యాన్లలో తాగునీటిని అందుబాటులో ఉంచాలి.

ఉమ్మడి జిల్లా ఓటర్లు: 33.43 లక్షలు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని