డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతోనే రాష్ట్రం భద్రం

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలు ఓడిపోయి ప్రజలు, ప్రజాస్వామ్యం గెలవాలని భాజపా కోరుకుంటోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవహేళన చేసే పార్టీకి, సామాజిక తెలంగాణకు అడ్డుగా ఉన్న మరో పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

Updated : 29 Nov 2023 07:21 IST

భాజపాకు భారీ విజయం తథ్యం
అవినీతి, కుటుంబ పార్టీలు ఓడి.. ప్రజాస్వామ్యం గెలవాలి
విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలు ఓడిపోయి ప్రజలు, ప్రజాస్వామ్యం గెలవాలని భాజపా కోరుకుంటోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవహేళన చేసే పార్టీకి, సామాజిక తెలంగాణకు అడ్డుగా ఉన్న మరో పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ, భావితరాల భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా భాజపాకు ఓటేయాలని కోరారు. భాజపా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నేతృత్వంలోనే తెలంగాణ భద్రంగా ఉంటుందన్నారు. భాజపా మీడియా సెంటర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలసి ఆయన మాట్లాడారు. మరోసారి రాష్ట్రం భారాస, కాంగ్రెస్‌ చేతుల్లోకి వెళ్లకూడదన్నారు. చైతన్యవంతులైన రాష్ట్ర ప్రజలు తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అడ్డుగా ఉన్న పార్టీలకు బుద్ధి చెబుతారన్నారు. ప్రచారం ఆరంభం నుంచి రోజురోజుకూ భాజపాకు ఆదరణ పెరిగిందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాల ప్రచార కార్యక్రమాలు, రోడ్‌ షోలు పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని డబ్బుతో, మద్యంతో కొనేందుకు భారాస, కాంగ్రెస్‌లు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. 30వ తేదీన ప్రజలు సునామీలాగా వచ్చి భాజపాకు అనుకూలంగా ఓటేస్తారని, డిసెంబరు మూడో తేదీన పార్టీ భారీ విజయంతో అధికారంలోకి రానుందన్నారు. మొట్టమొదటి బీసీ సీఎం ఈ గడ్డపై బాధ్యతలు తీసుకోబోతున్నారన్నారు. బలహీన వర్గాల ప్రజలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు భాజపాకు అండగా నిలుస్తున్నారన్నారు. మైనారిటీ మహిళలు భాజపాను ఆదరిస్తున్నారని అన్నారు. ఎంఐఎంను పెంచి పోషించింది కాంగ్రెస్‌ పార్టీయేనని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 369 మంది చనిపోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. తెలంగాణ పట్ల 5 దశాబ్దాలుగా వివక్ష చూపిన కాంగ్రెస్‌, గత పదేళ్లుగా దోపిడీ చేసిన భారాసకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సామాజిక వర్గం ఆలోచించి ఓటు వేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు