logo

ఇల్లు ఇవ్వకుండా వాయిదాలు కట్టాలా?..టిడ్కో లబ్ధిదారుల్లో అయోమయం

పాలకొల్లు పట్టణాల్లో తొలివిడతగా కొందరికి ఫ్లాట్లు కేటాయించారు. అక్కడ ఎటువంటి వసతులు కల్పించకపోగా బ్యాంకుల నుంచి వాయిదాల చెల్లింపునకు ఒత్తిళ్లు కొనసాగిస్తున్నాయి.

Updated : 07 Mar 2024 07:24 IST

పాలకొల్లు, భీమవరం పట్టణం,తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు పట్టణాల్లో తొలివిడతగా కొందరికి ఫ్లాట్లు కేటాయించారు. అక్కడ ఎటువంటి వసతులు కల్పించకపోగా బ్యాంకుల నుంచి వాయిదాల చెల్లింపునకు ఒత్తిళ్లు కొనసాగిస్తున్నాయి. ఆయా పట్టణాల్లో నిర్మాణం పూర్తికాని ఫ్లాట్లను కూడా లబ్ధిదారులకు కేటాయిస్తూ పట్టాలు పంపిణీ చేయడం   గమనార్హం.

భీమవరం పట్టణానికి చెందిన ఒక లబ్ధిదారు టిడ్కో ఇంటి కోసం రూ.లక్ష చెల్లించారు. ఆరేళ్లయినా టిడ్కో సముదాయంలో ఫ్ల్లాట్‌ కేటాయించలేదు. నెలకు రూ.4,500 చొప్పున ప్రతి నెలా వాయిదా చెల్లించాలని బ్యాంకు నుంచి తాఖీదులు అందాయి. ఇదేమిటంటూ మరికొందరితో కలిసి బ్యాంకుకు వెళ్లా. అద్దె ఇంటికి ఇప్పటికే రూ.7 వేలు చెల్లిస్తున్నా, ఫ్లాట్‌ ఇవ్వకపోగా వాయిదా కట్టమంటే ఎలా అని ప్రశ్నించా. దీంతో అధికారులు కొంత వెనక్కి తగ్గారు.

* జంగారెడ్డిగూడెంలో 864 ఇళ్లకు 456 మందికి రుణాలు ఇచ్చారు. అప్పట్లో ఇళ్లు పూర్తి కానందున 2023 డిసెంబరు వరకు వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేకుండా రెండేళ్లు మినహాయింపు ఇచ్చారు. ఈ గడువు ప్రస్తుతం పూర్తయింది. వీరిలో పలువురికి వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి తాఖీదులు అందుతున్నాయి. ఇప్పటికే అద్దె ఇళ్లలో ఉంటున్న తమను వాయిదాలు కూడా కట్టమనడం ఎంత వరకు సమంజసమని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.

 జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి దయనీయంగా మారింది. కొన్నిపట్టణాల్లో గృహ సముదాయాల నిర్మాణం పూర్తికాలేదు. పూర్తయిన చోట్ల కూడా కొందరికి ఫ్లాట్లు కేటాయించలేదు. చాలీచాలని అద్దె ఇళ్లలో వారు కాలం గడుపుతున్నారు. కానీ వారి పేరిట రుణాలు మంజూరు చేయడంతో వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. ఇళ్లలోకి వెళ్లకుండా ఎలా చెల్లించేదని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

పాలకొల్లులో 6,400 గృహాలకు 6 వేల మందికి ఇంటి రుణాలు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 1,800 మందికి ఇళ్లు అప్పగించారు. వీళ్లను వాయిదాలు కట్టమంటూ ఒత్తిడి చేస్తున్నారు. చెల్లించని పక్షంలో ఇళ్లు వేలం వేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. వీటిని కేటాయించిన లబ్ధిదారులకు సైతం వాయిదాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి.


రూ.3 వేల వాయిదా

టిడ్కో ఇళ్లకు సంబంధించి నెలకు రూ.3 వేల చొప్పున వాయిదాలు చెల్లించాలంటూ చాలా కాలంగా మాకు బ్యాంకు నుంచి ఫోన్‌లు వస్తున్నాయి. ఇటీవల నా భార్య పార్వతికి స్టెంట్‌ వేసిన సమయంలోను ఒత్తిడి చేశారు. మాకు బీ 6 బ్లాక్‌లో జి4 ఫ్లాట్‌ కేటాయించారు. అక్కడికి వెళితే కాపలాదారులు కనీసం ఫ్లాట్‌ చూడనివ్వలేదు.
-నాయుడు కొండయ్య, జంగారెడ్డిగూడెం


బ్యాంకులో వేస్తే మాయం

నాకు గతంలో జగనన్న కాలనీలో ఇంటి పట్టా ఇచ్చారు. అనంతరం టిడ్కో గృహ సముదాయంలో ఖాళీలు ఉన్నాయని చెప్పి ఇంటిపట్టా వెనక్కి తీసుకొని సింగిల్‌ బెడ్‌ రూమ్‌ కేటాయించారు. బ్యాంకులో నాతో రుణ ఖాతా తెరిపించారు. ఎప్పుడు డబ్బులు డిపాజిట్‌ చేసినా నగదు కట్‌ అయిపోతోంది. దీంతో ఆ ఖాతాలో డబ్బులు వేయడం మానేశాం. 

 -డోకల లక్ష్మి, లబ్ధిదారు, జంగారెడ్డిగూడెం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని