కేసీఆర్‌ ఖేల్‌ ఖతం

‘ప్రస్తుత ఎన్నికలతో భారాస ఆట ముగియనుంది. మొదటిసారి తెలంగాణలో భాజపా ప్రభుత్వం రాబోతోంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కేసీఆర్‌ ట్రైలర్‌ చూశారు.

Updated : 28 Nov 2023 06:35 IST

భారాసను దగ్గరకు రానివ్వం
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రతి పథకంలో దోపిడీ తథ్యం
ఒక జబ్బును వదిలించుకొని మరో రోగం తెచ్చుకోవద్దు
మహబూబాబాద్‌, కరీంనగర్‌ సభల్లో ప్రధాని నరేంద్రమోదీ

మహబూబాబాద్‌, కరీంనగర్‌ల నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి: ‘ప్రస్తుత ఎన్నికలతో భారాస ఆట ముగియనుంది. మొదటిసారి తెలంగాణలో భాజపా ప్రభుత్వం రాబోతోంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కేసీఆర్‌ ట్రైలర్‌ చూశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు పూర్తి సినిమా చూపిస్తారు. ఆయన ఖేల్‌ ఖతమవుతుంది. భారాస అవినీతిపరులను జైలుకు పంపించాలని సంకల్పం తీసుకున్నాం. భూములు, సాగునీటి ప్రాజెక్టులు, మద్యం కుంభకోణాలకు పాల్పడినవారిని, పేపర్‌ లీకేజీ దోషులను, రెండుపడక గదుల ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన వారిని కటకటాల్లోకి పంపిస్తాం’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సోమవారం ఆయన మహబూబాబాద్‌, కరీంనగర్‌లలో భాజపా ఆధ్వర్యంలో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభల్లో పాల్గొని ప్రసంగించారు. ‘‘భారాసను ఎప్పుడూ మా దరిదాపుల్లోకి రానీయబోం. భాజపా బలం తెలిసి కేసీఆర్‌ మాతో స్నేహం చేయాలనుకున్నారు. దిల్లీకి వచ్చి ఆయన కుమారుడిని సీఎంను చేస్తే ఎన్డీయేలో చేరతామని చెప్పారు. మేము తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉండబోమని స్పష్టంచేశా. అప్పటి నుంచి నన్ను, మా పార్టీని భారాస నేతలు దూషించడం ప్రారంభించారు. సంప్రదాయం, సాంకేతికతల మేళవింపుగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ మూఢనమ్మకాల రాష్ట్రంగా మార్చారు. సచివాలయాన్ని కూల్చి ప్రజాధనం వృథా చేశారు.  తెలంగాణలో భాజపా కొత్త చరిత్ర సృష్టించబోతోంది. ప్రజల ఆశీర్వాదంతో మొదటిసారి అధికారంలోకి రానుంది. భారాసను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించడం అంటే ఒక జబ్బును వదిలించుకొని మరో రోగం తెచ్చుకోవడమే.

కాళేశ్వరం అవినీతి యావత్‌ దేశానికీ తెలుసు

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణలో అధికారం దక్కించుకున్న కేసీఆర్‌.. రాష్ట్రానికి కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగులను మిగిల్చారు. రైతులకు సాగునీరు పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరం అవినీతి గురించి తెలంగాణకే కాదు... యావత్‌ దేశానికీ తెలుసు. అవినీతి చేసిన భారాస నేతలకు తగిన శిక్ష పడాలా, వద్దా? ఇలాంటి ప్రభుత్వాన్ని పేదలంతా శిక్షించాలి. తెలంగాణలో ప్రజలను మోసం చేయడానికి భారాస, కాంగ్రెస్‌ ఏ ఒక్క అవకాశాన్నీ వదలలేదు. కాంగ్రెస్‌ హయాంలో కరీంనగర్‌లో మావోయిస్టు హింస చెలరేగింది. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంపై భాజపా కఠిన చర్యలు తీసుకుంది.

డిసెంబరు 3న భారాస కరెంట్‌ కట్‌

తెలంగాణలో డిసెంబరు 3న భారాస కరెంట్‌ కట్‌ అవుతుంది. కాంగ్రెస్‌ తరఫున ఎవరైన గెలిచినా వాళ్లు ఎప్పుడైనా భారాసలో చేరుతారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే మళ్లీ కేసీఆర్‌ను గద్దె ఎక్కించడమే. కాంగ్రెస్‌ వస్తే... వాళ్లకు తెలంగాణ ఏటీఎం అవుతుంది. ప్రతి పథకంలో పేదలనూ దోపిడీ చేస్తుంది.

భాజపా వైపు మొగ్గు

నేను ఎక్కడికి వెళ్లినా భారాసను దించేస్తాం.. కాంగ్రెస్‌ను రానివ్వం అనే నినాదం వినిపిస్తోంది. బీసీ వ్యక్తిని భాజపా సీఎం చేస్తుంది. మాదిగలకు న్యాయం చేస్తుంది. భాజపా మాత్రమే తెలంగాణ ప్రతిష్ఠ పెంచుతుంది. తెలంగాణలో ఓ వైపు కేసీఆర్‌ ఉన్నారు.. మరో వైపు మీ సేవకుడు మోదీ ఉన్నాడు’’ అని ప్రధాని అన్నారు. మహబూబాబాద్‌ సభలో అభ్యర్థులు రవీంద్ర నాయక్‌(ఇల్లెందు), ధర్మారావు(భద్రాచలం), హుస్సేన్‌ నాయక్‌(మహబూబాబాద్‌), సంగీత(డోర్నకల్‌), పుల్లారావు(నర్సంపేట), బాలరాజు (పినపాక) తదితరులు పాల్గొన్నారు.

అశ్మక జనపదం... ఈ ప్రాంతం

‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ.. మహబూబాబాద్‌లో కురవి వీరభద్రస్వామి, సమ్మక్కసారలమ్మ, సేవాలాల్‌ మహారాజ్‌, కరీంనగర్‌లో వేములవాడ రాజన్నలను స్మరించుకున్నారు. శాతవాహనులు, కాకతీయులు, మౌర్యుల కర్మభూమి అంటూ కరీంనగర్‌ చరిత్రను గుర్తుచేశారు. చరిత్రలో 16మహాజనపదాలు ఉండగా అందులో అశ్మక జనపదం ఈ ప్రాంతమని అన్నారు.


ప్రభుత్వం చేసిన కుంభకోణాలన్నింటిపై విచారణ చేయిస్తాం. మా ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదు. మద్యం కేసు దర్యాప్తు వేగవంతం చేస్తాం. కేసీఆర్‌కు చెమటలు పట్టిస్తాం. మా పార్టీ మాత్రమే భారాసకు బుద్ధి చెప్తుంది. దోచుకున్న సొమ్ము కక్కిస్తుంది.


దేళ్ల బాలుడి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారు. పదేళ్ల వయసు గల తెలంగాణకు వచ్చే అయిదేళ్లు చాలా కీలకం. ఇప్పుడు రాష్ట్రాన్ని దాని అదృష్టానికి దానిని వదిలేయలేం... అందుకే ప్రజలు అన్ని కోణాల్లో ఆలోచించి ఓటేయాలి.

 ప్రధాని మోదీ


రీంనగర్‌ను లండన్‌ చేస్తామని చెప్పి కేసీఆర్‌ అరచేతిలో వైకుంఠం చూపారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ నిధులిచ్చినా అభివృద్ధి చేయలేదు. అధికారంలోకి వస్తే కరీంనగర్‌ను సిల్వర్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు భాజపా కృషి చేస్తుంది. నగరానికి సీ-1 హోదాయే మా లక్ష్యం.


మోదీ నీడ పడితే  నీ సంపద మొత్తం పోతుందని కేసీఆర్‌కు ఎవరో చెప్పారు. అందుకే నాకు ఎదురుపడడం లేదు. నేను ఎప్పుడు వచ్చినా 50 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు.


కుటుంబ పార్టీలతో ప్రతిభకు ఎంతటి అన్యాయం జరుగుతుందో ఈ గడ్డను చూస్తే తెలుస్తుంది. ఈ నేల పీవీ నరసింహారావులాంటి వ్యక్తిని అందించింది. కానీ చనిపోయిన తర్వాత కూడా ఆయనను కాంగ్రెస్‌ ఘోరంగా అవమానించింది.

ప్రధాని మోదీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని