icon icon icon
icon icon icon

మెదక్‌

Updated : 01 Apr 2024 19:48 IST

లోక్‌సభ నియోజకవర్గం

మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం (Medak Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు ఇందులో కలిశాయి. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో పాటు మల్లికార్జున్, బాగారెడ్డి వంటి ప్రముఖ రాజకీయ నాయకులు ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేయడం విశేషం.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: సిద్దిపేట, దుబ్బాక, మెదక్, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి.

ప్రస్తుత ఎన్నికల్లో భారాస నుంచి వెంకట్రామిరెడ్డి, భాజపా నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి నీలం మధు పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ బరిలో తలపడే అభ్యర్థులు తేలిపోవడంతో ప్రచారంపై నేతలు దృష్టి సారించారు. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం మూడు ప్రధాన పార్టీలకు కత్తిమీద సాములా మారింది. భారాస అధినేత కేసీఆర్‌ సొంత జిల్లా కావడంతో గులాబీ శ్రేణులు, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో హస్తం నేతలు, ఈసారైనా దక్కించుకోవాలని భాజపా కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

వంద రోజుల పాలనపై..

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి వందరోజుల పాలన పూర్తి చేసుకుంది. ఐదు గ్యారెంటీలను అమలు చేస్తున్న ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోంది. బీసీ వర్గానికి చెందిన పటాన్‌చెరు మండలం చిట్కుల్‌కు చెందిన నీలం మధును అభ్యర్థిగా అధిష్ఠానం ఖరారు చేసింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మెదక్‌లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించగా, గజ్వేల్‌, దుబ్బాక మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అధికారంలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. భారాసలో అసంతృప్త నేతలను కాంగ్రెస్‌లో చేరేలా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దృష్టి సారించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో గెలుపుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. 

సుస్థిర ప్రభుత్వం కోసం...

దేశ వ్యాప్తంగా 400 ఎంపీ స్థానాలను సాధించాలనే లక్ష్యంగా భాజపా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా దక్షిణాదిన సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో వరుసగా ప్రధాని మోదీ సమావేశాలను నిర్వహించారు. ముందుగానే కమలం పార్టీ అభ్యర్థుల ఎంపిక చేపట్టింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన రఘునందన్‌రావు బరిలో ఉన్నారు. 2020 నవంబరులో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. మరోసారి ఎంపీగా బరిలో నిలిచే అవకాశం అధిష్ఠానం కల్పించింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బలమైన నేతగా ఎదిగిన ఆయన తనకున్న పరిచయాలతో పాటు, కేంద్ర ప్రభుత్వ పథకాలు...ప్రధాని మోదీ సుస్థిర పాలన వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

సిట్టింగ్‌ స్థానం కైవసం చేసుకునేలా...

మెదక్‌ స్థానంలో 2004 నుంచి భారాస(నాటి తెరాస) వరుసగా విజయఢంకా మోగిస్తూ వచ్చింది. ఈ స్థానం నుంచి ఎంపీగా కొనసాగిన కొత్త ప్రభాకర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో మాజీ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డికి అవకాశం కల్పించారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోని ఆరింటిలో భారాస ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత జిల్లా కావడంతో ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో భారాస ఉంది. సిట్టింగ్‌ స్థానంలో విజయం సాధించేలా ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు బాధ్యతను మాజీ మంత్రి హరీశ్‌రావు భుజాన వేసుకున్నారు. సంగారెడ్డి, మెదక్‌, దుబ్బాక, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు.

 • ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు  
 • 1952: జయసూర్య (పి.డి.ఎఫ్.)
 • 1957: పి.హనుమంతరావు (కాంగ్రెస్)
 • 1962: పి.హనుమంతరావు (కాంగ్రెస్)
 • 1967: సంగం లక్ష్మీబాయి (కాంగ్రెస్)
 • 1971: మల్లికార్జున్ (టి.పి.ఎస్.)
 • 1977: మల్లికార్జున్ (టి.పి.ఎస్.)
 • 1980: ఇందిరా గాంధీ (కాంగ్రెస్)
 • 1984: పి.మాణిక్యరెడ్డి (తెదేపా)
 • 1989: ఎం.బాగారెడ్డి (కాంగ్రెస్)
 • 1991: ఎం.బాగారెడ్డి (కాంగ్రెస్)
 • 1996: ఎం.బాగారెడ్డి (కాంగ్రెస్)
 • 1998: ఎం.బాగారెడ్డి (కాంగ్రెస్‌)
 • 1999: ఆలె నరేంద్ర (భాజపా)
 • 2004: ఆలె నరేంద్ర (తెరాస)
 • 2009: విజయశాంతి (తెరాస)
 • 2014: కేసీఆర్‌ (తెరాస)
 • 2014: కొత్త ప్రభాకర్‌రెడ్డి (ఉప ఎన్నిక) (తెరాస)
 • 2019: కొత్త ప్రభాకర్‌రెడ్డి (తెరాస)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img

లైవ్‌ టీవీ

తెలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ +

నోటిఫికేషన్‌ 18/04/2024
నామినేషన్లకు చివరి తేదీ 25/04/2024
నామినేషన్ల పరిశీలన 26/04/2024
ఉపసంహరణ 29/04/2024
పోలింగ్‌ తేదీ 13/05/2024
ఓట్ల లెక్కింపు 04/06/2024
పూర్తి షెడ్యూల్
img