icon icon icon
icon icon icon

గన్నవరం.. మా కొద్దీ రౌడీరాజకీయం!

‘‘ఐదేళ్లలో ఏం జరిగింది సార్‌. ఎప్పుడూ ఏవో గొడవలు. కొద్దిపాటి వివాదాలను కూడా పెద్దవి చేస్తున్నారు.

Published : 29 Apr 2024 05:47 IST

భూ వివాదాలు, పంచాయితీలతో పెత్తనం
కొండలు, గుట్టల్లో అడ్డగోలుగా దోపిడీ
నిత్యం అల్లర్లతో విసిగిపోతున్న జనం
అమరావతిని పాడుబెట్టడంపై జనాగ్రహం  
ప్రశాంత వాతావరణానికే ప్రజాశీస్సులు
ఈనాడు ప్రత్యేక ప్రతినిధి


‘‘ఐదేళ్లలో ఏం జరిగింది సార్‌. ఎప్పుడూ ఏవో గొడవలు. కొద్దిపాటి వివాదాలను కూడా పెద్దవి చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఇక్కడి ప్రజాప్రతినిధి ‘వాణ్ని కొట్టి రండిరా తర్వాత చూసుకుందామని రెచ్చగొట్టారు. ఇంకెన్నాళ్లు ఈ రౌడీయిజం మధ్య బతకాలి? పక్క రాష్ట్రాలు అభివృద్ధితో పోటీ పడుతుంటే మనం పాతికేళ్లు వెనక్కిపోయామనిపిస్తోంది’’

బుద్దవరంలోని ఓ ప్రైవేటు ఉద్యోగి ఆందోళన


‘‘నా సంపాదనలో సగం అద్దెకే పోతోంది. సొంతిల్లు ఇస్తామంటే చాలా ఆనందించాం. మాకు కేసరపల్లి పొలాల్లో జగనన్న కాలనీలు మొదలుపెట్టారు. అక్కడ తాగునీరు లేదు. రహదారులు సరిగ్గాలేవు. పంట పొలాల మధ్య కాలువ గట్ల మీద అక్కడకు వెళ్లడం అంత తేలికకాదు. సొంతిల్లు కోసమని ఇంట్లో బంగారం అమ్మేశాను. అప్పులు చేశాను. దీని బదులు పట్టాభూమి ఇస్తే సరిపోయేది. ఇన్ని ఇబ్బందులు పడలేక ఆ ఇల్లు వద్దనుకున్నాం’’

గన్నవరంలోని ఒక కార్మికుడి ఆవేదన


‘‘అమరావతి రాజధాని ప్రకటనతో గన్నవరం కళకళలాడింది. భూముల ధరలు పెరిగాయి. కొత్త కంపెనీలు, పరిశ్రమలు వచ్చాయి. పెద్ద నగరంగా మారుతుందని ఎంతో ఆశపడ్డాం. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే బాధగా ఉంది. ప్రతిపక్ష నేతగా జగన్‌ ఇక్కడే రాజధాని అని, తర్వాత మాట మార్చటం అన్యాయం. ఆయన మడమ తిప్పడని అనుకున్నాం. పారిశ్రామికవాడల ఏర్పాటుతో లక్షల ఉద్యోగాలు వచ్చేవి. వైకాపా ప్రభుత్వం వచ్చాక అవన్నీ మాయం చేసి మాకు బాగా బుద్ధి చెప్పారు’’

పురుషోత్తపట్నంలోని విశ్రాంత ఉద్యోగి అభిప్రాయం


‘‘విజయవాడ పరిసర ప్రాంతంలో కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసి ఇక్కడ యువతకు ఉపాధి కల్పించాలని ఆశపడ్డా. గత ప్రభుత్వం మా సంకల్పంపై నమ్మకం ఉంచి ప్రోత్సహించి అనుమతులిచ్చింది. కంపెనీకి పునాది వేద్దామనుకునే లోపు ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఆ తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం మా ఆశయాన్ని రాజకీయాలతో ముడిపెట్టి అనుమతులు రద్దుచేసింది. సొంతూళ్లో మాకే ఇంతటి పరాభవం ఎదురైతే పొరుగు రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు ఇక్కడకు ఏ ధైర్యంతో రాగలరు?’’

విజయవాడకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ప్రశ్న


కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఐదేళ్లుగా నిత్యం గొడవలు, ఆందోళనలు, దౌర్జన్యాలతో విసుగెత్తిన జనం ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారు. పరిశ్రమల రాకతో ఈ ప్రాంతం మళ్లీ కళకళలాడాలనుకుంటున్నారు. అక్రమాలు, భూ ఆక్రమణలతో చెలరేగే వారికి ఓటుతో బుద్ధి చెబుతామంటున్నారు. తాజా ఎన్నికల్లో తెదేపా తరఫున యార్లగడ్డ వెంకట్రావు, వైకాపా నుంచి వల్లభనేని వంశీ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో తెదేపా నుంచి గెలిచిన వంశీ వైకాపాలో చేరారు. ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు ఈసారి తెదేపా నుంచి బరిలో నిలిచారు. నియోజకవర్గంలో ఇద్దరికీ బలమైన సామాజికవర్గం, కేడర్‌ ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’ రెండ్రోజుల పాటు ఈ నియోజకవర్గంలోని బుద్దవరం, కేసరపల్లి, పురుషోత్తపట్నం, బావులపాడు, ఎనికేపాడు, గన్నవరం తదితర ప్రాంతాల్లోని వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడినపుడు తాము ఎన్నుకోబోయే నాయకుడిపై వారిలో స్పష్టత కనిపించింది. అమరావతిని పాడుబెట్టడంపై ప్రతి ఐదుగురిలో నలుగురు ఆగ్రహం వ్యక్తంచేశారు. నేతల మాట తీరు, రౌడీయిజం పోకడలను పూర్తిగా వ్యతిరేకించారు.

నోటిదురుసుతో జనం దూరం..

‘రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కుటుంబాన్ని తూలనాడడం, తండ్రి లాంటి చంద్రబాబుపై నోరు పారేసుకొని వంశీ జనానికి దూరమయ్యారని.. తన అనుచరులతో తెదేపా కార్యాలయానికి నిప్పంటించి ఇమేజ్‌ పోగొట్టుకున్నారని’ ఉంగుటూరు మండలానికి చెందిన మాజీ సర్పంచి ఒకరు వివరించారు. గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామాల్లో కక్షలు పెరిగేందుకు ఆయనే కారణమని ఆందోళన వ్యక్తంచేశారు. 2019లో వైకాపా గాలిలోనూ తెదేపా శ్రేణుల అండదండలతో వంశీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కొంతకాలానికే వైకాపా కండువా కప్పుకున్న ఆయన తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేకెత్తించాయి. ఇన్నేళ్లు ఆయన్ను అభిమానించిన పార్టీ శ్రేణులతోపాటు సామాన్య ప్రజల్లోనూ మొదలైన వ్యతిరేకత క్రమంగా పెరుగుతూ వచ్చింది. నియోజకవర్గంలో ప్రశ్నించే వారిపై దాడి చేసేంతగా అనుచరులను రెచ్చగొట్టేవారని గన్నవరంలో ఆటో డ్రైవర్‌ ఒకరు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా పోస్టు పెట్టాడని తన తమ్ముడిని బెదిరించారని ఆవేదన వెలిబుచ్చారు.

పల్లెల్లో ప్రైవేటు పెత్తనం

నాలుగేళ్ల కాలంలో కొండలు, గుట్టలు అడ్డంగా దోచుకున్నారు. మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల్లో నలుగురైదుగురు చొప్పున అనుచరులను ఏర్పాటు చేసి భూ వివాదాలు, ప్రైవేటు పంచాయితీలతో తమపై పెత్తనం చేయడాన్ని సామాన్యులు భరించలేకపోతున్నారు. వివాదాస్పద భూములను గుర్తించి పరిష్కరిస్తామంటూ అధికార పార్టీ నాయకులే దళారుల అవతారం ఎత్తి దోచుకుంటున్నారని బావులపాడుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వివరించారు. తమ మండలంలో ఒక రైతుకు చెందిన భూమి అడంగల్‌ మార్చి ఒక నాయకుడు రూ. 10 లక్షలు తీసుకున్నాడని ఆయన తెలిపారు. తెదేపా ప్రభుత్వంలో రవాణా ఖర్చులకు 1,800 వెచ్చిస్తే ట్రాక్టర్‌ ఇసుక దొరికేది. రూ. ప్రస్తుతం ట్రాక్టర్‌ ఇసుక ధర రూ. 5,000 ఉందని తెంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు తెలిపారు. రెండేళ్ల క్రితం గ్రామంలో కలుషిత నీటి వల్ల అతిసార లక్షణాలతో 8 మంది మరణించారు. దీంతో అధికారులు తాగునీటి కోసం రూ. 30 లక్షలకు పైగా వెచ్చించి పైపులు వేయించారు. అంత హడావుడి చేసిన యంత్రాంగం వాటి ద్వారా నీళ్లు ఇవ్వడమే లేదని గ్రామానికి చెందిన ఒక మహిళ వివరించారు. బావులపాడు, గన్నవరం, విజయవాడ రూరల్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య వెంటాడుతోంది.


పరిశ్రమలకు రాజకీయరంగు.. ఐటీ కంపెనీలకు షరతులు

వైకాపా అధికారం చేపట్టాక కొత్త సంస్థల ఏర్పాటు ఎలా ఉన్నా ముందుకొచ్చిన ఔత్సాహికులు పారిపోయేలా చేశారు. సొంతూరిపై మమకారంతో ఆసక్తి చూపిన పారిశ్రామికవేత్తలను భయపెట్టారంటూ గన్నవరంలో ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు ఆవేదన వెలిబుచ్చారు. 2014లో రాష్ట్రం ఏర్పాటు, అమరావతి రాజధాని ప్రకటనతో గన్నవరం విమానాశ్రయానికి తాకిడి పెరిగింది. విజయవాడకు సమీపంలో ఉండడంతో పరిశ్రమల ఏర్పాటుకు ఈ ప్రాంతం అనువైనదిగా గుర్తించారు. భారీగా రాయితీలు ఇస్తామని తెదేపా ప్రభుత్వం ప్రకటించడంతో పారిశ్రామికవేత్తలు ఉత్సాహపడ్డారు. సొంత ప్రాంతంలో స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆరాటపడ్డారు. మేధా టవర్స్‌ 01, 02 ఏర్పాటుతో ఈ ప్రాంతం మరో గచ్చిబౌలిగా మారుతుందని భావించారు. ఈ టవర్స్‌లో స్థానం కోసం ఐటీ కంపెనీలు పోటీపడ్డాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక టవర్‌ 02 నిర్మాణం అటకెక్కింది. షరతులు భరించలేక కొత్త కంపెనీలు ముఖం చాటేశాయి. అలాగే బావులపాడు మండలం మల్లపల్లిలో పారిశ్రామికవాడకు 1,360 ఎకరాలు కేటాయించారు. తక్కువ ధరకు భూములు అందించారు. దేశవిదేశాల నుంచి ఎంతోమంది ముందుకు రావడంతో పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. అశోక్‌ లేల్యాండ్‌ యూనిట్‌ పూర్తిచేశారు. ఎలక్ట్రికల్‌ బస్సుల తయారు చేయాలనుకున్నారు. వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవాడలకు రాజకీయరంగు పులిమింది. అక్కడ భూముల ధరలను అమాంతం పెంచేసి మౌలిక సౌకర్యాల కల్పనను నిర్లక్ష్యం చేసింది. ఆంక్షలు, హద్దులతో కొత్త యూనిట్లు రాకపోగా, కొన్ని యూనిట్ల లైసెన్స్‌లను రద్దు చేసింది. తెదేపా హయాంలో వీరపనినేనిగూడెం వద్ద పారిశ్రామికవాడ ఏర్పాటైంది. 78 ఎకరాల విస్తీర్ణంలో 40 మంది ఔత్సాహికులు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చారు. బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాల తయారీ యూనిట్‌ సహా కొన్ని పరిశ్రమలు కార్యరూపం దాల్చాయి. వైకాపా పగ్గాలు చేపట్టగానే, కేటాయించిన స్థలాల్లో యూనిట్లు ఏర్పాటు చేయలేకపోయారంటూ లైసెన్స్‌లు రద్దు చేసింది. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరికొందరు వివాదాల్లో తలదూర్చలేక తప్పుకున్నారని ఆ ప్రాంతానికి చెందిన ఒక సర్పంచి తెలిపారు. ఐదేళ్ల క్రితం ఎకరా భూమి రూ.కోటి ధర పలికిందని ఈ ప్రభుత్వం వచ్చాక స్థలాల ధరలు తగ్గాయని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానంటూ చెప్పిన వంశీ ఈ పారిశ్రామికవాడల సమస్యలు తీర్చుతారని భావించామని.. దౌర్జన్యాలు, మట్టి, ఇసుక దోపిడీతో చెలరేగుతారని ఊహించలేకపోయామని ఆవేదన వెలిబుచ్చారు. కొద్దిరోజుల క్రితమే ఇక్కడ రహదారుల నిర్మాణం చేపట్టడం గమనార్హం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img