icon icon icon
icon icon icon

రూ.10 కోట్ల విలువైన కుక్కర్‌ కూపన్ల పట్టివేత

ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు తాయిలాలు ఎరవేసిన వైకాపా.. ప్రస్తుతం ఓటర్లకు నేరుగా బహుమతులు పంచేందుకు సిద్ధమైంది.

Updated : 29 Apr 2024 07:00 IST

సీ విజిల్‌ యాప్‌లో ఫిర్యాదుతో వెలుగులోకి

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు తాయిలాలు ఎరవేసిన వైకాపా.. ప్రస్తుతం ఓటర్లకు నేరుగా బహుమతులు పంచేందుకు సిద్ధమైంది. కుక్కర్ల పంపిణీకి పార్టీ గుర్తుతో కూపన్లు ముద్రిస్తూ, సీ విజిల్‌ యాప్‌నకు అందిన ఫిర్యాదుతో దొరికిపోయింది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం అజిత్‌సింగ్‌నగర్‌లోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్‌లో పెద్దమొత్తంలో కుక్కర్లు ప్యాకింగ్‌ చేసి ఉన్నాయని ఆదివారం మధ్యాహ్నం సీ విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు వచ్చింది. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌-9 అధికారి డి.రవిచంద్ర సూర్యకుమార్‌ సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఎక్కడా వస్తువులు కనిపించలేదు. కానీ ప్రెషర్‌ కుక్కర్‌, ఫ్యాన్‌ గుర్తున్న షీట్లు 5,250 దొరికాయి. ఒక్కో షీట్‌లో 24 కూపన్లున్నాయి. దీనిపై రవిచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు.

కూపన్లు ఇక్కడ.. కుక్కర్లు ఎక్కడ?

పోలీసులు తనిఖీ చేయగా మొత్తం 1,26,000 కూపన్లు దొరికాయి. కుక్కర్లు దొరక్కపోవడంతో వాటిని రహస్య ప్రదేశంలో దాచారా? లేక దుకాణాల గోదాముల్లో నిల్వ చేశారా అన్న కోణాల్లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఓటర్లు ఈ కూపన్లను పట్టుకెళ్లి కుక్కర్లు తెచ్చుకునేలా ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వాలంటీర్లకు వైకాపా నాయకులు ఒక్కోటి రూ.800 విలువ చేసే కుక్కర్లు పంచారు. తాజా కూపన్లలోనూ అలాంటి చిత్రాలే ముద్రించారు. ఈ లెక్కన 1.26 లక్షల కుక్కర్ల వ్యయం రూ.10 కోట్లపైనే ఉంటుంది. అంతమొత్తంలో వస్తువులను దుకాణాల్లో ఉంచడం అసాధ్యమని, అవి ఎక్కడ దాచారో తేల్చాల్సి ఉందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img