logo

చూసిన కనులదే భాగ్యం!

జగదభిరాముడి కల్యాణానికి జగమే ఊయలూగింది. సర్వమంగళ స్వరూపుడు శ్రీరాముడు, సకల జన శుభధాత్రి సీతాదేవి మూడు ముళ్లబంధంతో ఒక్కటైన వేళ భక్తజనం ఆనందంతో పులకించిపోయారు.

Published : 23 Apr 2024 05:45 IST

వైభవంగా సీతారాముల కల్యాణం
న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

గదభిరాముడి కల్యాణానికి జగమే ఊయలూగింది. సర్వమంగళ స్వరూపుడు శ్రీరాముడు, సకల జన శుభధాత్రి సీతాదేవి మూడు ముళ్లబంధంతో ఒక్కటైన వేళ భక్తజనం ఆనందంతో పులకించిపోయారు.  పండు వెన్నెల్లో  పావనమూర్తి పరిణయ వేడుక ముగ్ధ మనోహరంగా సాగింది. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం సీతారాముల కల్యాణం కనుల పండువగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ పరిణయ క్రతువును నేత్రపర్వంగా నిర్వహించారు. తితిదే ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాములోరి సన్నిధి నుంచి మధ్యాహ్నం శోభాయాత్ర ప్రారంభమైంది.  కల్యాణవేదిక అశేష భక్తవాహినితో కళకళలాడింది. ఎదుర్కోలు ఘట్టం నేత్రపర్వంగా జరిగింది. అనంతరం తితిదే పాంచరాత్ర ఆగమశాస్త్ర సలహాదారు కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ ఆధ్వర్యంలో రాములోరి పెళ్లి వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక పావని మెడలో పావనమూర్తి పరంధాముడు మూడుముళ్లు వేసిన శుభ సమయాన ముల్లోకాలు మురిశాయి.

మంగళసూత్రం చూపుతున్న అర్చకులు కల్యాణం అనంతరం సీతారాములు

ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూల పంపిణీ

సీతారాముల కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు అక్షింతలు, రెండు కంకణాలు, ఒక ముత్యం, తిరుమల నుంచి వచ్చిన చిన్న లడ్డూల పొట్లాలు అందజేశారు. ప్యాకింగ్‌ చేశారు. తిరుమల నుంచి అయిదు వేల లడ్డూలు తీసుకొచ్చి విక్రయించారు.  

తరలివచ్చిన అధికారులు

పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు తెస్తున్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌వలవన్‌, తితిదే ఈవో ధర్మారెడ్డి

కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవన్‌ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. సీతారాములకు  512 గ్రాముల కనకపు ఆభరణాలు, 14 కిలోల వెండి పూజా సామగ్రి, పట్టు వస్త్రాలను తితిదే కార్యనిర్వహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డి కానుకగా సమర్పించారు.  జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఐఏఎస్‌ అధికారులు ఎస్‌.ఎస్‌.రావత్‌, గిరిజాశంకర్‌, కలెక్టరు విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌, జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి, జేసీ గణేష్‌కుమార్‌, అదనపు ఎస్పీలు వెంకటరాముడు, కృష్ణారావు,  అధికారులు కల్యాణోత్సవాన్ని తిలకించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

కల్యాణ వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు లక్ష్మీ సువర్ణ బృందం నాదస్వరం, డోలు వాద్యం మంగళ ప్రదంగా సాగింది. డాక్టరు వందన, చిన్నమ్మదేవి పర్యవేక్షణలో 40 మంది విద్యార్థులు శ్రీరామ నామామృతం భజన సంకీర్తనలు వీనులవిందుగా గానం చేశారు. డాక్టరు ఉషారాణి ఆధ్వర్యంలో సీతాకల్యాణం, రామాయణ శబ్దం, పాహిరామ ప్రభో కూచిపూడి నృత్యం మైమరిపించింది. రవి సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది.

కల్యాణానికి పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు

గ్రామోత్సవంలో భక్తజనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని