icon icon icon
icon icon icon

ఒకసారి అమ్ముడుపోతే.. ఐదేళ్లు కష్టాలే!

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా సెల్‌ఫోన్లకు వందల పోస్టులు వచ్చిపడుతూ ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Updated : 30 Nov 2023 07:11 IST

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా సెల్‌ఫోన్లకు వందల పోస్టులు వచ్చిపడుతూ ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తమ పార్టీకే ఎందుకు ఓటెయ్యాలో, ప్రత్యర్థి పార్టీకి ఎందుకు వేయకూడదో వివరిస్తూ, తమ హామీలను వెల్లడిస్తూ... రీల్స్‌, మీమ్స్‌, వీడియోలు, ఫొటోలు, ప్రకటనల రూపంలో పోస్టులను వెల్లువెత్తిస్తున్నారు. ఇదే సమయంలో ఓటర్లను చైతన్యపరుస్తూ కొందరు యువకులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రొఫెసర్లు స్ఫూర్తిదాయక అంశాలను పోస్టు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయాలని, అభ్యర్థులు, పార్టీలు ఇచ్చే తాయిలాలు తీసుకోవద్దని, ఒకసారి అమ్ముడుపోతే అయిదేళ్లు కష్టాలు అనుభవించాల్సి వస్తుందని అప్రమత్తం చేస్తున్నారు. వాటిలో కొన్ని....


కష్టాలు ఎవరికీ ఊరికే రావు... ఓట్లు అమ్ముకుంటేనే వస్తాయి.


పాలిచ్చే గేదె ధర రూ.లక్ష. పెంపుడు కుక్క ఖరీదు రూ.20 వేలు, మేకకు రూ.10 వేలు. కానీ, అమూల్యమైన ఓటును రూ.500, రూ1000లకు అమ్ముకుందామా?


ఒక పూటలో తినేసే కూరగాయలను ఏరిఏరి కొంటాం. మరి అయిదేళ్లు పాలించే నాయకులను ఎన్నుకునేందుకు ఎంత ఆలోచించాలి...?


జీవుల మనుగడకు ప్రాణవాయువు, ప్రజాస్వామ్య మనుగడుకు ఓటు.


సాయం చేశాడు... భుజాలపై ఎక్కాడు!

ఒక వ్యక్తి కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో నడుస్తున్నాడు. దీన్ని చూసిన మరో వ్యక్తి  అతనికి తన చెప్పులు ఇచ్చాడు. ఖర్చులకు కొంత నగదునూ ముట్టజెప్పాడు. సూర్యుని నుంచి రక్షణకు గొడుగూ అందజేశాడు. అయితే... ప్రతిఫలంగా తనను మోయాలని షరతు పెట్టాడు. ఉచితాల పేరుతో రాజకీయ నాయకులు చేసేదీ ఇదేనంటూ పోస్టు వైరల్‌ అవుతోంది.


గొర్రెలకు ఉన్ని కోట్లు!

ఒకానొక చలికాలంలో ఓ మహారాజు తన రాజ్యంలోని గొర్రెలన్నింటికీ ఉన్ని కోట్లను ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు. అప్పుడా రాజ్యంలోని గొర్రెలన్నీ ఖుషీగా పండగ చేసుకున్నాయి. ‘రాజువయ్యా మహారాజు వయ్యా’ అంటూ పొగిడాయి. అదే సమయంలో ఒక అమాయకపు గొర్రె మాత్రం ‘రాజా... అంత ఉన్ని ఎక్కడి నుంచి తెస్తారు’ అని అడిగింది. దాంతో రాజు చాలా సహజంగా ‘ఇంకెక్కడి నుంచి మీ గొర్రెల నుంచే తీస్తాం’ అని సమాధానం ఇచ్చాడు. ఉచిత పథకాలు కూడా అంతే అంటూ సందేశం ఇస్తున్న పోస్టు ఒకటి వైరల్‌ అవుతోంది.

 న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌


నేను నా దేశ ప్రజల చేతికి పదునైన కత్తి ఏదీ ఇవ్వలేదు. నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే. అది కత్తి కంటే పదునైనది. దాని సాయంతో పోరాడి రాజులవుతారో.. అమ్ముకుని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది వారే.

 డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌


ఓటిచ్చినప్పుడే ఉండాలి బుద్ధి.. ఎన్నుకొని తలబాదుకొన్న నేమగును?తర్వాత ఏడ్చినను తప్పదనుభవము..

 కాళోజీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img