icon icon icon
icon icon icon

వైకాపా ప్రకటనల్లో ప్రభుత్వ లోగో.. గుడ్డిగా అనుమతిచ్చిన ఎంసీఎంసీ

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఓటర్లు ప్రభావితమయ్యేందుకు ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలూ తీసుకునే ఎన్నికల సంఘం..  వైకాపా రూపొందించిన ఎన్నికల ప్రచార వీడియో చిత్రాల్లో ప్రభుత్వ లోగో స్పష్టంగా కనిపిస్తున్నా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది.

Updated : 29 Apr 2024 07:44 IST

ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు

ఈనాడు, అమరావతి: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఓటర్లు ప్రభావితమయ్యేందుకు ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలూ తీసుకునే ఎన్నికల సంఘం..  వైకాపా రూపొందించిన ఎన్నికల ప్రచార వీడియో చిత్రాల్లో ప్రభుత్వ లోగో స్పష్టంగా కనిపిస్తున్నా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోని మీడియా సర్టిఫికేషన్‌, పర్యవేక్షణ కమిటీ (ఎంసీఎంసీ)లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెదేపా, జనసేన కార్యకర్తల్ని తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా వైకాపా రూపొందించిన కొన్ని ఎన్నికల ప్రచార వీడియో చిత్రాలకు ఎంసీఎంసీ 1712/ఈఎల్‌ఈసీ,ఏ/ఏ2/2024-41 నంబరుతో అనుమతిచ్చింది. వాటిలో ఒక వీడియోలో జనసేన కార్యకర్త ఆ పార్టీ జెండా పట్టుకుని నిస్పృహగా ఇంటికి వస్తాడు. జెండాని గుమ్మం దగ్గర గోడ చేర్పుగా పెట్టి, ఇంట్లో కూర్చుని గాజు గ్లాసులో టీ తాగుతుంటాడు. ఇంతలో ఆ యువకుడి తల్లి ఒక సంచిలో ఇంట్లోకి సరకులు తెస్తూ ఉంటుంది. దానిపై ముఖ్యమంత్రి జగన్‌ బొమ్మతో పాటు ప్రభుత్వ లోగో ఉంటుంది. ఇంతలో ఒక వాలంటీరు వచ్చి ఆ ఇంట్లోని పెద్దావిడకు ఒక కవరు అందజేస్తాడు. దానిపై వైఎస్సార్‌ పింఛను కానుక అని రాసి ఉంటుంది. జగన్‌ ఫొటో, ప్రభుత్వ లోగో కూడా ఉంటాయి. అవన్నీ చూశాక ఆ యువకుడు చేతిలోని గాజు గ్లాస్‌ని కింద పడేస్తాడు. జనసేన జెండా కూడా కింద పడిపోతుంది. ఆ యువకుడి ముఖంలో ఒక్కసారిగా సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రభుత్వ లోగోతో పంపిణీ చేసిన పథకాల్ని చూశాక ఆ జనసేన కార్యకర్త మనసు మారిపోయి వైకాపాలో చేరాడని చెప్పడం ఈ ప్రకటన ఉద్దేశం. తెదేపా కార్యకర్తల్ని ఉద్దేశించి కూడా అలాంటిదే మరో యాడ్‌ ఉంది. వాటిని ఐప్యాక్‌తో పాటు, వైకాపా సామాజిక మాధ్యమ విభాగాలు విస్తృతంగా ప్రచారంలో పెట్టాయి. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ సహా వివిధ సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారంలో ఉన్నాయి. ప్రభుత్వ లోగో ఉన్న ఈ ప్రచార చిత్రాలకు ఆమోదం తెలిపిన ఎంసీఎంసీ కమిటీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img