icon icon icon
icon icon icon

Assembly Election Results: భాజపా ‘ట్రిపుల్‌’ ధమాకా.. మూడు రాష్ట్రాల్లో కమలం సునామీ

Assembly Election Results: హిందీ రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. మధ్యప్రదేశ్‌లో భాజపా అధికారాన్ని నిలబెట్టుకోగా.. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ను గద్దె దించి కమలం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

Published : 03 Dec 2023 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Election Results)కు సంబంధించి నాలుగు రాష్ట్రాల ఫలితాలు నేడు వెలువడ్డాయి. ఇందులో భాజపా (BJP)కు భారీ విజయం దక్కింది. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను మించి.. హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్‌ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో కాషాయ జెండా రెపరెపలాడింది. మధ్యప్రదేశ్‌లో అఖండ మెజార్టీతో కమలనాథులు ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. ఇక, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ (Congress)ను గద్దె దించి భాజపా అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమైంది.

గహ్లోత్‌ సర్కారుకు షాక్‌..

రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని పునరావృతం చేస్తూ.. తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా విజయం సాధించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 200 నియోజకవర్గాలుండగా.. 199 స్థానాలకు నవంబరు 25న పోలింగ్‌ జరిగింది. ప్రభుత్వాన్ని ఆదివారం వెలువడుతున్న ఫలితాల్లో భాజపా మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరింది. ఇప్పటివరకు 101 స్థానాల్లో విజయం సాధించి.. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.  కాంగ్రెస్‌ 61 చోట్ల గెలిచి.. 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిగతా 14 స్థానాలను ఇతరులు దక్కించుకుంటున్నారు.

మధ్యప్రదేశ్‌లో అఖండ మెజార్టీ..

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి మధ్యప్రదేశ్‌లో అధికార భాజపా అఖండ మెజార్టీతో విజయం దిశగా పయనిస్తోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 230 స్థానాలుండగా.. ఇప్పటివరకు భాజపా 110 స్థానాల్లో విజయం సాధించి.. మరో 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తంగా ఈ పార్టీ 167 స్థానాలతో అఖండ మెజార్టీని దక్కించుకునే అవకాశముంది. కాంగ్రెస్‌కు 62 సీట్లు (30 గెలుపు + 32 ఆధిక్యం) దక్కే అవకాశం కన్పిస్తోంది. ఇతరులు ఒక చోట గెలిచారు.

ఛత్తీస్‌గఢ్‌ భాజపాదే..

ఛత్తీస్‌గఢ్‌లో ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు తారుమారయ్యాయి. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందనే అభిప్రాయాలు వినిపించగా.. అనూహ్యంగా భాజపా విజయఢంకా మోగించింది. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 సీట్లు కావాలి. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో భాజపా 22 చోట్ల గెలిచి.. మరో 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  కాంగ్రెస్‌ 32 స్థానాలకు (10 గెలుపు + 22 ఆధిక్యం) పరిమితమైంది. ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img