icon icon icon
icon icon icon

Rajasthan polls: అధికారంలోకి వస్తే ‘కులగణన’.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

Rajasthan polls: రాజస్థాన్‌లో మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడుతామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో దీన్ని ప్రధానంగా పేర్కొంది.

Updated : 21 Nov 2023 11:38 IST

జైపుర్‌: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్న రాజస్థాన్‌ (Rajasthan)లో అధికార కాంగ్రెస్‌ (Congress) పార్టీ మంగళవారం మేనిఫెస్టో (Manifesto)ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఓటర్లను ఆకర్షించేందుకు హస్తం పార్టీ కీలక హామీలు కురిపించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని హామీ ఇచ్చింది. పంచాయతీ స్థాయిలో నియామకాల కోసం కొత్త వ్యవస్థను తీసుకొస్తామని తెలిపింది. ఇక, రైతులకు రూ.2లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, స్వామినాథన్‌ కమిషన్‌ ప్రకారం కనీస మద్దతు ధర ఇస్తామని ప్రకటించింది.

జైపుర్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ తదితరులు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఇప్పటికే పలు గ్యారంటీలను ప్రకటించగా.. తాజాగా ‘కులగణన’ను ఇందులో చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు ‘కులగణన’ ప్రస్తావన తీసుకొచ్చారు. అధికారంలోకి వస్తే తాము దేశవ్యాప్తంగా కచ్చితంగా కులాల వారీగా గణన చేపడుతామని తెలిపారు. తాజాగా అదే అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ రాజస్థాన్‌ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది.

తిరుగుబాటు తలపోటు!.. కాంగ్రెస్‌, భాజపాలకు అసమ్మతుల బెడద

మేనిఫెస్టోలోని ఇతర ముఖ్య అంశాలివే..

  • ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌
  • మహిళలకు ఏడాదికి రూ.10వేల నగదు 
  • ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానంపై చట్టం
  • రైతులకు రూ.2లక్షల వరకు వడ్డీలేని రుణాలు, పంటలకు కనీస మద్దతు ధర
  • ప్రభుత్వ కాలేజీలో చేరే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు
  • ‘చిరంజీవి’ మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ పథకం రూ.25లక్షల నుంచి రూ.50లక్షలకు పెంపు
  • ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రూ.15లక్షల వరకు బీమా పథకం

200 నియోజకవర్గాలున్న రాజస్థాన్‌లో నవంబరు 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23 వరకు ప్రచారానికి గడువు ఉంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్‌, భాజపా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే భాజపా తమ మేనిఫెస్టోను ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img