icon icon icon
icon icon icon

నాడు క్లీన్‌స్వీప్‌.. మరి నేడు?

ఛత్తీస్‌గఢ్‌లో అయిదేళ్ల కిందట తాము క్లీన్‌స్వీప్‌ చేసిన సర్గుజా డివిజనులో మరోసారి ప్రభంజనం సృష్టించాలని కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతోంది.

Updated : 12 Nov 2023 12:35 IST

సర్గుజాలో ప్రభంజనంపై మరోసారి కాంగ్రెస్‌ కన్ను

ఛత్తీస్‌గఢ్‌లో అయిదేళ్ల కిందట తాము క్లీన్‌స్వీప్‌ చేసిన సర్గుజా డివిజనులో మరోసారి ప్రభంజనం సృష్టించాలని కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతోంది. రాజవంశీయుడైన స్థానిక సీనియర్‌ నేత టి.ఎస్‌.సింగ్‌ దేవ్‌కు ఉన్న ప్రజాకర్షణ శక్తి అందుకు ఉపకరిస్తుందని భావిస్తోంది. మరోవైపు పలువురు కొత్త  అభ్యర్థులను బరిలో దింపడం ద్వారా ఈసారి సర్గుజాలో సత్తా చాటాలని భాజపా వ్యూహాలు రచిస్తోంది.

సర్గుజా: దట్టమైన అడవులు, అపార ఖనిజ వనరులకు ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా డివిజను నెలవు. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో ఇది విస్తరించి ఉంది. ఉత్తరాన ఉత్తర్‌ప్రదేశ్‌తో, పశ్చిమాన మధ్యప్రదేశ్‌తో, తూర్పున ఝార్ఖండ్‌తో ఈ డివిజను సరిహద్దులు పంచుకుంటోంది. ఒకప్పుడు ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. కాలక్రమంలో వారి కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి. సర్గుజాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో (2008, 2013) ఇక్కడ భాజపా, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడ్డాయి. 2018లో మాత్రం కమలదళం ఘోరంగా చతికిలపడింది. హస్తం పార్టీ 14 స్థానాలనూ గెల్చుకొని ఔరా అనిపించింది.


కాంగ్రెస్‌: సింగ్‌ దేవ్‌పై భరోసా

సర్గుజా రాజవంశ వారసుడైన సింగ్‌ దేవ్‌కు ఈ డివిజనుపై గట్టి పట్టుంది. ఈయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. సింగ్‌ దేవ్‌తో పాటు అమర్‌జీత్‌ భగత్‌, ప్రేమ్‌సాయి సింగ్‌ టెకామ్‌లకూ ఈ ప్రాంతం నుంచి సీఎం భూపేశ్‌ బఘేల్‌ కేబినెట్‌లో స్థానం లభించింది. టెకామ్‌ ఈ ఏడాది జులైలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. సింగ్‌ దేవ్‌కు స్థానికంగా ఉన్న ప్రజాదరణ తమకు ఈ ఎన్నికల్లోనూ లాభిస్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. సర్గుజాలో ఈసారి 10-11కు తగ్గకుండా సీట్లు గెల్చుకుంటామని సింగ్‌ దేవ్‌ చెబుతున్నారు.


అంతర్గత కుమ్ములాటలు

ప్రధానంగా స్వపక్ష నాయకుల మధ్య కుమ్ములాటలు సర్గుజాలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాయి సింగ్‌ టెకామ్‌ (ప్రతాప్‌పుర్‌), చింతామణి మహారాజ్‌ (సామ్రీ), బృహస్పత్‌ సింగ్‌ (రామానుజ్‌గంజ్‌), వినయ్‌ జయస్వాల్‌ (మనేంద్రగఢ్‌)లకు పార్టీ ఈసారి టికెట్లు కేటాయించలేదు. సింగ్‌ దేవ్‌ తనను హత్య చేయించే ముప్పుందంటూ 2021లో బృహస్పత్‌ చేసిన ఆరోపణలు పార్టీలో తీవ్ర కలకలం సృష్టించాయి. రామానుజ్‌గంజ్‌లో ప్రస్తుతం ఆయనకు బదులు.. రెండుసార్లు అంబికాపుర్‌ మేయర్‌గా పనిచేసిన అజయ్‌ తిర్కీకి కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది. మరోవైపు- బఘేల్‌, సింగ్‌ దేవ్‌ల మధ్య విభేదాలు రాష్ట్రంలో అందరికీ తెలిసినవే! కాంగ్రెస్‌ గెలిస్తే సింగ్‌ దేవ్‌ సీఎం అవుతారని గత ఎన్నికల వేళ సర్గుజాలో ప్రచారం జరిగింది. దాంతో స్థానిక ఓటర్లు ఆ పార్టీకి గంపగుత్తగా ఓటేశారు. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తాము గెలిస్తే మళ్లీ బఘేలే సీఎం అవుతారని సింగ్‌ దేవ్‌ స్వయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరమే.

భాజపా: సత్తా చాటాలన్న పట్టుదలతో..

గత ఎన్నికల్లో సర్గుజాలో ఘోరంగా దెబ్బతిన్న భాజపా ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలన్న పట్టుదలతో ఉంది. ప్రస్తుతం ఈ డివిజనులో ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించింది. భరత్‌పుర్‌ సోహ్‌నత్‌లో రేణుకా సింగ్‌, పథల్‌గావ్‌లో గోమతీ సాయ్‌ పోటీ చేస్తున్నారు. రేణుకా సింగ్‌ కేంద్ర మంత్రి కూడా. కేంద్ర మాజీ మంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ ఇక్కడి కుంకురీ స్థానంలో బరిలోకి దిగారు. సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఏడాదే రాజకీయాల్లో ప్రవేశించిన 33 ఏళ్ల రామ్‌కుమార్‌ టొప్పోకు భాజపా సీతాపుర్‌ టికెట్‌ కేటాయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img