ఉత్తరాంధ్రపై జగన్‌ పంజా!

ఎన్నికల్లో నీతిమాలిన ఏలికను ఎంచుకొంటే ఎన్ని అనర్థాలు దాపురిస్తాయో అయిదేళ్లుగా ఏపీ అనుభవాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. సీఎం జగన్‌కు వికాసం పొడ గిట్టదు. వినాశం తప్ప వేరేదీ రుచించదు! కావాలంటే ఉత్తరాంధ్రకు ఆయన ఇచ్చిన హామీల చిట్టా పరికించండి.

Published : 23 Apr 2024 01:13 IST

న్నికల్లో నీతిమాలిన ఏలికను ఎంచుకొంటే ఎన్ని అనర్థాలు దాపురిస్తాయో అయిదేళ్లుగా ఏపీ అనుభవాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. సీఎం జగన్‌కు వికాసం పొడ గిట్టదు. వినాశం తప్ప వేరేదీ రుచించదు! కావాలంటే ఉత్తరాంధ్రకు ఆయన ఇచ్చిన హామీల చిట్టా పరికించండి. ఆంధ్రుల హక్కుగా అందివచ్చిన విశాఖ ఉక్కు ఉత్తరాంధ్రకే సిగపువ్వు కాగా, అత్యంత ప్రశాంత కాస్మొపాలిటన్‌ నగరంగా ఎదిగిన వైజాగ్‌ కొంగు బంగారమైంది. వెనకబడిన జిల్లాలన్న ముద్ర చెరిపేసుకోవాలన్న ఆకాంక్షతో ప్రజానీకం- సాగునీరు, కొత్త పరిశ్రమలతో రాగల ఉపాధి అవకాశాలపై కొండంత ఆశలు పెంచుకొంది. సహకార చక్కెర ఫ్యాక్టరీల్ని పరిపుష్టీకరిస్తానంటూ అయిదేళ్ల క్రితం జగన్‌ వాగ్దానం చేశారు. ఆయన రాక్షస పాలనలో సహకార ఫ్యాక్టరీలు కుదేలై చెరకు రైతు బిక్కచచ్చిపోగా, విఖ్యాత అనకాపల్లి బెల్లం మార్కెట్‌ ప్రాభవం కోల్పోయి కునారిల్లుతోంది. పాలన రాజధానిగా జగన్‌ పెట్టిన తగరపు కిరీటం వెలాతెలా పోతుంటే, రైల్వే జోన్‌ రాక కనీసం మెట్రో రైలుకూ దిక్కులేక వి‘శోక’పట్టణం బావురుమంటోంది! విశాఖ ఉక్కుకు ప్రత్యేక గనుల కేటాయింపుపై పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతానంటూ హామీ ఇచ్చిన జగన్‌- రూ.2వేల కోట్ల ఆర్థిక సాయం చేసి ప్రతిగా ప్రభుత్వ పథకాలకు స్టీలు తీసుకోవాలని ప్రతిపాదిస్తే మొహం చాటేశారు. సాగర తీరంలో ‘ఐటీ వెలుగులు నింపుతాం’ అని ఘనంగా చాటి, ఉన్న కార్పొరేట్లనూ నిర్దాక్షిణ్యంగా గెంటేసి, వేలమంది ఉద్యోగార్థుల ఉసురు పోసుకొన్నారు. విశాఖ నగర తాగునీటి ఎద్దడి తీర్చడానికి రూ.3,338 కోట్లతో ఏలూరు నుంచి పైప్‌లైన్ల ద్వారా నీటి సరఫరా ప్రాజెక్టు చేపడతానని ఇచ్చిన హామీకీ అతీ గతీ లేదు. ఉత్తరాంధ్రలో 30లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండే అవకాశం ఉన్నా 10లక్షల ఎకరాల్లో ఒక్క పంటే గగనమవుతోంది. అక్కడి సాగునీటి పథకాలకు రూ.3,300 కోట్లు అవసరం కాగా, జగన్‌ కేటాయింపులు అందులో సుమారు ఆరోవంతు! విశాఖ, దాని చట్టుపక్కల దాదాపు 129 ఎకరాల విలువైన భూముల్ని తాకట్టుపెట్టి రూ.23వేల కోట్లు అప్పు తెచ్చిన జగన్‌ సర్కారు అందులో పిసరంతైనా ఉత్తరాంధ్ర ఉన్నతికి కేటాయించకపోవడం సిగ్గుచేటు!

వేలమంది రైతుల త్యాగ నిరతితో పురుడు పోసుకొన్న అమరావతిపై తప్పుడు ప్రచారంతో దాడి చేసి మొగ్గ దశలోనే దాన్ని ఎండగట్టింది జగన్‌ ప్రభుత్వం. పాలన రాజధానిగా విశాఖను ప్రకటించి వైకాపా ముఠాలతో విలువైన భూములన్నింటినీ ఆక్రమించిన జగన్‌ సర్కారు- పరమ భయానక వాతావరణాన్నే సృష్టించిందిప్పుడు! సర్కారీ యంత్రాంగాన్నే దోపిడి సాధనంగా మార్చి ఫ్యాక్షనిస్టు జగన్‌ సాగించిన భూకబ్జా దందాలు- రుషికొండకే గుండు కొట్టించేంతగా సాగిపోయాయి. అధినేత ఒరవడిలో వైకాపా నేతల ఉరవడితో వైజాగ్‌ ఠారెత్తిపోయింది. రూ.3000 కోట్ల దసపల్లా భూములు పాలక పార్టీ పెత్తందార్ల గుప్పిట్లో చిక్కాయి. భీమిలి నియోజకవర్గ పరిధిలో 52 కొండల్ని పిండిచేసి అక్రమంగా గ్రావెల్‌ తరలించుకుపోతున్నారు. ప్రైవేటు వ్యక్తులెవరైనా కొత్తగా ఇళ్ళు కట్టుకోవాలంటే పాలకపక్ష కార్పొరేటర్లకు లక్షల్లో కప్పాలు కట్టాల్సి వస్తోంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో మైనింగ్‌ మాఫియా పంజా విసరుతోంది. అందినకాడికి దోచుకోవడంలో రాష్ట్ర మంత్రుల హస్తలాఘవమూ విస్తుగొలుపుతోంది! సాగునీటి ప్రాజెక్టుల్ని పస్తుపెట్టిన జగన్‌ పంప్డ్‌ స్టోరేజి హైడ్రోపవర్‌ ప్రాజెక్టుల పేరిట తాండవ, రైవాడ జలాశయాల నీటిని షిరిడీసాయి, అదానీ సంస్థలకు కేటాయించి అన్నదాతల వెన్ను విరిచారు. ఉత్తరాంధ్రపై అవ్యాజ ప్రేమ అభినయించే పెద్దమనిషి- రాష్ట్రానికి మంజూరైన 115 గ్రామీణ సడక్‌ యోజన పనుల్లో కేవలం ఎనిమిదింటినే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు కేటాయించి తన కొద్ది బుద్ధుల్ని చాటుకొన్నారు. ఏపీకి సంబంధించి మానవ కల్పిత మహా విషాదమంటే- జగన్‌ అయిదేళ్ల సర్వ విధ్వంసక రాక్షస పాలనే. ‘మరొక్కసారి’ అంటూ సరికొత్త దోపిడికి లాకులెత్తే జగన్‌ దుర్మార్గాలను దునుమాడేందుకు, జాగృత ప్రజానీకం ప్రతిన పూనాల్సిన సమయమిదే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.