icon icon icon
icon icon icon

Rajasthan Assembly Elections: ‘కలిసికట్టుగా మరోసారి గెలుస్తాం’.. పైలట్‌తో ఫొటో షేర్‌ చేసిన గహ్లోత్‌

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం అశోక్‌ గహ్లోత్‌ ఆసక్తికర ఫొటోను షేర్‌ చేశారు. మరోవైపు కరణ్‌పుర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

Updated : 15 Nov 2023 13:17 IST

జైపుర్‌: రాజస్థాన్‌ (Rajasthan Assembly Elections)లో కాంగ్రెస్‌ పార్టీ (Congress) మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) ధీమా వ్యక్తం చేశారు. మరి కొద్దిరోజుల్లో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఆసక్తికర ఫొటోను ఎక్స్‌లో షేర్‌ చేశారు. గతంలో తనపై తిరుగుబాటు చేసిన మరో కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ (Sachin Pilot)తో కలిసి చర్చిస్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘కలిసి మరోసారి గెలవబోతున్నాం’ అని ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. మరోవైపు పైలట్‌ సైతం గత వారం ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. కలిసికట్టుగా కాంగ్రెస్‌ను గెలిపిస్తామని అన్నారు. గతంలో జరిగిన సంఘటనలను మర్చిపోయి ముందుకుసాగాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ తనతో చెప్పారని పైలట్‌ వ్యాఖ్యానించారు. 

రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నవంబరు 25న అన్ని స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 3న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో  సీఎం గహ్లోత్ సర్దార్‌పుర నుంచి, పైలట్‌ టోంక్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి మృతి

రాజస్థాన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున కరణ్‌పుర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్న గుర్మీత్‌ సింగ్ కూనర్‌ అనారోగ్య కారణాలతో దిల్లీ ఎయిమ్స్‌లో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన కరణ్‌పుర్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. నవంబర్‌ 12న అనారోగ్య కారణాలతో ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. మూత్రపిండాల వ్యాధి, అధిక రక్తపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు చెప్పాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img