icon icon icon
icon icon icon

మధ్య భారత్‌లో మొగ్గు ఎటు?

మధ్యప్రదేశ్‌కు కేంద్ర స్థానంగా ఉన్నమధ్య భారత్‌ ప్రాంతంలో 3 దశాబ్దాలుగా భాజపాదే హవా. ప్రాంతీయంగా అదే జోరు కొనసాగించాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతుండగా.. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని మెరుగైన ఫలితాలు రాబట్టడంపై కాంగ్రెస్‌ కన్నేసింది.

Updated : 17 Nov 2023 05:00 IST

మధ్యప్రదేశ్‌కు కేంద్ర స్థానంగా ఉన్నమధ్య భారత్‌ ప్రాంతంలో 3 దశాబ్దాలుగా భాజపాదే హవా. ప్రాంతీయంగా అదే జోరు కొనసాగించాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతుండగా.. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని మెరుగైన ఫలితాలు రాబట్టడంపై కాంగ్రెస్‌ కన్నేసింది.

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ చుట్టూ మధ్య భారత్‌ విస్తరించి ఉంది. భోపాల్‌, నర్మదాపురం రెవెన్యూ డివిజన్లను కలిగి ఉండటంతో కొందరు దీన్ని భోపాల్‌-నర్మదాపురం ప్రాంతంగానూ పిలుస్తుంటారు. ఇక్కడ మొత్తం 36 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ (బుధ్నీ) సహా రాష్ట్ర మంత్రులు కమల్‌ పటేల్‌ (హర్దా), ప్రభురాం చౌధరీ (సాంచీ), విశ్వాస్‌ సారంగ్‌ (భోపాల్‌-నరేలా) ఈ ప్రాంతం నుంచే ఎన్నికల బరిలో ఉన్నారు.

మామపై పోటీకి ‘హనుమంతుడు’

రాష్ట్ర ప్రజలు ప్రేమగా మామ అని పిలుచుకునే సీఎం చౌహాన్‌ బుధ్నీలో ఈ దఫా కూడా విజయం సాధించడం సులువేనన్నది విశ్లేషకుల అంచనా. ఓ టీవీ సీరియల్‌లో హనుమంతుడి పాత్ర పోషించిన విక్రమ్‌ మాస్తాల్‌ను కాంగ్రెస్‌ బరిలో దింపింది.  

  • రాయ్‌సేన్‌ జిల్లాలోని భోజ్‌పుర్‌ మరో కీలక సీటు. భోపాల్‌ నగర శివార్లలోని ఈ స్థానంలో 1982 నుంచి ఇప్పటిదాకా భాజపా ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. 2003లో అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సురేంద్ర పట్వాను కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేశ్‌ పటేల్‌ ఓడించారు. సురేంద్ర తండ్రి సుందర్‌లాల్‌ పట్వా భాజపా దిగ్గజ నేతల్లో ఒకరు. ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
  • హోశంగాబాద్‌లో పరస్పరం తలపడుతున్న గిరిజాశంకర్‌ శర్మ (కాంగ్రెస్‌), సీతాశరణ్‌ శర్మ (భాజపా) స్వయానా అన్నదమ్ములు. హర్దా జిల్లాలోని టిమ్రనీ నియోజకవర్గంలోనూ కుటుంబ పోరు ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సంజయ్‌ షా (భాజపా) వరుసగా రెండోసారి తన అన్న కుమారుడు అభిజీత్‌ షా (కాంగ్రెస్‌)తో తలపడుతున్నారు.

మధ్య భారత్‌ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలు - 36

2018లో ఎవరికెన్ని సీట్లు?

  • భాజపా 24  
  • కాంగ్రెస్‌ 12

ధీమాగా కమలదళం

ప్రాంతీయంగా ముందునుంచీ ఆరెస్సెస్‌ ప్రాబల్యం ఎక్కువ. అది ఎన్నికల్లో భాజపాకు కలిసొస్తోంది. కొన్ని పొరపాట్ల వల్ల 2018 ఎన్నికల్లో బైతూల్‌, రాజ్‌గఢ్‌ జిల్లాల్లో తాము ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చిందని భాజపా రాష్ట్ర కార్యదర్శి రజనీశ్‌ అగ్రవాల్‌ తెలిపారు. ఆ తర్వాత సామాజిక-రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అనేక చర్యలు చేపట్టామని.. అవి ఈ ఎన్నికల్లో తమకు లాభిస్తాయని పేర్కొన్నారు.


ఆశల పల్లకిలో కాంగ్రెస్‌

మధ్యభారత్‌లో వ్యవస్థాగతంగా బలంగా లేకపోవడం వల్లే ఇక్కడి ఎన్నికల్లో తమకు వరుసగా చేదు ఫలితాలు ఎదురయ్యాయని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ మీడియా విభాగం ఛైర్మన్‌ కె.కె.మిశ్ర అన్నారు. గత అయిదేళ్లలో తాము ఇక్కడ బూత్‌ స్థాయి నుంచీ బలోపేతమయ్యామని చెప్పారు. కాబట్టి ఈ దఫా చాలా మెరుగైన ఫలితాలు సాధించగలమంటూ ధీమా వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img