అభివృద్ధిని చూడండి... ఆశీర్వదించండి

‘మేం గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారు. సగం కాలిన కడుపులు, ఎమర్జెన్సీ.. కర్ఫ్యూలు.. ఎన్‌కౌంటర్లు.. రక్తపాతాలు.. కరెంటు కోతల వంటి వెతలతో నిత్యం ప్రజలు కన్నీళ్లు కార్చే ఆ రాజ్యాన్ని మనం మళ్లీ తెచ్చుకోవద్దు.

Updated : 29 Nov 2023 06:47 IST

పేదలు లేని తెలంగాణ నా స్వప్నం
రాష్ట్రాన్ని గోస పెట్టిందే కాంగ్రెస్‌
ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వని  భాజపాకు ఓటేయొద్దు
ఓరుగల్లు, గజ్వేల్‌ ప్రజా ఆశీర్వాద  సభలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, వరంగల్‌; గజ్వేల్‌, న్యూస్‌టుడే: ‘మేం గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారు. సగం కాలిన కడుపులు, ఎమర్జెన్సీ.. కర్ఫ్యూలు.. ఎన్‌కౌంటర్లు.. రక్తపాతాలు.. కరెంటు కోతల వంటి వెతలతో నిత్యం ప్రజలు కన్నీళ్లు కార్చే ఆ రాజ్యాన్ని మనం మళ్లీ తెచ్చుకోవద్దు. తెలంగాణ సాధించి, ప్రగతి పథాన నిలబెట్టిన భారాసనే గెలిపించండి’ అని భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘తద్దినం భోజనానికి పిలిస్తే.. మీ ఇంట్లో ఎప్పటికీ భోజనం ఇలాగే ఉండాలన్నాడట ఒకడు.. అలాగుంది కాంగ్రెస్‌ నాయకుల తీరు’ అని మండిపడ్డారు. మంగళవారం వరంగల్‌, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలలో ఆయన ప్రసంగించారు. గజ్వేల్‌లో స్వయంగా కేసీఆరే పోటీ చేస్తుండగా వరంగల్‌ పశ్చిమలో దాస్యం వినయ్‌భాస్కర్‌, తూర్పులో నన్నపునేని నరేందర్‌ బరిలో ఉన్నారు. గజ్వేల్‌ సభతో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ఈ సభలలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ మోసం చేస్తే తట్టుకుని నిలబడ్డామని.. రాదనుకున్న తెలంగాణను సాధించామని.. తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధి మీ కళ్లముందు ఉందని అన్నారు. కాంగ్రెస్‌ 50 ఏళ్ల చరిత్రను, భారాస పదేళ్ల పరిపాలనను బేరీజు వేసుకొని ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు. ‘‘వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నాకు 70 ఏళ్లు వస్తాయి. తెలంగాణ సాధించిన గౌరవం ఆకాశమంత ఉంది. తెలంగాణ అద్భుతంగా బాగుపడాలి. 100 శాతం అక్షరాస్యత సాధించాలి. పేదలు లేని రాష్ట్రం కావాలన్నదే నా స్వప్నం. ప్రతి నియోజకవర్గంలో ఆహార శుద్ధి పరిశ్రమలు రావాలి. అందరికీ ఉపాధి కల్పించాలి. పేదలకు చేతినిండా పనులు ఉండాలి. కులం, మతం జాతి లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ దిశగా పని చేస్తున్నా. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొన్న అనేక మంది పేదలకు పట్టాలిచ్చాం. ఇంకా కొందరికి ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల తర్వాత వంద శాతం వారికి పట్టాలిస్తాం.

మరింత వృద్ధి కావాలంటే...

భారాస ప్రభుత్వంలో తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో పల్లె దవాఖానాలు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. కంటివెలుగు, అమ్మఒడి, కల్యాణలక్ష్మి లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. 1,019 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటవుతున్నాయి. కాంగ్రెస్‌ రాజ్యంలో ఊ... అంటే కర్ఫ్యూలు, మతకల్లోలాలు. పదేళ్లలో మేము ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నాం. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు కల్పించినా అభివృద్ధిని ఆపలేదు. మరింత వృద్ధి కావాలంటే భారాస ప్రభుత్వం మరోసారి రావాలి.

గజ్వేల్‌కు కాలుష్యరహిత పరిశ్రమలు తెస్తా

గజ్వేల్‌ ప్రజలు నన్ను రెండు సార్లు గెలిపించారు. మూడోసారి గెలిపిస్తే గజ్వేల్‌ను మరింతగా తీర్చిదిద్దుతా. కాలుష్యరహిత పరిశ్రమలు తీసుకొస్తా. రైల్వేస్టేషన్‌ వద్ద కూరగాయల మార్కెట్‌ను నెలకొల్పుతా. కొండపోచమ్మ, నాచారం దేవాలయాలను అభివృద్ధి చేస్తా. మల్లన్నసాగర్‌కు పర్యాటకులు వస్తుంటారు.. వారిని ఆకట్టుకునేలా 7వేల ఎకరాల్లో పనులు చేపడతాం. ముంపు గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం. వారి త్యాగంతోనే 12 జిల్లాలకు గోదావరి జలాలు పారుతున్నాయి.

ఉద్యమంలో కీలక ఘట్టాలకు ఓరుగల్లు వేదిక

తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలకు ఓరుగల్లు వేదికగా నిలిచింది. ఉద్యమంలో అతి భారీ బహిరంగ సభ ఇక్కడే నిర్వహించాం. ఉద్యమాన్ని నేను తలకెత్తుకున్న రోజులో నన్ను నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రజా కవి కాళోజీ, ఆచార్య జయశంకర్‌ సార్‌లను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నా. నాడు కాంగ్రెస్‌ వారు రాష్ట్రాన్ని ఇవ్వకపోగా ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని మలినం చేశారు. చూసి చూసి విసిగిపోయి నేను వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయానికి వచ్చా. విద్యార్థుల మధ్య కూర్చొని కేసీఆర్‌ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని చెప్పా. తర్వాత ఆమరణ దీక్షకు కూర్చుంటే తెలంగాణ ఇస్తామని ప్రకటన చేశారు. ఆ తర్వాత కూడా ఇవ్వకుండా మరి కొంత కాలం ఏడిపించారు. అప్పుడు ఉద్యోగులు, విద్యార్థులు సకల జనుల సమ్మె చేసి బీభత్సం సృష్టిస్తే, దేశంలోని అన్ని రాష్ట్రాలు మద్దతిస్తే అప్పుడు కాంగ్రెస్‌ దిగివచ్చింది. ఇదీ ఆ పార్టీ చరిత్ర.

వరంగల్‌ మెగా జౌళి పార్కులో లక్ష ఉద్యోగాలు

వరంగల్‌లో నిజాం కాలం నాటి అజంజాహి మిల్లు ఉంటే దాన్ని ముంచిందే కాంగ్రెస్‌ పార్టీ. ఆ భూములను రియల్‌ ఎస్టేట్‌ కింద ఎవరు అమ్ముకున్నారు? ఈ విషయంపై భారాస ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చి ఆ పాత గౌరవం పోయిందని చెబితే వరంగల్‌కు సమీపంలోని గీసుకొండ దగ్గర కాకతీయ మెగా జౌళి పార్కు స్థాపించాం. చాలా పెద్ద కంపెనీలు వచ్చాయి. మరో ఏడాది రెండేళ్లలో లక్ష మందికి అక్కడ ఉద్యోగాలు రాబోతున్నాయి. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వరంగల్‌లోనే ఏర్పాటుచేశాం. భవిష్యత్తులో వరంగల్‌ను ఉజ్వలంగా చూడాలని ఉంది. తూర్పు తెలంగాణ ప్రాంతానికి కేంద్రంగా వరంగల్‌ను తీసుకొని ఒక పెద్ద డెయిరీ ప్రారంభించాలని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌కు చెప్పా. వరంగల్‌ నగర అభివృద్ధి ఇప్పుడే మొదలైంది.. ఇక ఆగదు. ఇప్పుడు వరంగల్‌లో కడుతున్న 24 అంతస్తుల ఆసుపత్రి హైదరాబాద్‌లో కూడా లేదు. త్వరలో హైదరాబాద్‌ నుంచే వరంగల్‌కు వచ్చి చికిత్స చేయించుకునే పరిస్థితి వస్తుంది. దేశంలోనే ఇంత గొప్ప మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎక్కడాలేదు. వరంగల్‌కు మరిన్ని పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు వస్తాయి. వాటిని తెచ్చే బాధ్యత నాదే. బీసీ అభ్యర్థులున్న చోట బీసీ బిడ్డలంతా ఒక్కటై భారాస అభ్యర్థులను గెలిపించాలి’’ అని సీఎం కేసీఆర్‌ కోరారు.


ప్రధాని నరేంద్రమోదీ దేశంలో 157 వైద్య కళాశాలలు పెడితే వందసార్లు అడిగినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ పాఠశాల ఇవ్వాలన్న చట్టాన్నీ ఉల్లంఘిస్తున్నారు. అందుకని భాజపాకు ఒక్క ఓటు కూడా వేయొద్దు. మనం తెలివితక్కువవాళ్లం కాదన్న విషయాన్ని 30న ఓటు ద్వారా నిరూపించాలి.


తెలంగాణ తెచ్చుకుని పాలన ప్రారంభించిన తొలినాళ్లలో మన శత్రువులైన సమైక్యవాదులు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేశారు. వాటన్నింటినీ తట్టుకున్నాం. ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం.


నెహ్రూ, ఇందిరమ్మ కాలంలోనే దళితుల అభివృద్ధికి మంచి పనులు చేసి ఉంటే ఇప్పటికీ దళితులు ఎందుకు దారిద్య్రంలో మగ్గుతున్నారు? వారు సమాజంలో అందరితోపాటు ఆర్థికంగా ఎదగాలనే దళితబంధు తీసుకొచ్చాం. అందుకే ప్రజలు పార్టీల నడవడిక, చరిత్ర చూసి ఓటేయాలని కోరుతున్నా. వ్యవసాయానికి 24 గంటల కరెంటు కొనసాగాలంటే మళ్లీ భారాస ప్రభుత్వమే రావాలి.


తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోటలో సమైక్యవాదులను తీసుకొచ్చి సమావేశం పెడతామన్న వారే ఇప్పుడు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు.

సీఎం కేసీఆర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు