icon icon icon
icon icon icon

TS polling: తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్‌

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 2,290 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు.

Updated : 30 Nov 2023 07:38 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ (Telangana Assembly Elections) ప్రారంభమైంది. మొత్తం 2,290 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. అధికారులు 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా మహిళలు ఎక్కువగా ఉన్నారు. సుమారు 68 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయించనున్నారు. పోలింగ్‌ నిర్వహణకు సుమారు 75 వేల మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని 40 వేల మంది, సరిహద్దు రాష్ట్రాల నుంచి 15 వేల మంది, 375 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు.

తీవ్రవాద ప్రభావితమైన 13 అసెంబ్లీ నియోజకవర్గాలను, 12,311 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇలా గుర్తించినవాటిల్లో సిర్పూరు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుంది.  రాష్ట్రంలోని 35,655 పోలింగ్‌ కేంద్రాలకుగాను 27,051 చోట్ల ఓటింగ్‌ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. ఒకటికి మించి పోలింగ్‌ కేంద్రాలున్న ప్రాంతాల్లో కూడా వీడియో కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్‌ ప్రక్రియలో 2 లక్షల మందికి పైగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. పర్యవేక్షణకు 3,800 మంది సెక్టార్‌ ఆఫీసర్లను, 22 వేల మంది సూక్ష్మ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది.

రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాస; 118 స్థానాల్లో కాంగ్రెస్‌, పొత్తులో ఒక చోట సీపీఐ; 111 చోట్ల భాజపా, పొత్తులో భాగంగా 8 స్థానాల్లో జనసేన; 19 నియోజకవర్గాల్లో సీపీఎం; 107 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడుగురు ఎంపీలు, 104 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, అయిదుగురు ఎమ్మెల్సీలు సహా 2,290 మంది అదృష్ట పరీక్షను ఎదుర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img