icon icon icon
icon icon icon

Vikasraj: సోషల్‌ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధం: సీఈవో

ప్రచార గడువు ముగియడంతో సోషల్‌ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ (CEO Vikasraj) తెలిపారు.

Updated : 28 Nov 2023 18:32 IST

హైదరాబాద్‌: ప్రచార గడువు ముగియడంతో సోషల్‌ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ (CEO Vikasraj) తెలిపారు.  అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్‌ మీడియాలో అవకాశముందని స్పష్టం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని పేర్కొన్నారు. 

‘‘టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్ధం. ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదు. పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌పోల్స్‌ నిషేధం. ఎన్నికల విధుల్లో ఉన్న 1.48 లక్షల మంది  పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,094 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌. ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న 7,571 ప్రాంతాల్లో బయట కూడా వెబ్‌ కాస్టింగ్‌. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. పోలింగ్‌ కేంద్రానికి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు నిషేధం. తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.737 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాం’’ అని వికాస్‌రాజ్‌ వెల్లడించారు.

నియోజకవర్గాల వారీగా బరిలో ఉన్న అభ్యర్థులు వీరే!

పోలింగ్‌ రోజు విధిగా సెలవు ప్రకటించాలి..

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (Telangana elections) రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ (Vikas raj) తెలిపారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. (Election Commission) గత ఎన్నికల వేళ కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయని సీఈవో తెలిపారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల వేళ సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో.. లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు వికాస్‌ రాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. (Telangana elections)

విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు

తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు (school holidays) రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించన్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img