icon icon icon
icon icon icon

తప్పుడు సర్వేలను తిప్పికొట్టండి

కాంగ్రెస్‌, భాజపాలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేస్తున్న ప్రచారాన్ని, తప్పుడు సర్వేలను తిప్పికొట్టాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా భారాస నాయకత్వానికి ప్రజలు నీరాజనం పడుతున్నారని..

Updated : 29 Nov 2023 07:02 IST

3న గులాబీ ప్రభంజనం ఖాయం
కాంగ్రెస్‌, భాజపాలు ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయి
హ్యాట్రిక్‌ సీఎంగా అరుదైన ఘనత సాధించనున్న కేసీఆర్‌
భారాస సైనికులు ఉత్సాహంతో పనిచేయాలి
కామారెడ్డి, సిరిసిల్ల రోడ్‌ షోలలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల - ఈనాడు, కామారెడ్డి: కాంగ్రెస్‌, భాజపాలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేస్తున్న ప్రచారాన్ని, తప్పుడు సర్వేలను తిప్పికొట్టాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా భారాస నాయకత్వానికి ప్రజలు నీరాజనం పడుతున్నారని.. నిశ్శబ్ద పాజిటివ్‌ ఓటింగ్‌కు సిద్ధంగా ఉన్నారని, డిసెంబరు 3న గులాబీ ప్రభంజనం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. సిరిసిల్ల, కామారెడ్డిలలో మంగళవారం ఆయన రోడ్‌ షోలు నిర్వహించారు. సిరిసిల్ల భారాస కార్యాలయంలో విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో దక్షిణ భారతదేశంలో ఏ నాయకుడూ సాధించని అరుదైన ఘనత డిసెంబరు 3న కేసీఆర్‌కు దక్కబోతుందని కేటీఆర్‌ తెలిపారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్‌ సృష్టించనున్నట్లు వెల్లడించారు. పూర్తి విశ్వాసంతో చెబుతున్నానని.. విజయం మనదేనని, రాబోయే రెండ్రోజులు భారాస సైనికులు ఉత్సాహంతో పని చేయాలన్నారు. రాష్ట్ర ప్రజలు పదేళ్లుగా తమపై పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకున్నామని తెలిపారు. దశాబ్దాల బాధలు, కన్నీళ్లు తొలగి ప్రజలు కడుపునిండా తిని, కంటి నిండా నిద్రపోయేలా పనులు చేశామన్నారు. ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని చెప్పారు. విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని ఇటుక ఇటుక పేర్చి పునర్నిర్మాణం చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో సంపద పెంచి సకల జనులకు పంచి, తక్కువ అప్పులు, ఎక్కువ ఆదాయంతో సంక్షేమ రాష్ట్రంగా దేశానికి నమూనాగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.

అభివృద్ధితో మారిన రాష్ట్ర ముఖచిత్రం

ప్రజలే కేంద్రంగా వారి సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా తొమ్మిదిన్నరేళ్లు పాలన కొనసాగిందని కేటీఆర్‌ చెప్పారు. అప్పుడు ఎలా ఉన్న తెలంగాణ, నేడు ఎలా మారిందో ప్రజలు ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలని కోరారు. పడావుపడ్డ భూములు, పాడుబడ్డ ఇళ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరవులు, కర్ఫ్యూలు, ఎన్‌కౌంటర్లు, కరెంటు కోతలతో అల్లాడిన తెలంగాణ ముఖచిత్రం మారుతూ వచ్చిందని వివరించారు. పాలమూరులో వలసలు ఆగాయని, నల్గొండలో ఫ్లోరైడ్‌ బాధ లేదని, చేనేత కార్మికులకు చేతినిండా పనిదొరికి మగ్గానికి మంచి రోజులు వచ్చాయని చెప్పారు. రైతులు అర్ధరాత్రి వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్లి పాములు కాటేసి మృత్యువాత పడ్డ రోజులు మాయమయ్యాయని వివరించారు. 24 గంటల నాణ్యమైన కరెంటుతో ఏటా రెండు పంటలు పండుతున్నాయన్నారు. ఈ రోజు దేశానికే అన్నపెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారిందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి నాయకుడు లేడని, సీఎం స్థాయి నాయకుడు అసలే లేడని విమర్శించారు.

ఎసైన్డ్‌ భూములకు పట్టాలు.. బీడీ కార్మికులందరికీ పింఛన్లు

మళ్లీ రాగానే ఎసైన్డ్‌ భూములు ఉన్నవారందరికీ పట్టాలు పంపిణీ చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. మిగిలిపోయిన బీడీ కార్మికులకీ పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అన్నపూర్ణ పథకం కింద తెల్లరేషన్‌ కార్డు కలిగిన ప్రతి ఇంటికీ సన్నబియ్యం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మోదీ అధికారం చేపట్టకముందు గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.400 మాత్రమే ఉండేదని.. ప్రస్తుతం రూ.1,200కు చేరిందన్నారు. ఈ నేపథ్యంలో రూ..800 రాయితీ ఇచ్చి రూ.400లకే సిలిండర్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారన్నారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్లుగా తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు మతం, కులం పేరుతో రెచ్చగొడుతూ ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. వాటి పట్ల జాగ్రత్తగా ఉండి ప్రగతికి పట్టం కట్టాలన్నారు. తెలంగాణ ప్రగతికి తోడ్పాటునందించే పార్టీకి ఓటు వేసి పనులు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకే కేసీఆర్‌ ఇక్కడి నుంచి పోటీచేస్తున్నారని తెలిపారు.


హైదరాబాద్‌కు తరలివచ్చిన అంతర్జాతీయ సంస్థలు

మన ఉద్యోగాలు మనకే కావాలని 95 శాతం స్థానికత ఉండేలా జోనల్‌ వ్యవస్థను తీసుకొచ్చాం. 2.32 లక్షల ఉద్యోగాలకు ఉత్తర్వులు ఇచ్చి 1.6 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాం. యువత ఆవేశపడకుండా ఈ వాస్తవాన్ని గుర్తించాలి. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 44 శాతం రాష్ట్రానికి చెందినవారే.అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌కు తరలివచ్చిన మాట వాస్తవం కాదా?

కేటీఆర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img