icon icon icon
icon icon icon

Telangana elections 2023: O2.. మనకి ఆక్సిజన్‌!

Telangana Elections: జీవ మనుగడకు ఓ2 (ఆక్సిజన్‌) ఎంత కీలకమో.. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు విలువా  అంతే ముఖ్యమైనది. సమస్త జీవజాలానికి శ్వాస ఎంత అవసరమో, దేశ, రాష్ట్ర భవిష్యత్‌ నిర్మాణానికీ ఓటు అంతే కీలకం.

Updated : 29 Nov 2023 15:03 IST

జీవ మనుగడకు ఓ2 (ఆక్సిజన్‌) ఎంత కీలకమో.. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు విలువా అంతే ముఖ్యమైనది. సమస్త జీవజాలానికి శ్వాస ఎంత అవసరమో, దేశ, రాష్ట్ర భవిష్యత్‌ నిర్మాణానికీ ఓటు అంతే కీలకం. ఇది అందరూ వినియోగించుకునే అద్భుతమైన హక్కు. అయిదేళ్లకోసారి వచ్చే అవకాశాన్ని వదులుకుంటే సరికాని ప్రజాప్రతినిధులు మనని పాలిస్తారని గుర్తించాలి. ఎన్నికల సమయంలోనే ఓట్ల కోసమే పలకరించే వారిని కాకుండా పదవిలో ఉన్నా, లేకున్నా ప్రజలకు ఎల్లవేళలా వెన్నంటి ఉండే నేతను ఎన్నుకోవడానికి ఇదే అరుదైన అవకాశంగా భావించాలి. ఆక్సిజన్‌ కలుషితమైతే ఎన్ని అవస్థలు పడతామో.. ఓటు విషయంలో మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాలకు గురైనా ఇబ్బందులు పడాల్సిందే. నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకోవడం చాలా తప్పు. ఒక్కోసారి ఒకటి రెండు ఓట్లతోనే ఫలితాలు తారుమారైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వాలు మారిపోతాయేమోగానీ.. ఓటు అనేది నిశ్శబ్ద ఆయుధం. దాన్ని సక్రమంగా వినియోగించుకోవడం మనందరి బాధ్యత.

ఆ ఒక్క ఓటే..!

వాజ్‌పేయీపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రధాని పదవిని కోల్పోవలసి వచ్చిందంటే దాని విలువ అర్థమవుతుంది. అనేక ఎన్నికల్లోనూ అతి స్వల్ప ఓట్లతో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు అత్యున్నత పదవులు పొందారు. నగర, పట్టణ ప్రాంతాలలో ఓటు వేయడంపట్ల కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూశాం. గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఓటు హక్కు లేదంటే తీవ్రంగా ప్రశ్నిస్తారు. బతుకుదెరువు కోసం ఎంతో దూరం వెళ్లినా డబ్బు ఖర్చుచేసి ఓటేయడానికి వస్తారు.

అమ్ముకుంటే...?

ఈ ఎన్నికల్లో చాలాప్రాంతాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల కార్యకర్తలు ఓటుకు విలువ కట్టి ఓటరకు అందజేయడం సర్వసాధారణంగా మారిపోయింది. బరిలో నిలిచిన అభ్యర్థుల స్థితిని బట్టి ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేలకుపైగా అందిస్తుంటారు. అభ్యర్థులు అందజేస్తున్న డబ్బును తీసుకుని కొందరు ఓటర్లు తమ విలువైన హక్కును అమ్మేస్తున్నారు. డబ్బు విచ్చలవిడిగా పంచే వ్యక్తులు పదవి వచ్చాక అధికారాన్ని సంపాదనకు ఉపయోగిస్తారనే స్పృహ ప్రజల్లో రావాలి.


మోసగించడం కన్నా..  ఓడిపోవడం ఉత్తమం

న్నికల్లో గెలుపొందేందుకు ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇస్తున్నారు. ఇలాంటి హామీలతో ఓటర్లను మోసం చేసి గెలిచి, తరువాత వాటిని అమలు చేయలేరు. ఇలాంటి వారికి ఓటుతోనే గుణపాఠం చెప్పాలి. ప్రజా సమస్యలు పరిష్కరించే, హామీలు ఇవ్వడంతో పాటుగా వాటిని అమలు చేసే నాయకుడికి పట్టం కట్టాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది జరిగితేనే అభివృద్ధి సాధ్యపడుతుంది.

- అబ్రహాం లింకన్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img