icon icon icon
icon icon icon

Amit Shah: తెలంగాణలో భాజపాను గెలిపిస్తే ఉచితంగా అయోధ్య దర్శనం: అమిత్‌ షా

అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు అయోధ్య రామయ్య దర్శనానికి ఉచితంగా ఏర్పాట్లు చేస్తామని భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు.

Updated : 18 Nov 2023 19:24 IST

గద్వాల: అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు అయోధ్య రామయ్య దర్శనానికి ఉచితంగా ఏర్పాట్లు చేస్తామని భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. గద్వాలలో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. భాజపాను గెలిపిస్తే రాష్ట్రానికి తొలి బీసీ సీఎంని చేసి తీరుతామన్నారు. ఈ ఎన్నికల్లో భారాస, కాంగ్రెస్‌ కంటే బీసీలకు అత్యధికంగా టికెట్లు ఇచ్చామని తెలిపారు.

రూ.100 కోట్లు ఏమయ్యాయ్‌?

‘‘శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి పుణ్యస్థలానికి రావడం నా అదృష్టం. జోగులాంబ ఆలయ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించింది. జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ ఏమైంది? రూ.100 కోట్లు ఇవ్వకపోగా మోదీ ఇచ్చిన డబ్బును కూడా ఖర్చు చేయలేదు. గుర్రంగడ్డ వంతెనను ఇప్పటికీ పూర్తి చేయలేదు. గద్వాలలో 300 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదు. కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తామన్న హామీని సైతం నెరవేర్చలేదు. గద్వాలలో చేనేతల కోసం హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ పార్కు నిర్మించలేదు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామన్న హామీనీ నెరవేర్చలేదు. పాలమూరు - రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టును ఇంకా పూర్తి చేయలేదు’’ అని అమిత్ షా విమర్శించారు.

అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ రికార్డు

అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్‌ రికార్డు సృష్టించారన్నారు. కారు స్టీరింగ్‌ ఒవైసీ చేతిలోనే ఉందని.. భారాస, కాంగ్రెస్‌, మజ్లిస్‌లు 2జీ, 3జీ, 4జీ పార్టీలని వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణ యువతను కేసీఆర్‌ మోసం చేశారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో యువత జీవితాలతో ఆడుకున్నారు. భాజపాకు అధికారమిస్తే ఐదేళ్లలో యువతకు 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. భాజపాను అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్లే అభివృద్ధి సాధ్యం. భారాసకు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం ఆసన్నమైంది’’ అని అమిత్‌షా వెల్లడించారు.

కాంగ్రెస్‌.. భారాస రెండూ కుటుంబ పార్టీలే..

భాజపాకు వేసే ఓటు తెలంగాణ, దేశ భవిష్యత్తును మారుస్తుందని అమిత్‌ షా అన్నారు. నల్గొండ సభలో అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘‘అవినీతితో నిండిన కారును మోదీ సంక్షేమ గ్యారేజీలో పడేసే సమయం వచ్చింది. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన సమయం వచ్చింది. స్మార్ట్‌ సిటీ కింద నల్గొండ అభివృద్ధికి మోదీ సర్కార్‌ రూ.400 కోట్లు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్‌ దుర్వినియోగం చేశారు. ప్రధాని మోదీ బీసీలకు సముచిత స్థానం కల్పించారు. ఎంబీబీఎస్‌ సీట్లలో బీసీలకు 25 శాతం రిజర్వేషన్‌ కల్పించాం. ఓట్ల కోసం భారాస.. ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చింది. ముస్లింలకు ఇచ్చిన మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఓబీసీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతాం. కాంగ్రెస్‌, భారాస రెండూ కుటుంబ పార్టీలే. తమ వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే ఆ కుటుంబ పార్టీల లక్ష్యం. భాజపా గెలిస్తే.. సీఎం అయ్యేది మా వారసులు కాదు. భాజపా గెలిస్తే.. బీసీ నేత సీఎం అవుతారు’’ అని అమిత్ షా అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img