icon icon icon
icon icon icon

Elections: చరిత్రను మలుపు తిప్పిన ‘ఒక్క ఓటు’.. ఈ ఘటనలే సాక్ష్యం!

మీ ఒక్క ఓటు సమాజంలో ఏం మార్పు తీసుకొస్తుందని నిరుత్సాహ పడొద్దు. ఏమో మీ ఓటే సంచలనం సృష్టించొచ్చు.. చరిత్ర గతినీ మార్చొచ్చు. ఒక్క ఓటే చరిత్రను మలుపుతిప్పిన చారిత్రక సందర్భాలివే.. 

Published : 29 Nov 2023 19:37 IST

Telangana Assembly Polls 2023 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటు.. ప్రజల చేతిలో అదో వజ్రాయుధం. ఐదేళ్లకు ఒక్కసారి ప్రజల భవితను నిర్ణయించే సువర్ణావకాశమది. ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం వద్దు. ఒక్క ఓటుతో చరిత్ర తారుమారైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందువల్ల మీ ఒక్క ఓటు సమాజంలో ఏం మార్పు తీసుకొస్తుందని నిరుత్సాహ పడొద్దు. ఏమో మీ ఓటే సంచలనం సృష్టించొచ్చు.. చరిత్ర గతిని కూడా మలుపుతిప్పవచ్చు. అందువల్ల పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి మీ చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించండి. ప్రజాస్వామ్య యజ్ఞంలో భాగస్వాములవ్వండి. ఒక్క ఓటే చరిత్రను మలుపుతిప్పిన చారిత్రక సందర్భాలివే..

  • 1999లో కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతోనే కూలిపోయింది.
  • ఒక్క ఓటు తేడాతో.. ఆంగ్లంపై గెలిచి హిందీ మన దేశ అధికారిక భాషగా గుర్తింపు పొందింది.
  • 2004లో కర్ణాటకలోని సంతెమరహళ్లి నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన ఎ.ఆర్‌.కృష్ణమూర్తి ఒక్క ఓటుతో ఎమ్మెల్యే సీటును కోల్పోయారు.
  • 1776లో అమెరికాలో ఒకే ఒక్క ఓటు తేడాతో జర్మన్‌కు బదులుగా ఇంగ్లిష్‌ అధికార భాషగా మారింది.
  • 1714లో ఒక్క ఓటు తేడాతో కింగ్‌జార్జ్‌-1 ఇంగ్లండ్‌ పీఠమెక్కారు.
  • 1800లో థామస్‌ జెఫర్సన్‌, 1824లో జాన్‌ క్వీన్స్‌ ఆడమ్స్‌, 1876లో రూథర్‌ఫర్డ్‌ హెమ్స్‌లు ఎలక్టోరల్‌ కాలేజీలో ఒకే ఒక్క ఓటు తేడాతో అమెరికా అధ్యక్ష పదవులను అధిష్ఠించారు.
  • 1923 నవంబరు 8న జర్మనీలో నాజీ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు తేడాతో అడాల్ఫ్‌ హిట్లర్‌ ప్రత్యర్థి ఓడిపోయారు! లేదంటే ప్రపంచ చరిత్రే వేరుగా ఉండేదేమో!

2008 రాజస్థాన్‌ ఎన్నికల్లో ఒక్క ఓటు ఎంతపని చేసిందో తెలుసా?

2008 ఎన్నికల్లో రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు సీపీ జోషీ కాంగ్రెస్‌ని ముందుండి నడిపించారు. రేయనకా పగలనకా కష్టపడి పార్టీని ఎంతో బలోపేతం చేశారు. గెలిస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. కానీ.. అసెంబ్లీ ఎన్నికల్లో జోషీ ఒకే ఒక్క ఓటు తేడాతో పరాజయం పాలయ్యారు. ఆయనకు 62,215 ఓట్లు రాగా ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి కల్యాణ్‌సింగ్‌ చౌహాన్‌కు 62,216 ఓట్లు వచ్చాయి. ఆ ఒక్క ఓటే ఆయన భవితవ్యాన్ని పూర్తిగా మార్చివేసింది. నిజానికి ఆ ఎన్నికల్లో జోషి తల్లి, భార్య, కారు డ్రైవరు.. ఈ ముగ్గురూ ఓటు వేయలేదు. పైపెచ్చు తన డ్రైవర్‌ను జోషియే ఓటేయకుండా ఆపారట. వాళ్ల మూడు ఓట్లూ పడి ఉంటే ఆయనే సీఎం అయ్యేవారు. ఒక్క ఓటు విలువ ఎంతో చెప్పేందుకు ఇంతకు మించిన నిదర్శనమేం కావాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img