icon icon icon
icon icon icon

ఏ కష్టమొచ్చినా నేను, ప్రియాంక వస్తాం

‘‘నేను, మా చెల్లి ప్రియాంక ఇద్దరమూ తెలంగాణ ప్రజలకు దిల్లీలో సైనికులం. మీకు ఏ అవసరమొచ్చినా ఆదేశాలివ్వండి.. వెంటనే ఇక్కడికొస్తాం. తెలంగాణ ప్రజలతో మాకు కుటుంబ అనుబంధం ఉంది.

Updated : 29 Nov 2023 06:50 IST

తెలంగాణ ప్రజలకు దిల్లీలో మేమిద్దరం సైనికులం: రాహుల్‌ గాంధీ
కేసీఆర్‌కు బైబై చెప్పే సమయమొచ్చిందని వ్యాఖ్య

ఈనాడు-హైదరాబాద్‌, ఆసిఫ్‌నగర్‌, నాంపల్లి, యూసుఫ్‌గూడ, గౌతంనగర్‌, న్యూస్‌టుడే: ‘‘నేను, మా చెల్లి ప్రియాంక ఇద్దరమూ తెలంగాణ ప్రజలకు దిల్లీలో సైనికులం. మీకు ఏ అవసరమొచ్చినా ఆదేశాలివ్వండి.. వెంటనే ఇక్కడికొస్తాం. తెలంగాణ ప్రజలతో మాకు కుటుంబ అనుబంధం ఉంది. మా కుటుంబానికి, ఇందిరా గాంధీకి అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రజలు అండగా నిలిచారు. ఈ విషయాన్ని జీవితాంతం మరచిపోం. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని ప్రజల తెలంగాణగా మారుద్దాం’’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో రోడ్‌షో, నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని మల్లేపల్లి గోకుల్‌నగర్‌ క్రాస్‌రోడ్స్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. యూసుఫ్‌గూడలోని ఓ ఫంక్షన్‌ హాలులో ఆటో, క్యాబ్‌డ్రైవర్లు, జీహెచ్‌ఎంసీ కార్మికులతో భేటీ అయ్యారు. ప్రియాంకా గాంధీ మల్కాజిగిరి రోడ్‌షోలో రాహుల్‌తో కలిసి పాల్గొన్నారు. రోడ్‌షో, సభలో రాహుల్‌ ప్రసంగించారు. ‘‘తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అణాపైసతో సహా కక్కిస్తాం. ప్రజల ఖాతాల్లో జమ చేస్తాం. పదేళ్లలో ప్రజలకు తెరాస ప్రభుత్వం ఏ మాత్రం మేలు చేయలేదు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మూడున్నరేళ్లకే కుంగిపోయింది. ధరణి పోర్టల్‌ పేరుతో 20 లక్షల మంది భూములు లాక్కున్నారు. కులం, మతం పేరుతో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వేషాన్ని, హింసను ప్రేరేపిస్తున్నాయి. ప్రధాని మోదీ మనసులో ఎప్పుడూ ద్వేషం, హింస ఉంటాయి. వాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాడుతోంది. భారత్‌ జోడోయాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల్లో ప్రేమాభిమానాలను పెంచాం. ద్వేషమనే బజార్‌లో ప్రేమ దుకాణం తెరిచాం. తెలంగాణలో కేసీఆర్‌ను, కేంద్రంలో మోదీని గద్దె దించడమే మా లక్ష్యం. తెలంగాణ ప్రజలు బైబై కేసీఆర్‌ అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ప్రజల సర్కారు ఏర్పాటు చేస్తాం. ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం.

మూడు పార్టీలూ ఒక్కటయ్యాయి..

కాంగ్రెస్‌ను ఓడించేందుకు భారాస, భాజపా, ఎంఐఎం ఒక్కటయ్యాయి. తెలంగాణలోనే కాదు.. అస్సాం, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో భాజపాకు సహకరించేందుకు ఎంఐఎం పోటీ చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో మజ్లిస్‌కు బలం లేకపోయినా బరిలోకి దిగుతోంది. మరి తెలంగాణలో అన్నిచోట్లా ఎందుకు పోటీ చేయదు? విపక్షాలపై సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను ఉసిగొల్పుతున్న భాజపా సర్కారు.. కేసీఆర్‌, అసదుద్దీన్‌ ఒవైసీలపై ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడానికి కారణం.. ఆ రెండు పార్టీలతో ఉన్న బలమైన సంబంధమే. నాపై వేర్వేరు రాష్ట్రాల్లో 24 కేసులున్నాయి. పరువు నష్టం కేసులో నా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, ఇల్లు కూడా లాక్కున్నారు. ఆయనతో సీఎం కేసీఆర్‌, అసదుద్దీన్‌ కొట్లాడితే వారిద్దరిపై కేసులు ఎందుకు పెట్టలేదు? శాసనసభ, లోక్‌సభ సభ్యత్వాలు ఎందుకు రద్దు చేయలేదు? బీసీని సీఎం చేస్తానంటున్న భాజపా.. ఇక్కడ కనీసం 2 శాతం ఓట్లయినా గెలిచి చూపించాలి’’ అని రాహుల్‌ సవాల్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img