స్వతంత్రుల పోటీ ఎవరికి ముప్పో.. 15 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు గుబులు!

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులుగానో, ఏదో ఒక పార్టీ గుర్తు తెచ్చుకొనో కొందరు పోటీలో నిలిచి ఓ మోస్తరు ఓట్లు తెచ్చుకొనే పరిస్థితి ఉన్నచోట ప్రధాన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

Updated : 29 Nov 2023 08:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులుగానో, ఏదో ఒక పార్టీ గుర్తు తెచ్చుకొనో కొందరు పోటీలో నిలిచి ఓ మోస్తరు ఓట్లు తెచ్చుకొనే పరిస్థితి ఉన్నచోట ప్రధాన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వారికి వచ్చే ఓట్లు ప్రధాన పార్టీల్లో దేనిని దెబ్బతీస్తాయా అన్న చర్చ సాగుతోంది. సుమారు 15 నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. భారాస, కాంగ్రెస్‌, భాజపా-జనసేన కూటమి, బీఎస్పీ అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నాయి. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన పలువురు రెబల్స్‌గా నామినేషన్‌ వేశారు. ఎక్కువ మంది నామినేషన్లు ఉపసంహరించుకొన్నా కొన్ని చోట్ల బరిలో కొనసాగడంతోపాటు ఫార్వర్డ్‌బ్లాక్‌, బీఎస్పీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మరికొన్నిచోట్ల ఓ మాదిరిగా ప్రభావం చూపే స్వతంత్రులు రంగంలో ఉన్నారు.

మచ్చుకు కొన్ని చోట్ల ఇలా..

  • నల్గొండలో భారాస నుంచి టికెట్‌ ఆశించి రాకపోవడంతో పిల్లి రామరాజుయాదవ్‌ ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన చీల్చే ఓట్లు ఇక్కడ ప్రధాన పార్టీలైన భారాస, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఎవరిపై ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.
  • సూర్యాపేటలో భారాస నుంచి బయటకు వచ్చిన వట్టే జానయ్య యాదవ్‌ చివరి నిమిషంలో బీఎస్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయన డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా పని చేశారు. మంత్రితో విభేదించి బయటకు వచ్చి పోటీలో నిలిచి గట్టిగా ప్రచారం చేశారు. ఇక్కడ భారాస, కాంగ్రెస్‌, భాజపాల మధ్య త్రిముఖపోటీ నెలకొన్న నేపథ్యంలో జానయ్యకు వచ్చే ఓట్లు కీలకం కానున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎక్కువగా పొందితే కాంగ్రెస్‌పైనా, ఇంతకాలం ఉన్న పార్టీ ఓట్లు చీల్చితే భారాసపైన ప్రభావం పడే అవకాశం ఉంది.
  • కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఫార్వర్డ్‌బ్లాక్‌ తరఫున చివరి నిమిషంలో బరిలోకి దిగారు. దీంతో ఇక్కడ త్రిముఖపోటీ నెలకొంది. గెలుపోటములే కాకుండా ఇక్కడ మూడోస్థానం ఎవరిదన్నది కూడా ప్రధానాంశంగా మారింది.
  • రామగుండంలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సీనియర్‌ రాజకీయ నాయకుడుగా ఉన్న ఆయన పొందే ఓట్లు రెండు ప్రధాన పార్టీల భవిష్యత్తును తేల్చనుంది.
  • కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న బర్రెలక్క(శిరీష) రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి వెళ్లి ప్రచారం చేశారు. ఈమెకు ఎక్కువ ఓట్లు వస్తే తమ భవిష్యత్తు తారుమారవుతుందేమో అన్న ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది.
  • బీఎస్పీ నుంచి సిర్పూరు కాగజ్‌నగర్‌లో పోటీలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ ప్రధాన పార్టీలకు సవాలు విసురుతుండగా, పెద్దపల్లిలో పోటీలో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి దాసరి ఉష కూడా గట్టిపోటీ ఇస్తున్నారు. పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు ఆమెకు మద్దతుగా బీఎస్పీలో చేరారు. ఉషకు వచ్చే ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్థులపై ప్రభావం చూపనున్నాయి.
  • పటాన్‌చెరులో కాంగ్రెస్‌ టికెట్‌ పొంది తర్వాత బీ-ఫాం మరొకరికి ఇవ్వడంతో బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉన్న నీలం మధు ముదిరాజ్‌కు వచ్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీలకు సమస్యగా మారే అవకాశం ఉంది.
  • మక్తల్‌లో భారాస టికెట్‌ ఆశించి రాకపోవడంతో వర్కటం జగన్నాధరెడ్డి బీఎస్పీ నుంచి పోటీ  చేస్తున్నారు. ఆయన కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో ఆయనకు వచ్చే ఓట్లు ప్రధాన అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్దేశించే అవకాశం ఉంది.
  • ఇతర నియోజకవర్గాల్లో కూడా బీఎస్పీకి వచ్చే ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. జహీరాబాద్‌లో బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న జంగం గోపి చీల్చే ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయించనున్నాయి. అలాగే గద్వాలలో నడిగడ్డ పోరాట సమితికి చెందిన రంజత్‌కుమార్‌ ఫార్వర్డ్‌బ్లాక్‌ నుంచి పోటీలో ఉన్నారు.  ఆయన గత ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ తరఫున పోటీ చేశారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి సంజీవరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు.
  • సీపీఎం 19 స్థానాల్లో పోటీ చేస్తోంది. పాలేరు, మిర్యాలగూడ, భద్రాచలం, ఇబ్రహీంపట్నంతోపాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం పడే అవకాశం ఉంది. వీటిల్లోని పలు చోట్ల గెలుపోటముల మధ్య ఓట్ల శాతం తక్కువగా ఉంటుందని, బీఎస్పీ లేదా సీపీఎంకు ఈ తేడా కంటే ఎక్కువ ఓట్లు రావొచ్చనే చర్చ సాగుతోంది. అయిదు నుంచి పదివేల వరకు ఓట్లు పొందే స్వతంత్రులు లేదా పార్టీల వారు బరిలో ఉన్న చోట ప్రధాన పార్టీల అభ్యర్థుల భవిష్యత్తు తారుమారయ్యే అవకాశం ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని