icon icon icon
icon icon icon

Ts Elections: తెలంగాణలో రీపోలింగ్‌కు అవకాశం లేదు: సీఈవో వికాస్‌రాజ్

తెలంగాణలో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి (Telangana Elections 2023) పోలింగ్‌ దాదాపు 3 శాతం తగ్గిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు.

Updated : 01 Dec 2023 15:56 IST

హైదరాబాద్: తెలంగాణలో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి (Telangana Elections 2023) పోలింగ్‌ దాదాపు 3 శాతం తగ్గిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ (Vikas raj) తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం 71.07 శాతం పోలింగ్‌ నమోదైందని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

‘‘పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. పరిశీలకుల సమక్షంలో పోలైన ఓట్ల వివరాల పరిశీలన కొనసాగుతోంది. అది పూర్తవగానే పోలింగ్‌ శాతంపై పూర్తి స్పష్టత వస్తుంది. 79 నియోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. డిసెంబర్‌ 3న జరిగే ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాం. (Telangana Elections 2023) మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రంలో రీపోలింగ్‌కు అవకాశం లేదు. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03%, అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.56% పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 16,005 మంది వృద్ధులు, 9,459 మంది దివ్యాంగులు హోం ఓటింగ్ ఉపయోగించుకున్నారు. 1,80,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. థర్డ్ జెండర్ కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారు. 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 7,591 కేంద్రాల వెలుపల సీసీ టీవీ సదుపాయం కల్పించాం. (Telangana Elections 2023)

13,000 కేసులు నమోదు

లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది. 40 కంపెనీల బలగాలతో భద్రత కల్పిస్తున్నాం. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశాం. లెక్కింపు కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉంటాయి. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ 28 టేబుళ్లు ఉంటాయి. కౌంటింగ్‌ రోజు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుంది. ప్రతి టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ప్రలోభాలు, ఉల్లంఘనలకు సంబంధించి గతం కంటే ఈసారి ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 2018లో 2,400 కేసులు ఉంటే.. ఇప్పుడు 13,000 కేసులు నమోదయ్యాయి. కొందరు మంత్రులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు’’ అని వికాస్‌రాజ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img