icon icon icon
icon icon icon

భారాసకు మళ్లీ అవకాశమిస్తే భూముల లూటీ

దేశంలోనే ధనిక పార్టీగా భారాస మారిందని.. ఆ పార్టీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించాలని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ అన్నారు.

Updated : 28 Nov 2023 06:44 IST

అవినీతి ఆకాశానికి.. అప్పు పదింతలకు చేరుతుంది
దేశంలో ఏకైక ఫామ్‌హౌస్‌ సీఎం కేసీఆర్‌
భువనగిరి, గద్వాల, కోస్గి సభల్లో ప్రియాంకా గాంధీ
ఆ పార్టీకి అంత డబ్బెలా వచ్చిందని ప్రశ్న

ఈనాడు, మహబూబ్‌నగర్‌ - న్యూస్‌టుడే, భువనగిరి పట్టణం: దేశంలోనే ధనిక పార్టీగా భారాస మారిందని.. ఆ పార్టీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించాలని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ అన్నారు. సోమవారం ఆమె భువనగిరి, గద్వాల, కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.      ‘‘భారాస ప్రభుత్వంలో చిన్నపని జరగాలన్నా కమీషన్‌ ఇచ్చుకోవాలి. ఆ డబ్బు భారాస నేతల జేబుల్లోకి వెళ్లింది. ఇప్పుడు పోల్‌ మేనేజ్‌మెంట్‌ పేరిట మీకు పెద్దమొత్తంలో ఇవ్వబోతున్నారు. ఆ డబ్బంతా మీదే.. మీకే చెందాలి. భారాసకు మరోసారి అవకాశమిస్తే.. ‘ధరణి’ ద్వారా మిగిలిన భూముల్నీ లూటీ చేస్తారు. పేపర్‌ లీకులు కొనసాగిస్తారు. అవినీతి ఆకాశన్నంటడంతోపాటు అప్పు పదింతలు పెరుగుతుంది. రాష్ట్రాన్ని మద్యంలో ముంచెత్తుతారు’’ అని ఆరోపించారు. పదేళ్లలో రైతులకు రుణసాయం దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నా భారాస ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సమస్యల గురించి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే నోరు తెరవరని.. భారాస ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలకే ఉపాధి దొరికింది తప్ప సామన్యులకేం దక్కలేదని ఆరోపించారు. తెలంగాణ కోసం రక్తం చిందించిన యువత ఉద్యోగాలకు పరీక్షలు రాస్తే ప్రశ్నపత్రాలు   లీకేజీల పాలయ్యాయన్నారు. కాళేశ్వరం మొదలుకొని ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు ఏదీ పూర్తికాలేదని.. కమీషన్లు, అవినీతి మాత్రం చోటుచేసుకున్నాయని విమర్శించారు.

కాంగ్రెస్‌తోనే ప్రజాప్రభుత్వం..

‘‘కేసీఆర్‌ రాష్ట్రం రాకముందు ఒకలా.. పాలనలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరించారు. దేశంలో ఫామ్‌హౌస్‌ నుంచి ప్రభుత్వాన్ని నడిపే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదల సంక్షేమం పరుగులు పెడుతోంది. కర్ణాటకలో 5 గ్యారంటీలను అమలు చేస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ప్రజాప్రభుత్వం వస్తుంది. కేసీఆర్‌ పాలనలో అన్నివర్గాలూ సంక్షోభంలో పడ్డాయి. భాజపా, భారాస పార్టీలకు సొంత అభివృద్ధి తప్ప ప్రజల ఆలోచన లేదు. దేశంలోని సంపదనంతా దోచుకునే పార్టీలు ఒకవైపు ఉంటే.. కాంగ్రెస్‌ మాత్రమే ప్రజల పక్షాన ఉంది. పదేళ్లుగా కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాస రెండూ కలిసి నడుస్తున్నాయి. వీటికి ఎంఐఎం జత కలిసింది. దేశ సంపదను మోదీ తనమిత్రుడైన అదానీకి కట్టబెట్టారు.

గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తాం..

తెలంగాణలో గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తాం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, బస్సులో ఉచిత రవాణా కల్పిస్తాం. రైతుభరోసా కింద ఏటా ఎకరాకు రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలతోపాటు ధాన్యానికి రూ.500 బోనస్‌ అందిస్తాం. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుతోపాటు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఉచితంగా ఇంటిస్థలం, రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తాం. రూ.10 లక్షల వరకు ఉచిత ఆరోగ్యబీమా అమలు చేయడంతో పాటు వృద్ధులకు రూ.4 వేల పింఛను ఇస్తాం. యువ వికాసం కింద యువతకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలతోపాటు అమరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతాం. అర్హులైన ఆదివాసీలకు పోడు పట్టాలు అందిస్తాం. దళిత, ఆదివాసీలకు అంబేడ్కర్‌ అభయహస్తం కింద రూ.12 లక్షల ఆర్థికసాయం అందిస్తాం. కల్యాణమస్తు కింద ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తాం. భారాస ప్రభుత్వం ప్రజల్ని దోపిడీ చేసింది. మీరు జాగృతం కాకపోతే.. ప్రశ్నించకపోతే మీకే నష్టం. రేపు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగా నడుచుకోకున్నా ప్రశ్నించాల్సిందే. అయిదేళ్ల భవిష్యత్తుతో కూడిన మీ ఓటును ఎప్పుడూ వ్యర్థం కానివ్వొద్దు’’ అని ప్రియాంక ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు.

రేవంత్‌ పదవి అడగలేదు..: ‘‘రేవంత్‌రెడ్డితో తొలిసారి భేటీ అయినప్పుడు ఇక్కడి ప్రజలపై ఆయనకున్న ఆరాటం అర్థమైంది. ఆ సమయంలో తన 20 ఏళ్ల పోరాటం గురించి వివరించారు. తనకు పదవి కావాలని అడగలేదు. రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి పనిచేయాలనుకుంటున్న తనకు అవకాశమివ్వాలని కోరారు’’ అని ప్రియాంకా గాంధీ తెలిపారు.

ఇందిరమ్మ రాజ్యం కోసం కదలిరండి: రేవంత్‌రెడ్డి

ఈనాడు, మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు కంకణబద్ధులై.. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు కథానాయకులై కదన రంగంలోకి దిగాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కోస్గి సభలో ఆయన మాట్లాడుతూ రాబోయే నాలుగు రోజులు పహారా కాసి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలన్నారు. ‘‘సిరిసిల్ల నుంచి ఓ వ్యక్తి కొడంగల్‌కు వచ్చి ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానన్నారు. ఆయన కొడంగల్‌ను దత్తత తీసుకోవడం కాదు. కొడంగల్‌ నియోజకవర్గమే మొత్తం తెలంగాణను దత్తత తీసుకుంటుంది’’ అని పేర్కొన్నారు. కోస్గిలో సభ ముగిసిన వెంటనే పార్టీ నేతలు కాంగ్రెస్‌ పాటను ప్రారంభించగా అక్కడికి వచ్చిన ప్రజలు ఒక్కసారిగా నృత్యం చేశారు. వేదిక మీద ఉన్న ప్రియాంకా గాంధీ చప్పుట్లు కొడుతూ.. నృత్యం చేస్తూ ప్రజలను ఉత్సాహపరిచారు. పక్కనే ఉన్న రేవంత్‌రెడ్డి కూడా ప్రజలను అనుసరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img