icon icon icon
icon icon icon

KTR: మళ్లీ మేమే గెలవబోతున్నాం

డిసెంబరు మూడో తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో మరోసారి విజయం సాధించేది భారాసయేనని.. హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌ అధికారంలోకి రాబోతున్నారని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Updated : 01 Dec 2023 10:49 IST

70కిపైగా స్థానాలు సాధిస్తాం
పోలింగ్‌ జరుగుతుండగానే ఎగ్జిట్‌ పోల్స్‌ ఏమిటి?
ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: డిసెంబరు మూడో తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో మరోసారి విజయం సాధించేది భారాసయేనని.. హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌ అధికారంలోకి రాబోతున్నారని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. 88 సీట్లు వస్తాయని భావించామని.. వేర్వేరు కారణాల వల్ల 70కి పైగా స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. ఇంకా పోలింగ్‌ జరుగుతుండగానే.. అప్పుడే ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించడం సరికాదని ఆయన తెలిపారు. పోలింగ్‌ కోసం వరుసల్లో నిలబడే అత్యధికుల వద్ద ఫోన్లు ఉంటాయని, ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రభావం ఓటర్లపై పడే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో ఈ విషయంపై మాట్లాడితే.. ఎన్నికల సంఘం నిబంధనలు అలాగే ఉన్నాయని చెప్పారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంపై ఆలోచించి.. భవిష్యత్తులోనైనా ఇలా పోలింగ్‌ ముగియకుండా ఎగ్జిట్‌ పోల్స్‌ను విడుదల చేసే విధానాలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గురువారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘‘గత మూడున్నర నెలలుగా ఎన్నికల కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసేందుకు పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పోలీసులకు కృతజ్ఞతలు. పోలింగ్‌ శాతం తగ్గిందనేది సమస్య కాదు. ఎంత ఓటింగ్‌ జరిగితే.. అందులో సగానికిపైగా వస్తే వారిదే విజయం. ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్న దానితో సంబంధం లేకుండా మా విజయం పైన పూర్తి ధీమాగా ఉన్నాం. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తప్పు అని నిరూపించడం మా పార్టీకి కొత్త కాదు. 2018లో కూడా ఇలాంటి తప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌తో ప్రజలను అయోమయానికి గురిచేశారు. అప్పుడు కేవలం ఒక్క ఏజెన్సీ మినహా మిగతావన్నీ తప్పుడు ఫలితాలను సూచించాయి.

2018లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చాం. ఎగ్జిట్‌ పోల్స్‌తో తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేయాలని చేసిన ప్రయత్నం ఫలించదు. ఒకపక్క ఓటర్లు పెద్ద సంఖ్యలో వరుసల్లో నిలబడి ఓటు వేయడం కోసం ఎదురుచూస్తున్నప్పుడు.. ఇలా తప్పుడు సమాచారంతో ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా ప్రజలను ప్రభావితం చేయాలనుకోవడం తప్పు. పూర్తిస్థాయి ఓటింగ్‌ జరగనప్పుడు.. ఈ ఎగ్జిట్‌ పోల్స్‌లో నిజానికి హేతుబద్ధతే లేదు. ఎక్కడ ఎంత పోలింగ్‌ అయ్యిందనేది శుక్రవారం ఉదయంగానీ తెలియదు. అప్పుడు సావధానంగా విశ్లేషించుకోవచ్చు. ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ని చూసి కార్యకర్తలు, నాయకులు అయోమయానికి గురై, కంగారు పడాల్సిన అవసరం లేదు. అసలైన ఫలితం డిసెంబరు మూడో తేదీన వస్తుంది. కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పని తేలితే.. మూడో తేదీన తెలంగాణ ప్రజలకు ఆయా సంస్థలు క్షమాపణ చెప్పాలి. ఇలాంటి తప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ను విడుదల చేస్తే.. ఆయా సంస్థల విశ్వసనీయతే దెబ్బతింటుంది. వాళ్లను ఇంకోసారి ప్రజలు నమ్మరు. దుష్ప్రచారాలు, అబద్ధాలు, నకిలీ వీడియోలతో ప్రజలను ప్రభావితం చేసేలా పని చేస్తున్న పార్టీలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’’ అని కేటీఆర్‌ కోరారు.


బాధ్యతగా ఓటు వేశా: కేటీఆర్‌

బంజారాహిల్స్‌, సిరిసిల్ల గ్రామీణం - న్యూస్‌టుడే: బాధ్యత కలిగిన తెలంగాణ పౌరుడిగా ఓటువేశానని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వారికి ఓటేశానని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌ వెంకటేశ్వరకాలనీ డివిజన్‌ పరిధి నందినగర్‌లోని పోలింగ్‌ బూత్‌లో కేటీఆర్‌ తన సతీమణి శైలిమతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు సిరిసిల్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలను కేటీఆర్‌ సందర్శించారు. ఎన్నికల అధికారులను పోలింగ్‌ శాతం అడిగి తెలుసుకున్నారు. యువ ఓటర్లను కలిసి వారితో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహపరిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img