icon icon icon
icon icon icon

ఇక మాటల్లేవ్‌

అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ ప్రచారానికి తెరపడింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారపర్వం ముగిసింది. గత నెలరోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో నిర్వహించిన బహిరంగ సభలు, రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లతో నెలకొన్న సందడి ముగియడంతో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది.

Updated : 29 Nov 2023 07:29 IST

ప్రధాన పార్టీల నుంచి అగ్రనేతల సభలు, రోడ్‌షోలతో హోరెత్తిన తెలంగాణ
మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసిన ప్రచారం
రేపే పోలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ ప్రచారానికి తెరపడింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారపర్వం ముగిసింది. గత నెలరోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో నిర్వహించిన బహిరంగ సభలు, రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లతో నెలకొన్న సందడి ముగియడంతో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. ఈ నెల 30వ తేదీన గురువారం పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా నియోజకవర్గాల్లో ఉద్ధృతంగా సాగిన ప్రచారంలో ప్రధాన పార్టీల నాయకులంతా ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరెత్తించారు. జాతీయ పార్టీలకు చెందిన ప్రధాన నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రాష్ట్రంలో మకాం వేసి పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్రచారం ముగియడంతో వారంతా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇక ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడమే తరువాయి. డిసెంబరు 3వ తేదీన కౌంటింగ్‌.. అదేరోజు ఫలితాలు వెలువడతాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న మూడో ఎన్నిక ఇది. ఇందులో భారాస, కాంగ్రెస్‌, భాజపాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. వీటితో పాటు మజ్లిస్‌, బీఎస్పీ, సీపీఎం, సీపీఐల అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి ప్రచారం నిర్వహించారు.

భారాస నుంచి...

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌: 60 రోజులు, 70 రోడ్‌షోలు, 30 సభలు  (గ్రేటర్‌ హైదరాబాద్‌ నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు)
మంత్రి హరీశ్‌రావు: 60 రోజులు, 80 సభలు, రోడ్‌షోలు
ఎమ్మెల్సీ కవిత: 10 నియోజకవర్గాల్లో 70కి పైగా రోడ్‌షోలు, పాదయాత్రలు, సభలు

కాంగ్రెస్‌ నుంచి..

కాంగ్రెస్‌ తరఫునఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌, ప్రియాంక, ఇతర అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేశారు. కర్ణాటక, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు సిద్దరామయ్య, అశోక్‌ గహ్లోత్‌, భూపేశ్‌ బఘేల్‌, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సహా ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలు తొలిసభ ములుగులో, చిట్టచివరి సభ మల్కాజిగిరిలో ప్రచారం చేశారు.
కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే: బహిరంగ సభలు: 10
ప్రియాంకాగాంధీ: బహిరంగ సభలు, రోడ్‌షోలు: 26
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి: అక్టోబరు 16 నుంచి నవంబరు 28 వరకు ప్రచారం
63 నియోజకవర్గాల్లో 87 ప్రచార సభలకు హాజరు

భాజపా నుంచి..

ఎన్నికల్లో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఇతర భాజపా అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సభలు, ర్యాలీలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ బీసీ ఆత్మగౌరవ సభ, మాదిగ ఉపకులాల విశ్వరూప బహిరంగ సభతో పాటు కామారెడ్డి, మహేశ్వరం, తూప్రాన్‌, నిర్మల్‌, మహబూబాబాద్‌, కరీంనగర్‌ బహిరంగ సభలతో పాటు చివరి కార్యక్రమంగా హైదరాబాద్‌ రోడ్‌షోలో పాల్గొన్నారు.  
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా: 8 రోజుల పాటు ప్రచారం, 17 బహిరంగ సభలు, ఆరు రోడ్‌షోలు
భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా: 5 రోజుల పాటు 8 సభలు, 4 రోడ్‌షోలతో ప్రచారం

వీరితోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌గడ్కరీ, నిర్మలాసీతారామన్‌, స్మృతి ఇరానీ, పీయూష్‌ గోయల్‌, సాధ్వి నిరంజన్‌, అనురాగ్‌సింగ్‌ ఠాకుర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, అస్సాం, గోవా, మహారాష్ట్ర సీఎంలు యోగి ఆదిత్యనాథ్‌, హిమంత బిశ్వశర్మ, ప్రమోద్‌ సావంత్‌, ఏక్‌నాథ్‌ శిందే సహా వివిధ రాష్ట్రాల భాజపా నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కిషన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌: భాజపా-జనసేన కలసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో రెండు పార్టీల అభ్యర్థుల తరఫున జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రచారం నిర్వహించారు. భాజపా అభ్యర్థుల తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర నేతలు కె.లక్ష్మణ్‌, బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌లు సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు.

బీఎస్పీ నుంచి..

మాయావతి: సభలు 2
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌: సభలు 10

వామపక్షాల నుంచి..

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఇంకా వామపక్షాల తరఫున మాణిక్‌సర్కార్‌, బృందా కారాట్‌, బీవీరాఘవులు, కె.నారాయణ, అజీజ్‌పాషా తదితరులు ప్రచారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img