icon icon icon
icon icon icon

Chhattisgarh polls: పోలింగ్‌కు గంటల ముందు.. భాజపా అభ్యర్థి కారులో నగదు కలకలం

Chhattisgarh polls: మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో.. భాజపా అభ్యర్థి వాహనం నుంచి పోలీసులు నగదును స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది.

Updated : 16 Nov 2023 15:35 IST

కోర్బా: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో శుక్రవారం (నవంబరు 17) రెండో విడత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్‌ (Polling) జరగనుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కోర్బా జిల్లాలోని ఓ అభ్యర్థికి చెందిన వాహనంలో నగదు బయటపడటం కలకలం రేపింది. భాజపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రామ్‌ దయాల్ ఉకియ్‌ వాహనం నుంచి రూ.11.50లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన వాహనంలోనే ఉన్నారు.

తాజా ఎన్నికల్లో కోర్బాలోని పాలి-తనఖర్‌ స్థానం నుంచి ఉకియ్‌ బరిలో ఉన్నారు. గురువారం ఆయన ఈ నియోజవకర్గంలోని ఝుంకిడి గ్రామంలో వెళ్తుండగా.. కొందరు గ్రామస్థులు ఆయన కారును అడ్డుకున్నారు. అందులో నగదు ఉన్నట్లు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కారులో తనిఖీలు చేయగా.. రూ.11.50లక్షల నగదు బయటపడింది. ఆ నగదుకు ఉకియ్‌ ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కోర్బా ఎస్పీ జితేంద్ర శుక్లా వెల్లడించారు. వాహనాన్ని కూడా సీజ్‌ చేసినట్లు తెలిపారు. దీనిపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

ఛోటా నేతల దందాలు..! ఎన్నికల ఖర్చుల పేరిట వ్యాపారులకు వేధింపులు

ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. తొలి విడతలో భాగంగా నవంబరు 7న 20 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. రెండో విడతలో మిగిలిన 70 స్థానాలకు రేపు ఓటింగ్‌ నిర్వహించనున్నారు. కాగా.. ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన అక్టోబరు 9వ తేదీ నుంచి ఇప్పటివరకు రూ.73.90కోట్ల విలువైన నగదు, అక్రమ మద్యం, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img